బుమ్రా ఆవేద‌న‌కు అర్థం ఉంది

ఛాంపియ‌న్స్ ట్రోఫీలో పాకిస్థాన్‌పై భార‌త్ ఘోరంగా ఓడిపోవ‌డం యావ‌త్ భార‌త క్రికెట్ అభిమానుల్ని క‌ల‌వ‌ర‌ప‌రిచింది. ఆ చేదు జ్ఞాప‌కాలు మ‌ర్చిపోవ‌డానికి అటు ఇండియ‌న్ క్రికెట్ జ‌ట్టుకు, ఇటు అభిమానుల‌కు చాలా కాలం ప‌డుతుంది. ఈ విష‌యాల్ని ఎవ్వ‌రూ కాద‌న‌లేరు. అయితే ఓట‌మికి ఒక్క‌డ్నే బాధ్యుడ్ని చేసి, వేలెత్తి చూపించ‌డం మాత్రం క‌రెక్ట్ కాదు. ఈ విష‌యంలో భార‌త ఫాస్ట్ బౌల‌ర్ బుమ్రా ఆవేద‌క వ్య‌క్తం చేస్తున్నాడు. గ‌తంలో ఎన్నో మ్యాచ్‌ల‌లో అద్భుత‌మైన బౌలింగ్ ప్ర‌ద‌ర్శ‌న చేసిన బుమ్రా.. ఫైన‌ల్‌లో తేలిపోయాడు. అంతేకాదు… ఓ నోబాల్ వేసి, పాక్ బ్యాట్స్‌మెన్ సెంచ‌రీ చేయడానికి ప‌రోక్షంగా కార‌ణం అయ్యాడు. అయితే… పాక్ చేతిలో భార‌త్ ఓడిపోవ‌డానికి బుమ్రానే కార‌ణం అన్న‌ట్టు…. జైపూర్ పోలీసులు అత్యుత్సాహం చూపించారు.

బుమ్రా నో బాల్ వేసిన విజువ‌ల్‌ని.. ట్రాఫిక్ రూల్స్ ప్ర‌చారం కోసం వాడుకొని… బుమ్రాని అగౌర‌వ ప‌రిచారు. `మీరూ ఇలా గీత దాటితే.. భారీ పరిణామాలు ఎదుర్కోవాల్సివస్తుంది `అంటూ ఓ యాడ్ త‌యారు చేసి.. ట్రాఫిక్ నిబంధ‌న‌ల గురించి ప్ర‌చారం చేస్తున్నారు. జైపూర్ పోలీసుల ఉద్దేశం మంచిదే కావొచ్చు. కాక‌పోతే… అందుకోసం బుమ్రాని బ‌లిప‌శువుగా మార్చ‌డం మాత్రం బాధాక‌రం. బుమ్రా… భార‌త్‌కు దొరికిన అరుదైన బౌల‌ర్‌. చివ‌రి ఓవ‌ర్ల‌లో అద్భుత‌మైన యార్క‌ర్ల‌తో ప్ర‌త్య‌ర్థుల్ని ఇబ్బంది పెట్ట‌గ‌ల స‌త్తా ఉన్న‌వాడు. భార‌త్ క్రికెట్ అంటే బ్యాట్స్ మెన్ గురించో, మ‌రీ అంత‌గా అయితే స్పిన్న‌ర్ల గురించో మాట్లాడుకొంటుంటాం. అలాంటి ప‌రిస్థితుల్లో ప్ర‌పంచ క్రికెట్ దృష్టిని ఆక‌ర్షిస్తున్న ఫాస్ట్ బౌల‌ర్ బుమ్రా.

ఈమ‌ధ్య కాలంలో భార‌త బౌలింగ్ బ‌ల‌ప‌డిందంటే… బుమ్రా ఓ ప్ర‌ధాన కార‌ణం. అలాంటి బుమ్రాని ఒక్క మ్యాచ్ కార‌ణంలో విల‌న్ ని చేయ‌డంలో అర్థం లేదు. అందుకే.. బుమ్రా కూడా బాగా నొచ్చుకొన్నాడు. న‌న్ను బాగా గౌర‌వించారు క‌దా.. అంటూ త‌న అస‌హ‌నాన్ని వ్యక్తం చేశాడు. ”మీరేం కంగారు ప‌డ‌కండి.. మీ త‌ప్పుల్ని నేను ఎత్తు చూప‌ను” అంటూ జైపూర్ పోలీసుల‌కు కౌంట‌ర్ వేశాడు బుమ్రా. ఏదేమైనా బుమ్రా విష‌యంలో జైపూర్ పోలీసులు చేసింది అక్ష‌రాలా త‌ప్పు… అని సోష‌ల్ మీడియాలో క్రికెట్ అభిమానులు బుమ్రాని వెన‌కేసుకొని వ‌స్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com