కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత సొంతంగా రాజకీయ పార్టీని ఏర్పాటు చేసే దిశగా వేగంగా అడుగులు వేస్తున్నారు. తెలంగాణ ప్రజా జాగృతి పేరుతో కొత్త పార్టీని రిజిస్టర్ చేసేందుకు ఈ ఏడాది జనవరి 23న కేంద్ర ఎన్నికల సంఘానికి ఆమె దరఖాస్తు చేసుకున్నారు. కానీ రిజిస్ట్రేషన్ పూర్తి చేయకపోవడంతో ప్రజాప్రాతినిధ్య చట్టం 1951 ప్రకారం ఈ ప్రక్రియ చేపట్టినప్పటికీ, రిజిస్ట్రేషన్లో జాప్యం జరుగుతోందని భావించిన కవిత ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు.
ఈ పిటిషన్పై విచారణ సందర్భంగా ఎన్నికల సంఘం తన వాదనలను వినిపించింది. కవిత సమర్పించిన దరఖాస్తులో కొన్ని సాంకేతిక లోపాలు ఉన్నాయని, వాటిని సరిదిద్దాలని కోరుతూ ఫిబ్రవరి 23నే ఆమెకు సమాచారం అందించినట్లు ఈసీ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఈ లోపాలను సరిదిద్దిన తర్వాతే ప్రక్రియ ముందుకు సాగుతుందని స్పష్టం చేశారు. ఈ అంశాన్ని పరిశీలించిన ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. కవిత వేసిన పిటిషన్పై వీలైనంత త్వరగా తుది నిర్ణయం తీసుకోవాలని ఎన్నికల సంఘాన్ని కోర్టు ఆదేశించింది. దీంతో త్వరలోనే తెలంగాణ ప్రజా జాగృతి పార్టీకి అధికారిక గుర్తింపు లభించే అవకాశం కనిపిస్తోంది.
అయితే సాంకేతిక లోపాలను సవరించుకోకుండా.. కవిత కోర్టుకు వెళ్లడం ఏమిటన్న విస్మయం వ్యక్తమవుతోంది. ఆ సాంకేతిక లోపాలు పరిష్కరించలేనివి అయితే తప్ప ఇలా చేయరని.. భావిస్తున్నారు. కవిత ఇప్పుడు ఆ సాంకేతిక సమస్యలను పరిష్కరించుకుంటే తప్ప.. రిజిస్ట్రేషన్ పూర్తి కాదు. ఎలాగోలా నెల రోజుల్లో పూర్తి చేసి తన పార్టీని ప్రకటించాలని కవిత ప్రయత్నిస్తున్నారు.


