తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఇప్పుడు తన రాజకీయ జీవితంనే కాదు.. వ్యక్తిగత జీవితంలోనూ అత్యంత క్లిష్టమైన పరిస్థితుల్ని ఎదుర్కొంటున్నారు. తీన్మార్ మల్లన్నతో వివాదం తర్వాత ఆమెకు మద్దతుగా ఎవరూ రాలేదు. కాంగ్రెస్ నేతలు అటు కవితది… ఇటు మల్లన్నది ఇద్దరిదీ తప్పేనని వాదిస్తూ తెరపైకి వచ్చారు. బీఆర్ఎస్ నేతలు ఆ పని కూడా చేయలేదు. అసలు ఆ టాపిక్ పై స్పందించలేదు. కవిత మాత్రమే ఒంటరి పోరాటం చేస్తున్నారు. తనపై మల్లన్న చేసినవి హేయమైన మాటలని.. ఆయనపై చర్య తీసుకోవాల్సిందేనని అంటున్నారు.
కవితకు కనిపించని మద్దతు
సాధారణంగా కవితపై ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే.. పరిస్థితులు సీరియస్ గా మారుతాయి. ఆ నేతపై విమర్శలు పెరగాలి. అనూహ్యంగా .. తీన్మార్ మల్లన్నపై అంత తీవ్రమైన వ్యతిరేక కామెంట్లు రాలేదు. ఆయన తన మాటల్ని సమర్థించుకున్నారు. కేసీఆర్ విడుదల చేసిన సామెతల పుస్తకంలోనే ఉందని నిరూపించుకున్నారు. కానీ సామెతల్ని వాడేటప్పుడు సమయం, సందర్భం కలసి రావాలి.. లేకపోతే దురార్థాలు వచ్చేస్తాయి. ఇప్పుడు అదే జరిగింది. బాధితురాలిగా మారిన కవితకు.. సానుభూతి రావాలి ..కానీ రావడం లేదు. దీనికి కారణం పూర్తిగా సొంత దారిలో వెళ్తున్న ఆమె రాజకీయమే.
కుటుంబమే బలం- వద్దనుకుంటే ఎలా ?
కల్వకుంట్ల కవితకు అసలు బలం కుటుంబం, బీఆర్ఎస్ పార్టీనే బలం. పార్టీని కూడా కుటుంబమే అనుకోవాలి. అలాంటి బలాన్ని కాదనుకుని కవిత సొంత రాజకీయాలు చేస్తున్నారు. కేటీఆర్ నాయకత్వాన్ని అంగీకరించబోనని ప్రకటించారు. కానీ కేసీఆర్ నాయకత్వంలో వచ్చే ఎన్నికల్లో స్వీప్ చేస్తామని చెబుతున్నారు. అయితే ఆమె మాటలు పార్టీ హైకమాండ్, తండ్రి అయిన కేసీఆర్ ను సంతృప్తి పరచలేకపోతున్నాయి. ఆయన కవితపై ఆగ్రహంతోనే ఉన్నారు. ఫామ్ హౌస్ తలుపులు తెరవడం లేదు. మాట్లాడటం లేదు కూడా. కేసీఆర్ విధానం తెలిసిన తర్వాత ఇతర పార్టీ నేతలెవరైనా భిన్నంగా ఎలా స్పందిస్తారు…?. అందుకే తీన్మార్ మల్లన్నతో వివాదంపై బీఆర్ఎస్ స్పందించలేదు. అంటే కవిత తన పార్టీ బలాన్ని… కుటుంబ బలాన్ని వదులుకున్నారు. ఒంటరిగా మారి రాజకీయంగా బలహీనపడ్డారు.
కవితకు ఇప్పుడు దారేంటి ?
కవిత ఇప్పుడు చాలా దూరం ముందుకెళ్లారు. తెలంగాణ జాగృతిని విస్తృత పరిచారు. బీఆర్ఎస్ లోనే ఉన్నానని తాను చెబుతున్నారు కానీ..ఆ పార్టీ వాళ్లు అంగీకరించడం లేదు. కవితను పట్టించుకునేది లేదని జగదీష్ రెడ్డి లాంటి వాళ్లు చెబుతున్నారు. ఏ మాత్రం స్పందించకపోవడమే బీఆర్ఎస్ విధానం అనుకోవచ్చు. కానీ కవిత తమ పార్టీ బీఆర్ఎస్..తమ నాయకుడు కేసీఆర్ అంటున్నారు. ఇప్పుడు మళ్లీ కుటుంబంతో, పార్టీతో సత్సంబంధాలు పెంచుకోవాలంటే.. కవితనే తగ్గాల్సి ఉంటుంది. అలా తగ్గితే ఆమె రాజకీయాల నుంచి వైదొలగాలని షరతు పెట్టే అవకాశం ఉంది. అలాంటి పరిస్థితి రాకుండా చూసుకోవాల్సింది. కానీ సొంత రాజకీయం ప్రారంభించడంతో అందరి మద్దతు కోల్పోయారు. ఇక ఒంటరిగానే ముందుకెళ్లక తప్పని పరిస్థితి కవితకు కనిపిస్తోందని రాజకీయవర్గాలు అంచనా వేస్తున్నాయి.