కవిత చేసిన అవినీతి ఆరోపణలపై బీఆర్ఎస్ లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నట్లుగా కనిపిస్తోంది. సంతోష్ రావు, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డితో కలిసి మోకిలాలో భారీ విల్లా ప్రాజెక్టు నిర్మిస్తున్నారని .. దానికి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయని కవిత ప్రశ్నించారు. ఆ తర్వాత ఎమ్మెల్సీ పోచంపల్లి ఎవరు.. అతి సాధారణ కుటుంబం నుంచి వచ్చిన ఆయన ఇలా వందల కోట్లు ఎలా సంపాదించారన్న చర్చ జోరుగానే నడిచింది. ఇలాంటి సమయంలో పోచంపల్లిని ఫామ్ హౌస్‌కి పిలింపించారు.
లండన్ నుంచి వచ్చిన హరీష్ రావు.. విశ్రాంతి తీసుకోకుండా కొన్ని కార్యక్రమాల్లో పాల్గొని ఫామ్ హౌస్ కు వెళ్లిపోయారు. అప్పటికే అక్కడ కేటీఆర్ సహా కీలక నేతలు ఉన్నారు. పోచంపల్లిని, శంభీపూర్ రాజును కూడా పిలిపించారు. దీంతో ఏదో పెద్ద చర్చే ఫామ్ హౌస్‌లో జరుగుతోందన్న అభిప్రాయం వినిపిస్తోంది. ముఖ్య నేతల సమావేశం అని.. భవిష్యత్ కార్యాచరణపై చర్చిస్తున్నారని మీడియాకు లీకులు ఇస్తున్నారు కానీ.. ముఖ్యనేతల కేటగిరిలో పోచంపల్లి, శంభీపూర్ రాజు ఉండరు. మరి ఎందుకు వారిని పిలిపించారు ?
హరీష్ రావు కూడా కవిత చేసిన ఆరోపణపై ఎలా స్పందిస్తారన్నది ఆసక్తికరం. బయటకు అయితే ఆయన విధేయత చూపిస్తున్నారు. ఇప్పటికైతే పార్టీ ఆయనకు మద్దతుగానే ఉంది. కానీ హరీష్ రావుపై అనుమానాలు రేకెత్తేలా కవిత మాట్లాడారు. ఆ ప్రభావం ఉంటుందని భావిస్తున్నారు. ఇప్పటికైతే.. కవిత చేసిన అవినీతి ఆరోపణలపైనే.. ఫామ్ హౌస్‌లో చర్చ జరుగుతోందని భావిస్తున్నారు.
