జనసేన ఘోర పరాజయానికి పవనే కారణమా…?

జనసేన పార్టీ అట్టర్ ఫ్లాపయింది. అతి కష్టం మీద రాజోలు నుంచి.. రాపాక వరప్రసాద్ మాత్రం.. వెయ్యి ఓట్లతో బయటపడ్డారు. పవన్ రెండు చోట్లా ఓడిపోయారు. మొత్తం మీద.. ఏడు శాతం లోపే ఓట్లు సాధించారు. ఇంతటి ఘోర పరాజయానికి కారణం ఏమిటి..? పవన్ అవగాహన లేని రాజకీయమా..?

పవన్‌ కల్యాణ్‌ను సినిమా హీరోగానే చూశారా..?

జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ గాజువాక, భీమవరం రెండు స్థానాల్లో ఓడిపోయారు. బీఎస్పీ, వామపక్షాల మద్దతుతో ప్రజాక్షేత్రంలోకి వచ్చిన పవన్‌కు ఈ ఎన్నికలు చేదు ఫలితాన్ని మిగిల్చాయి. ఇది ఆయన అభిమానులను తీవ్ర నిరాశ పరిచింది. తెలుగు రాష్ట్రాల్లోనే అత్యంత ప్రజాదరణ కలిగిన హీరోగా పేరున్న పవన్‌ కల్యాణ్‌ జనసేన పార్టీ పెట్టినప్పుడు ప్రజల్లో కూడా విశేష స్పందన వచ్చింది. ఆ తర్వాత నిరంతరం కాకపోయినా అడపా దడపా ప్రజల మధ్యలోకి వెళ్లిన పవన్‌..అనేక ప్రజా సమస్యలపై పోరాడారు. ప్రజల పక్షాన నిలిచి ప్రభుత్వంపై నేరుగా విమర్శలు కూడా చేశారు. రైతుల ధర్నాలో కూడా పాల్గొని ప్రభుత్వాన్ని వీలైనంతవరకు ప్రశ్నించారు. ఎన్నికల ప్రక్రియ మొదలైన తర్వాత రాష్ట్రమంతా పర్యటిస్తూ.. భారీ ఎత్తున ప్రచారం చేశారు. దీంతో పవన్‌ కల్యాణ్‌ కూడా ఈ ఎన్నికల్లో కనీసం 20 నుంచి 35 స్థానాల వరకు గెలుచుకుంటారని.. కాపులంతా పవన్‌కు అండగా ఉన్నారని పలు చర్చలు జరిగాయి.

రాజకీయంగా ఓ విధానం లేకపోవడంతో ఇబ్బంది పడ్డారా..?

ప్రతి ప్రచార సభలో భారీసంఖ్యలో జనం రావడం.. జేజేలు కొట్టడం చూసి.. పవన్‌ కల్యాణ్‌ ఈ ఎన్నికల్లో కచ్చితంగా కింగ్‌ మేకర్‌ అవుతారని చాలామంది చెప్పుకొచ్చారు. పవన్‌ కల్యాణ్‌కు రాజకీయ అనుభవం లేకపోవడం, ప్రచార సరళిలో ఆయన వ్యవహరించిన తీరే ఓటమికి ప్రధాన కారణంగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవైపు కొన్నిసార్లు అధికార ప్రభుత్వాన్ని విమర్శిస్తూ.. మరికొన్ని సార్లు ప్రతిపక్ష పార్టీపై దుమ్మెత్తిపోస్తూ సాగిన ఆయన ప్రచార సరళి కూడా ఓటర్లను గందరగోళంలో పడేసింది. ఒక దశలో కాపులు కూడా పవన్‌ కల్యాణ్‌ను నమ్మాలా వద్దా అనే డైలమాలో పడినట్లు కూడా తెలుస్తోంది. చివరి నిమిషంలో మాజీ జేడీ లక్ష్మీనారాయణ, ఎస్పీవై రెడ్డి, నాగేంద్ర బాబు లాంటి కీలక వ్యక్తులకు టికెట్లు ఇచ్చినా.. వాళ్లు కూడా అంతగా ప్రభావం చూపలేకపోయారు. ఇక, బీఎస్పి, వామపక్షాలతో జత కట్టినా ఏమాత్రం ఫలితం లేకపోయింది.

పార్టీ సంస్థాగత నిర్మాణం చేయలేకపోవడమే శాపం అయిందా…?

ఐదేళ్ల కాలంలో పార్టీని నిర్మించుకునేందుకు.. జనసేన అధినేత ఎలాంటి ప్రయత్నాలు చేయలేదు. బలమైన కేడర్‌ లేకపోవడం.. ఫ్యాన్స్‌తో పాటు, ఒక వర్గమే తోడుగా నిలవడంతో పవన్‌ కల్యాణ్‌ రాజకీయంగా నిలదొక్కుకోలేకపోయారు. పైగా పార్టీకి లీడర్‌ అయినా.. సెలబ్రిటీ అయినా..అన్నీ తానొక్కడే అయ్యారు. మరో నేత లేకుండా పోయారు. తన స్థాయిలో ప్రచారం చేసే లీడర్‌ కానీ లేకపోవడం కూడా జనసేనానికి మైనస్‌ పాయింట్ అయ్యింది. ఏది ఏమైనా.. ఈ సారి జరిగిన ఎన్నికల్లో మాత్రం పవన్‌ కల్యాణ్‌ అంతో ఇంతో ప్రభావం చూపిస్తారని చాలా మంది భావించారు. కొంత మేర చూపించారు. టీడీపీ విజయావకాశాల్ని అనేక చోట్ల దెబ్బకొట్టారు. కానీ.. తనకూ ఘోర పరాజయం ఎదురయింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com