తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్‌తో పాటు రాష్ట్రవ్యాప్తంగా ఆస్తుల మార్కెట్ విలువల సవరణకు కసరత్తును ముమ్మరం చేసింది. ముఖ్యంగా ఐటీ కారిడార్లు, నివాస ప్రాంతాల్లో బహిరంగ మార్కెట్ ధరలకు, ప్రభుత్వ రికార్డుల్లోని రేట్లకు మధ్య కొండంత వ్యత్యాసం ఉండటంతో.. ఈ వ్యత్యాసాన్ని తగ్గించి, ఖజానాకు అదనపు ఆదాయాన్ని సమకూర్చుకోవడమే లక్ష్యంగా స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఈ విలువల పెంపు ప్రక్రియ ఇప్పటికే జిల్లా స్థాయి కమిటీల ఆమోదం పొంది, తుది నిర్ణయం కోసం ప్రభుత్వం వద్ద సిద్ధంగా ఉంది.
ఈ సవరణలో భాగంగా పశ్చిమ హైదరాబాద్‌లోని ఐటీ గ్రోత్ కారిడార్లలో భూముల ధరలు భారీగా పెరగనున్నాయి. ఐటీ నిపుణులు, పెట్టుబడిదారులకు హాట్ స్పాట్‌గా మారిన కోకాపేటలో ప్రస్తుతం చదరపు గజం ప్రభుత్వ ధర రూ.15,000 ఉండగా, దానిని రూ.25,000 కు పెంచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. నిజానికి మార్కెట్ విలువ లక్ష ఎప్పుడో దాటిపోయింది. కార్పొరేట్ సంస్థల హబ్‌గా ఉన్న గచ్చిబౌలి ప్రాంతంలో ప్రస్తుత విలువ చదరపు గజానికి 40,000 నుండి 55,000 వరకు సవరించేలా అధికారులు ప్రతిపాదనలు రూపొందించినట్లు సమాచారం.
ప్రభుత్వ ఉన్నతాధికారుల సమాచారం ప్రకారం.. ఈ మార్కెట్ విలువల పెంపు సాధారణంగా 30 శాతం నుండి 50 శాతం వరకు ఉండే అవకాశం ఉంది. అయితే, ఓపెన్ మార్కెట్ ధరలు ఆకాశాన్నంటుతున్న రాయదుర్గం, గచ్చిబౌలి, కోకాపేట, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వంటి కొన్ని నిర్దిష్టమైన ప్రీమియం ఏరియాల్లో మాత్రం రిజిస్ట్రేషన్ విలువలను ఏకంగా వంద శాతం లేదా అంతకంటే ఎక్కువ పెంచే అసాధారణ ప్రతిపాదనలను కూడా పరిశీలిస్తున్నారు. మరోవైపు జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ వంటి ఇప్పటికే గరిష్ట రేట్లు ఉన్న ప్రాంతాల్లో ఈ పెంపు కేవలం 10 నుంచి 20 శాతానికే పరిమితం కావచ్చునని అంచనా వేస్తున్నారు.
ఈ సవరించిన నూతన రిజిస్ట్రేషన్ ధరలు జూన్ మొదటి వారంలో ఎప్పుడైనా అమలులోకి వచ్చే అవకాశం ఉందని నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ఈ లోపు రిజిస్ట్రేషన్ల కార్యాలయాల్లో పెరగబోయే భారీ రద్దీని తట్టుకునేందుకు వీలుగా, మే 29 నుండి జూన్ 3వ తేదీ వరకు సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల పనివేళలను ఉదయం 9:30 నుండి రాత్రి 7:30 గంటల వరకు పొడిగిస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ లోపే తమ ఆస్తుల కొనుగోళ్లను పూర్తి చేసుకోవాలని కొనుగోలుదారులు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు క్యూ కడుతున్నారు.
