ఫోన్ ట్యాపింగ్ అంశం రేవంత్ రెడ్డి, హరీష్ రావు ఆడుతున్న నాటకంగా కవిత భావిస్తున్నారు. ఇదే విషయాన్ని ఆమె భిన్నంగా చెబుతున్నారు. గుంపుమేస్త్రి, గుంట నక్క కలిసి ఆడుతున్న నాటకంగా తేల్చారు. ఎందుకంటే బీసీ రిజర్వేషన్ల అంశాన్ని పక్కదారి పట్టించడానికి చేస్తున్నారట. ముచ్చర్ల సత్యనారాయణ అనే ఉద్యమకారుని జయంతిని కవిత జాగృతి కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. బీసీ రిజర్వేషన్లను ఇవ్వకుండా ఎగ్గొట్టాడనికి ఆ ఆంశం చర్చకు రాకుండా ఉండటానికి గుంపుమేస్త్రి, గుంటనక్క కలిసి ఈ జ్రామాలు ఆడుతున్నారన్నారు.
కేటీఆర్ పైనా కవిత సెటైర్లు వేశారు. సికింద్రాబాద్ జిల్లా కోసం ఉద్యమిస్తామని.. మళ్లీ బీఆర్ఎస్ రాగానే జిల్లా ఏర్పాటు చేస్తామని కేటీఆర్ చేస్తున్న ప్రకటనలను ఎద్దేవా చేశారు. పదేళ్ల పాటు ఉద్యమాలు జరిగినప్పుడు అణిచివేసి.. కేసులు పెట్టించిన కేటీఆర్ ఇప్పుడు జిల్లాను ఏర్పాటు చేస్తామనడం ఏమిటని ప్రశ్నించారు. జిల్లాల పునర్విభజన జరిగినప్పుడు సికింద్రాబాద్‌ను జిల్లాగా చేయడంతో పాటు, ప్రొఫెసర్ జయశంకర్ పేరును ఒక జిల్లాకు పెట్టాలని డిమాండ్ చేశారు.
అదే సమయంలో ఎన్నికల్లో పోటీపైనా స్పందించారు. నిజామాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయబోతున్నారన్న ప్రచారం జరుగుతోంది. కానీ దాన్ని ఆమె తోసిపుచ్చారు. తెలంగాణ జాగృతి రాజకీయ పార్టీగా ఇంకా పూర్తిస్థాయిలో అవతరించలేదన్నారు. కానీ తెలంగాణ ప్రయోజనాల కోసం పోరాడే వారికి అండగా ఉంటామని కవిత స్పష్టం చేశారు. అంటే జాగృతి మద్దతుదారులను ఇండిపెండెంట్లుగా నిలబెట్టే అవకాశం ఉంది.
