హిట్లు లేకపోయినా, చేతినిండా సినిమాలు ఉండడం రవితేజ చేసుకొన్న అదృష్టం అనుకోవాలేమో? `ధమాకా`కు ముందూ ఆ తరవాత కూడా రవితేజకు హిట్లు లేవు. ‘ధమాకా’ కూడా ఫక్తు కమర్షియల్ సినిమానే. రివ్యూవర్లకు సినిమా నచ్చలేదు. కానీ మాస్ ఎంజాయ్ చేశారు. హిట్టు పడిపోయింది. అయితే ఆ రతవాత రవితేజ తన స్థాయికి తగిన సినిమాలైతే చేయలేదు. ‘ఈమధ్య మిమ్మల్ని చాలా చిరాకు పెట్టాను’ అని రవితేజనే స్వయంగా ఒప్పుకోవడం గమనించే ఉంటారు.
రవితేజ ఫెయిల్యూర్స్ కి చాలా కారణాలు ఉన్నాయి. స్క్రిప్టులో బలం లేకపోవడం, రొటీన్ అనే ముద్ర పడిపోవడం, రవితేజ నమ్ముకొన్న ఎంటర్టైన్మెంట్ వర్కవుట్ కాకపోవడం ఇవన్నీ ప్రధానమైన కారణాలు. అన్నింటికంటే మించి ఆయన స్టార్ దర్శకులకు దూరం అయ్యారు. రవితేజ ఈమధ్య కాలంలో చేసిన పది సినిమాలు లిస్టు తీసినా అందులో దాదాపుగా అందరూ కొత్తవారే. మహా అయితే ఒకట్రెండు సినిమాలు చేసిన అనుభవం ఉందేమో? అంతే. ఇప్పుడు విడుదల కాబోతున్న ‘మాస్ జాతర’ తో సహా.
రవితేజ చేయబోతున్న సినిమాల లిస్టు బయటకు తీసినా అంతే. కిషోర్ తిరుమల స్టార్ డైరెక్టర్ కాదు. శివ నిర్వాణతో రవితేజ ఓ సినిమా చేస్తున్నాడు. కల్యాణ్ శంకర్ తో ఓ సినిమా ఒప్పుకొన్నాడు. వశిష్ట కూడా లైన్ లో ఉన్నాడట. వీళ్లెవరూ స్టార్లు కాదు. కొత్త వాళ్లకు అవకాశాలు ఇవ్వాల్సిందే. అందులో తప్పేం లేదు. కానీ అప్పుడప్పుడూ స్టార్ దర్శకులతోనూ జట్టు కట్టాలి. అప్పుడు సినిమా స్థాయి పెరుగుతుంది. ప్రీ రిలీజ్ బజ్ వస్తుంది. ఇటీవల రవితేజ సినిమాలకు బజ్ లేకపోవడానికి ఇదీ ఒక కారణం. రవితేజ స్టార్ దర్శకుల్ని దూరం పెడుతున్నాడా, లేదంటే వాళ్లే రవితేజ దగ్గరకు రావడం లేదా? అనేది మరో చర్చనీయాంశం. కాస్తో కూస్తో స్టార్ డమ్ ఉన్న దర్శకులు టైర్ 1 హీరోలతో జట్టు కట్టడానికి చూస్తున్నారు. యంగ్ హీరోలతో పని చేయడానికి ఆసక్తి కనబరుస్తున్నారు. అందుకే వాళ్లెవరూ రవితేజ కోసం ఆలోచించడం లేదు. కనీసం మాస్ మహారాజా అయినా అడపాదడపా స్టార్ దర్శకులతో పని చేయడానికి ఉత్సాహం చూపించాలి. వాళ్ల వర్కింగ్ స్టైల్ పూర్తిగా వేరుగా ఉంటుంది. సినిమాలకు కావల్సినంత బజ్ వస్తుంది. అది సినిమాతో పాటు తన కెరీర్‌కు కూడా మంచిది. ఈ దిశగా మాస్ మహారాజా ఆలోచించుకొంటే మంచిది.