తెలుగుదేశం పార్టీలో కొంత మంది ఎమ్మెల్యేలకు ప్రజల్ని కలవడానికి తీరిక ఉండదు .. మరికొంత మంది ఎమ్మెల్యేలు అతి చేయడమే తమ జన్మహక్కు అన్నట్లుగా ఉంటున్నారు. అలాంటి వారిలో మొదటి వరుసలో ఉంటున్నారు పెనుమలూరు ఎమ్మెల్యే బోడె ప్రసాద్. ఆయన తీరుపై వరుస ఫిర్యాదులు రావడం, ప్రజా ప్రయోజనాల కన్నా వ్యక్తిగత ఈగోకే ప్రాధాన్యమివ్వడం, ప్రజలతో మాట్లాడే తీరుపై విమర్శలు రావడంతో .. హైకమాండ్ ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది.
పెనుమలూరు నియోజకవర్గం ప్రస్తుతం కృష్ణాజిల్లాలో ఉంది. ఈ జిల్లా కేంద్రం మచిలీపట్నం. కానీ పెనుమలూరు విజయవాడలో కలిసిపోయింది. సిటీలో కలిసిపోయిన నియోజకవర్గానికి విజయవాడ కేంద్రంగా ఉన్న ఎన్టీఆర్ జిల్లాలో కలపాలని అక్కడి ప్రజలు కోరుతున్నారు. ప్రభుత్వానికి పెద్ద ఎత్తున విజ్ఞప్తులు వచ్చాయి. మంత్రివర్గ ఉపసంఘం కూడా దీనిపై ప్రజాభిప్రాయం సేకరించింది. అయితే ఎమ్మెల్యే మాత్రం కృష్ణా జిల్లాలోనే ఉంచాలని పట్టుబట్టారు. దాంతో ఆ ప్రతిపాదనను సిఫారసు చేయలేదు. ఈ విషయాన్ని సమీక్షలో చంద్రబాబు గుర్తించారు. పెనుమలూరు ప్రజల డిమాండ్ల సంగతేమిటని అంటే.. ఎమ్మెల్యే వద్దన్నారని కమిటీ చెప్పింది. దాంతో చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా సౌకర్యం చూడాలా.. ఎమ్మెల్యే సౌకర్యమా అని ఘాటుగా ప్రశ్నించినట్లుగా తెలుస్తోంది.
అదే సమయంలో బోడె ప్రసాద్.. ప్రజల్ని పలకరించేందుకు వీడియో టీముతో అప్పుడప్పుడూ రోడ్డు మీదకు వెళ్తూంటారు. ఆ సమయంలో ఆయన ప్రజలతో మాట్లాడే తీరు విమర్శల పాలవుతోంది. ప్రజలతో వ్యంగ్యంగా మాట్లాడటం.. కోపగించుకోవడం వంటివి చేస్తున్నారు. ఈ విషయం కూడా పార్టీ హైకమాండ్ దృష్టికి వెళ్లింది. హైకమాండ్ నుంచి ఈ అంశంపైనా సూచనలు అందినట్లుగా తెలుస్తోంది. పెనుమలూరు టిక్కెట్ ను.. తనకు ఇవ్వాల్సిందేనని దీక్షలు చేసి మరీ ఇప్పించుకున్న ఆయన.. తన సొంత ఎజెండా తో రాజకీయాలు చేయడంతో హైకమాండ్ వద్ద మైనస్ మార్కులు పడుతున్నాయి.
