కంచగచ్చిబౌలి భూముల విషయంలో సుప్రీంకోర్టు రేవంత్ ప్రభుత్వానికి మంచి ఆఫర్ ఇచ్చింది. పర్యావరణ పరిరక్షణకు మంచి ప్రతిపాదనలతో వస్తే ఆమోదం తెలుపుతామని.. అభివృద్ధికి తాము వ్యతిరేకం కాదని గతంలో చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటామని తెలిపింది. ఆరు వారాలలోపు పూర్తి సమగ్ర పర్యావరణ పరిరక్షణ నివేదికను సమర్పిస్తామని తెలంగాణ ప్రభుత్వం చెప్పింది.
కంచగచ్చిబౌలిలో చెరువులు, అడవులు ఉన్నట్లుగా .. వాటిని ప్రభుత్వం రాత్రికి రాత్రి కూల్చివేస్తున్నట్లుగా , పూడ్చి వేస్తున్నట్లుగా ప్రచారం జరిగింది. అలాంటి సమయంలో సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలయింది. సుప్రీంకోర్టు కూడా తీవ్రంగా స్పందించింది. అయితే ఆ స్థలం.. అటవీ శాఖకు చెందినది కాదని పూర్తిగా ప్రైవేటు ల్యాండ్ అని..న్యాయవివాదాల్లో ఉండటం వల్ల ..నిరుపయోగంగా ఉండటం వల్ల అక్కడ చెట్లు పెరిగాయని ప్రభుత్వం బలంగా చెప్పలేకపోయింది. మరో వైపు బీఆర్ఎస్ పార్టీ అది అటవీ భూమి అని ఆరోపిస్తూ.. ఆందోళనలు చేసింది. హెచ్సీయూని ఆనుకుని ఉండటంతో విద్యార్థులు ఉద్యమం చేశారు.
అక్కడ జింకలు , పులులు, నెమళ్లు వంటి వన్యప్రాణులు ఉన్నట్లుగా సోషల్ మీడియాలో ఏఐ వీడియోలు వైరల్ చేశారు. ఇది దేశవ్యాప్త సంచలనం అయింది. ఇప్పుడు మెల్లగా సుప్రీంకర్టుకు తెలంగాణ ప్రభుత్వం అన్ని విషయాలు వివరిస్తోంది. దాంతో నాలుగు వందల ఎకరాల్లో పర్యావరణ పరిరక్షణకు కొంత కేటాయించి.. సమగ్రమైన చర్యలు తీసుకుంటామని చెప్పి.. మిగిలిన చోట్ల ఐటీ కార్యాలయలను నిర్మించేందుకు ప్రభుత్వం సిద్ధమయ్యే అవకాశం ఉంది. ఈ భూముల విషయంలో నిధుల సమీకరణకు రేవంత్ ప్రభుత్వం ఎన్నో ఆశలు పెట్టుకుంది. కొన్నాళ్లకైనా సమస్యలు పరిష్కారమవుతాయన్న నమ్మకం ప్రభుత్వానికి ఏర్పడింది.