పార్టీ పెడుతున్న‌ది అధికారం కోసం కాద‌ట‌..!

తెలంగాణ జేయేసీ ఛైర్మ‌న్ కె. కోదండ‌రామ్ రాజ‌కీయ పార్టీ పెట్ట‌డం ఖ‌రారు అయిపోయింది. గ‌త కొన్నాళ్లుగా ఆయ‌న పార్టీ పెట్ట‌బోతున్నారూ అంటూ జ‌రిగిన ప్ర‌చారం ఎట్ట‌కేల‌కు నిజం కాబోతోంది. తెలంగాణ జ‌న స‌మితి (టీజేఎస్‌) పేరుతో రాష్ట్రంలో మ‌రో కొత్త రాజ‌కీయ పార్టీ ప్ర‌జ‌ల ముందుకు రాబోతోంది. అయితే, రాజ‌కీయ పార్టీతోపాటు జేయేసీ కూడా ఉనికిలో ఉంటుంద‌ని కోదండ‌రామ్ చెప్ప‌డం విశేషం. నిజానికి, టీ జేయేసీ రూపాంత‌రం చెంది రాజ‌కీయ పార్టీగా మారుతుంద‌ని అనుకున్నారు. కానీ, టీజేఎస్ వేరు… జేయేసీ వేరు అని అంటున్నారు. ఈ రెండు విడివిడిగా ఉంటూ క‌లిసి ఎలా ప‌నిచేస్తాయ‌నేది మ‌రింత స్ప‌ష్ట‌త ఇవ్వాల్సి ఉంది.

తాను రాజ‌కీయాల్లోకి వ‌స్తున్న‌ది అధికారం కోసం కాద‌నీ, ముఖ్య‌మంత్రి ప‌ద‌వి కోసం కాద‌న్న‌ట్టుగా కోదండ‌రామ్ చెప్పారు. తెలంగాణ‌లో చాలా స‌మ‌స్య‌లున్నాయ‌నీ, ప్ర‌జ‌ల త‌ర‌ఫున పోరాటం చేసేందుకే రాజ‌కీయ పార్టీ పెడుతున్న‌ట్టు అన్నారు. అధికారిక‌మే ప‌ర‌మావ‌ధి కాద‌న్నారు. అయితే, ఇక్క‌డే కొంత స్ప‌ష్ట‌త లోపిస్తోంది. తెలంగాణ‌లో ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై పోరాటం అంటున్నారు. ప్ర‌స్తుతం జేయేసీ చేస్తున్న ప‌ని అదే కదా. జేయేసీ త‌ర‌ఫున ఇంత‌వ‌ర‌కూ కోదండ‌రామ్ చేస్తూ వ‌చ్చింది అదే క‌దా! పార్టీ పెట్ట‌డం ద్వారా రాజ‌కీయ పోరాటం చెయ్యొచ్చ‌ని అంటున్నారు. అలాంట‌ప్పుడు టీజేయ‌స్ ఏం చేస్తుంద‌నే ప్ర‌శ్న ఉంటుంది. రాజ‌కీయ పోరాట‌ం అంటూనే.. అధికారమే ప‌ర‌మావ‌ధి కాద‌ని ఇంకోప‌క్క చెబుతున్నారు.

అధికార‌మే ప‌ర‌మావ‌ధి కాన‌ప్పుడు పార్టీ ఏర్పాటు చేయాల్సిన అవ‌స‌రం ఏముంది..? ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై పోరాడటానికి కావాల్సిన వేదిక వారికి ఉండ‌నే ఉంది క‌దా! అయినా.. తాము పార్టీ పెడుతున్న‌దే రాజ‌కీయ శ‌క్తిగా ఎద‌గ‌డం కోసం అని చెబితే త‌ప్పేముంది..? చ‌ట్ట‌స‌భ‌ల్లోకి వ‌స్తాం, ప్ర‌జ‌ల త‌ర‌ఫున మ‌రింత బ‌లమైన వాణిని వినిపిస్తాం, ఈ క్రమంలో ప్రజలు ఆదరిస్తే ప్రభుత్వం నడుపుతాం అని ప్ర‌క‌టిస్తే బాగుంటుంది క‌దా. పార్టీ ఏర్పాటు చేస్తామ‌ని చెబుతూ… త‌మ‌కు అధికారం అక్క‌ర్లేదు, ఓట్ల కోసం పెట్ట‌ట్లేద‌ని చెబుతూనే… టీజేఎస్ ప్ర‌భంజ‌నం సృష్టిస్తుంద‌ని ఎలా ఆశిస్తారు..? తెలంగాణ‌లో కాంగ్రెస్ పార్టీ చేస్తున్న‌దీ ప్రజా స‌మ‌స్య‌ల‌పై రాజ‌కీయ పోరాట‌మే కదా. ఇప్పుడు టీజేఎస్ చేయ‌బోతున్న‌దీ అదే. ఎన్నిక‌లు వ‌చ్చేనాటికి తెలంగాణ‌లో మ‌హా కూట‌మి అంటూ ఏర్ప‌డితే… టీజేఎస్ కూడా ఆ కూట‌మిలో భాగ‌స్వామిగా కాంగ్రెస్ తో క‌లిసి ప‌నిచేసే అవ‌కాశాలున్నాయి. రాజ‌కీయ పార్టీ తొలి ప్ర‌యోజ‌నం అక్క‌డి నుంచే ఉండొచ్చు. అయినా… రాజ‌కీయ పార్టీ పెట్టేసి, మాకు సీట్లొద్దూ ఓట్లొద్దూ అంటే ఎలా చెప్పండీ..?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.