తెలంగాణ ప్రభుత్వం అన్నీ తెలిసి తెచ్చిన రిజర్వేషన్ల జీవోపై హైకోర్టు స్టే ఇస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. రెండు రోజుల పాటు జరిగిన వాదనల తర్వాత హైకోర్టు స్టే ఇచ్చింది. నాలుగు వారాల్లో ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. పిటిషనర్లు తర్వాత రెండు వారాల్లో రిప్లైలు దాఖలు చేసేందుకు సమయం ఇచ్చింది. రిజర్వేషన్ల జీవోపై స్టే ఇచ్చినందున ఆటోమేటిక్ గా స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ కూడా చెల్లదు. తీర్పుకాపీ.. ఎస్ఈసీకి అందిన తర్వాత నోటిఫికేషన్ రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంటారు.
బీసీలకు 42శాతం రిజర్వేషన్లు ఇస్తామని ఎన్నికల్లో ఇచ్చిన హామీని నెరవేర్చేందుకు ప్రభుత్వం .. వ్యాలిడ్ అవుతుందా లేదా అన్నది పట్టించుకోకుండా జీవో ఇచ్చేసింది. ఆ జీవో ప్రకారం ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చింది. కానీ రాజ్యాంగపరంగా అమోదం పొందని బిల్లును చూపించి జీవో ఇవ్వడంతో ఆ జీవో చెల్లదన్న నిర్ణయానికి న్యాయవర్గాలే కాదు.. రాజకీయవర్గాలు కూడా వచ్చాయి. ఈటల రాజేందర్ వంటి నేతలు బహిరంగంగానే ప్రకటించారు.
షెడ్యూల్ ప్రకారం నోటిఫికేషన్ విడుదల అయింది. అయితే నామినేషన్లు ఎవరూ దాఖలు చేయలేదు. కోర్టులో విషయం ఉన్నందున.. ఈ అంశంపై చాలా మందికి స్పష్టత లేదు. కోర్టులో ఏదో ఒకటి తేలాల్సి ఉంది కాబట్టి వేచి చూస్తున్నారు.ఇప్పుడు రిజర్వేషన్ల జీవో పై స్టే ఇవ్వడంతో..నోటిఫికేషన్ ను మార్చాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. పార్టీ పరంగా రిజర్వేషన్లు ఇచ్చి ఎన్నికలు నిర్వహించేందుకు రేవంత్ నిర్ణయించే అవకాశాలు ఉన్నాయి.