హైడ్రా తీరు మరోసారి చర్చనీయాంశమవుతోంది. భారీ అపార్ట్మెంట్లను సైతం కూల్చివేశారు. అమీన్పూర్ మండలంలోని ఐలాపురం తండా తదితర ప్రాంతాల్లో హైడ్రా చేపట్టిన తాజా ఆపరేషన్ ఒక మౌలిక ప్రశ్నను లేవనెత్తుతోంది. ఒక బహుళ అంతస్తుల భవనం , అపార్ట్మెంట్ నిర్మించడానికి కోట్లాది రూపాయల పెట్టుబడితో పాటు, కొన్ని ఏళ్ల శ్రమ అవసరమవుతుంది. అప్పటివరకు మౌనంగా ఉండి, నిర్మాణం పూర్తయ్యాక దాన్ని నేలమట్టం చేయడం వల్ల సంపద వృధా అవుతోందనే వాదన వినిపిస్తోంది. భవనం ప్రమాదకరంగా లేనప్పుడు, కేవలం ప్రభుత్వ స్థలలో ఉండటం, అనుమతులు లేవనే కారణంతో భారీ ఆస్తులను ధ్వంసం చేయడం ఆర్థికంగా, సామాజికంగా సమర్థనీయమా? అనే ప్రశ్నలు వస్తున్నాయి.
చట్టబద్ధత వర్సెస్ మానవీయ కోణం
తాజా కూల్చివేతల్లో హైడ్రా అధికారులు కోర్టు స్టే ఆర్డర్లు ఉన్నప్పటికీ నిర్మాణాలు కొనసాగించారని పేర్కొంటున్నారు. అయితే, ఈ భవనాల్లో ఉంటున్న అద్దెదారులు, మధ్యతరగతి కొనుగోలుదారులు మాత్రం తమకు ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వలేదని కన్నీరు మున్నీరవుతున్నారు. అధికారుల దృష్టిలో అది ఆక్రమణ కావచ్చు, కానీ సామాన్యుడి దృష్టిలో అది వారి జీవితకాల పొదుపు. అక్రమ నిర్మాణం అని తేలినప్పుడు బిల్డర్లపై కఠిన చర్యలు తీసుకోవాలి కానీ, నివాసం ఉంటున్న ఆస్తులను కూల్చివేసి ప్రజలను రోడ్డున పడేయడం ప్రజాస్వామ్య ప్రభుత్వ లక్షణం కాకూడదు.
జరిమానా, క్రమబద్ధీకరణ – ప్రత్యామ్నాయాలు లేవా?
అక్రమ కట్టడాలను అరికట్టడానికి కూల్చివేతే ఏకైక మార్గమా? అనే చర్చ ఇప్పుడు జోరందుకుంది. ఒక భవనం ప్రభుత్వ భూమిలో ఉన్నప్పుడు , సాంకేతిక అనుమతులు లేవని తెలిస్తే.. భారీ జరిమానాలు విధించడం ద్వారా వాటిని రెగ్యులరైజ్ చేసే అవకాశం ఉండదా? అని నిపుణులు ప్రశ్నిస్తున్నారు. ఒక వేళ ప్రభుత్వ
భూమిలో ఉంటే .. ప్రభుత్వమే స్వాధీనం చేసుకుని ప్రజా అవసరాలకు వాడవచ్చు. అలాగే, అక్రమ నిర్మాణాలకు అనుమతులు ఇచ్చిన అధికారులను, వాటిని అమ్మిన బిల్డర్లను జైల్లో పెట్టడం ద్వారా వ్యవస్థలో భయం పుట్టించాలే తప్ప, నిర్మించిన ఆస్తిని మట్టిలో కలపడం వల్ల ఎవరికి లాభం?
అనుమతుల వ్యవస్థలో లొసుగులే అసలు కారణం
హైడ్రా కూల్చివేతలు కేవలం ఒక లక్షణం మాత్రమే, అసలు వ్యాధి అనుమతుల వ్యవస్థలో ఉంది. ఒక భవనం పునాది పడుతున్నప్పుడే అధికారులు స్పందిస్తే ఈ పరిస్థితి రాదు. ఆరు అంతస్తులు లేచిన తర్వాత, ప్రజలు నివాసం ఉంటున్న సమయంలో జెసిబిలతో రావడం పరిపాలనా పటిష్టత అనిపించుకోదు. ప్రభుత్వం కఠినంగా ఉండాలి, కానీ ఆ కఠినత్వం నిర్మాణానికి ముందే ఉండాలి. ఆస్తులను కూల్చడం వల్ల ఆస్తి నష్టంతో పాటు, పర్యావరణ కాలుష్యం, ప్రజల మానసిక క్షోభ మిగులుతాయి.
హైడ్రా ఉద్దేశ్యం ప్రభుత్వ భూములను కాపాడటమే కావచ్చు, కానీ దాన్ని అమలు చేసే విధానం మరింత నిర్మాణాత్మకంగా ఉండాలి. సంపదను సృష్టించడం కష్టం.. ధ్వంసం చేయడం సులభం అనే సత్యాన్ని గుర్తించాల్సి ఉంది. అక్రమాలకు పాల్పడిన వ్యక్తులపై ఉక్కుపాదం మోపాలి తప్ప, సిమెంట్, ఇనుముతో కూడిన భౌతిక ఆస్తులను ధ్వంసం చేయడం వల్ల సామాజికంగా ఆశించిన ప్రయోజనం కంటే నష్టమే ఎక్కువగా జరుగుతోంది. దీన్ని ఎవరు గుర్తిస్తారు?
