పవన్ కల్యాణ్ జనరల్ బాడీ మీటింగ్ లో పార్టీ నేతలపై వ్యక్తం చేసిన ఆగ్రహం కేవలం ఒక రాజకీయ నాయకుడి అసహనం మాత్రమే కాదు, అది తన సొంత శ్రేణుల వైఫల్యంపై ఒక నాయకుడి ఆవేదన. జనసేన నాయకత్వంలో బలమైన గొంతుకలు ఉన్నప్పటికీ, ప్రత్యర్థి పార్టీల నుంచి వచ్చే వ్యక్తిగత దాడులను తిప్పికొట్టడంలో వారు ఇంకా డిఫెన్సివ్ మోడ్ లోనే ఉండిపోతున్నారు. ముఖ్యంగా అంబటి రాంబాబు వంటి నేతలు మొదటి నుంచి చిరంజీవి కుటుంబాన్ని టార్గెట్ చేశారు. అలాంటి నేత పైనా అగ్రెసివ్ గా స్పందించకపోవడం పార్టీ నేతల వైఫల్యాన్ని సూచిస్తోందని పవన్ భావిస్తున్నారు.
ఆత్మరక్షణ కాదు.. ఎదురుదాడి పాలసీ!
కాపు సామాజికవర్గానికి చెందిన కీలక నేతలు ప్రత్యర్థి పార్టీల్లో ఉంటూ, పవన్ ను విమర్శిస్తున్నప్పుడు.. జనసేనలోని అదే వర్గపు నేతలు గట్టిగా మాట్లాడలేకపోవడం ఒక విచిత్రమైన పరిస్థితి. ముఖ్యమంత్రిని బూతులు తిడుతూ, కాపు ముసుగులో రాజకీయం చేసే వారిని నిలదీయడంలో జనసేన నేతలు వెనుకంజ వేస్తున్నారు. ఇది పవన్ కు మనస్తాపాన్ని కలిగిస్తోంది. పార్టీ కోసం, తన కోసం అన్నీ వదులుకుని నిలబడ్డ పవన్ కు, తన వెంట ఉన్న వారు కనీసం గొంతు విప్పకపోవడం ఆయన ఇబ్బందికరంగా భావిస్తున్నారు.
అనవసర వివాదాలపై స్పందన లు !
ఎంపీలు పెద్దగా మాట్లాడటం లేదు. నాగబాబు వంటి వారు అనవసర విషయాలపై స్పందిస్తూ, కీలకమైన రాజకీయ దాడులు జరిగినప్పుడు మౌనం వహించడం లేదా సోషల్ మీడియాకే పరిమితం కావడం పార్టీ కేడర్ లో అయోమయాన్ని నింపుతోంది. క్షేత్రస్థాయిలో ప్రత్యర్థుల కుట్రలను ఎదుర్కోవడానికి కేవలం పవన్ ఇమేజ్ సరిపోదు, పార్టీ యంత్రాంగం మొత్తం ఒక సైన్యంలా స్పందించాలన్నది పవన్ అభిప్రాయం. చిరంజీవి కుటుంబంపై , పవన్ వ్యక్తిగత జీవితంపై అంబటి రాంబాబు ఎన్నో కుట్రలు చేశారు. ఆయన చేసిన అలజడికి అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చే మెకానిజం పార్టీలో కొరవడింది. పవన్ కల్యాణ్ ఆశించేది కేవలం తనను సమర్థించడం కాదు, ప్రత్యర్థుల కుట్రలను ప్రజల ముందు ఎండగట్టడం. కానీ, పదవుల్లో ఉన్న నేతలు తమ బాధ్యత కేవలం పరిపాలనకే పరిమితం అనుకోవడం పవన్ ఆగ్రహానికి ప్రధాన కారణం.
పవన్ ఆగ్రహంతో అయినా మారుతారా?
జనసేన నేతలు పార్టీ స్టాండ్ ను నేతలు అర్థం చేసుకోలేకపోతున్నారు. లడ్డూ కల్తీ వంటి సున్నితమైన అంశాల్లో వైసీపీ రివర్స్ అటాక్ స్ట్రాటజీని అనుసరిస్తున్నప్పుడు, జనసేన నేతలు కౌంటర్ ఇచ్చేందుకు సిద్ధంగా లేకపోవడం వారి వ్యూహాత్మక లోపాన్ని సూచిస్తుంది. పవన్ కల్యాణ్ నేరుగా రంగంలోకి దిగి మాట్లాడే వరకు మిగిలిన నేతలు మౌనంగా ఉండటం వల్ల, ప్రజల్లోకి వెళ్లాల్సిన అసలు విషయం పక్కదారి పట్టి, కేవలం పవన్ వర్సెస్ వైసీపీగా మారిపోతోంది. ప్రతి అంశానికి పవనే స్పందించాల్సి రావడం ఆయనకు భారంగా మారుతోంది. ఇప్పటికైనా వారు తమ శైలిని మార్చుకుని, పవన్ కు రక్షణ కవచంలా కాకుండా, ప్రత్యర్థులపై విరుచుకుపడే ఆయుధాల్లా మారాలి. పవన్ విజన్ ను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు, ఆయనపై జరిగే విషప్రచారాన్ని గొంతు నొక్కేసే సాహసం నేతలు ప్రదర్శించాల్సి ఉంది.


