బెంగాల్ లో బీజేపీ నుంచి తృణమూల్ లో చేరిన ఎమ్మెల్యే శాసనసభ్యత్వాన్ని కోల్ కతా హైకోర్టు రద్దు చేసింది. ఆయనపై అనర్హతా వేటు వేయాల్సిన అవసరం లేదని స్పీకర్ ఇచ్చిన నిర్ణయాన్ని కూడా కొట్టి వేయడం సంచలనంగా మారింది. ఫిరాయింపుల నిరోధక చట్టం కింద ఈ తీర్పు వచ్చింది.
2021 అసెంబ్లీ ఎన్నికల్లో కృష్ణనగర్ ఉత్తర్ సీటు నుంచి బీజేపీ టికెట్‌పై ఎమ్మెల్యేగా గెలిచిన ముకుల్ రాయ్, ఎన్నికలు ముగిసిన ఒక నెలలోనే తృణమూల్ కాంగ్రెస్ లో చేరారు. బీజేపీ నేత సువేందు అధికారి ఆయనపై అనర్హతా వేటు వేయాలని స్పీకర్ కు ఫిర్యాదు చేశారు. రెండేళ్ల పాటు విచారణ చేసిన స్పీకర్ .. అనర్హతా పిటిషన్ ను తోసి పుచ్చారు. దీనిపై సువేందు అధికారి హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు డివిజన్ బెంచ్ ఈ అనర్హతను ప్రకటించడమే కాకుండా, అసెంబ్లీ స్పీకర్ బిమన్ బెనర్జీ ఇచ్చిన నిర్ణయాన్ని కూడా రద్దు చేసింది.
మాజీ రైల్వే మంత్రి, రాజ్యసభ సభ్యుడిగా టీఎంసీ నుంచి పనిచేసిన ఆయన, 2021 ఎన్నికల్లో బీజేపీలో చేరి గెలిచారు. కానీ ఎన్నికలు ముగిసిన తర్వాత తిరిగి టీఎంసీలో చేరారు. ఆ తర్వాత ఆయన పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్‌గా నియమితులయ్యారు. ఈ పదవి సాధారణంగా ప్రతిపక్ష సభ్యుడికి ఇస్తారు. కోర్టు నిర్ణయంపై టీఎంసీ సుప్రీంకోర్టుకు వెళ్లే అవకాశం ఉంది. స్పీకర్ అధికారాల్లో కోర్టులు జోక్యం చేసుకోవడం రాజ్యాంగవిరుద్ధమని వాదించే అవకాశం ఉంది.
బెంగాల్ హైకోర్టు ఇచ్చిన తీర్పు.. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీకి కూడా ఆశాకిరణంగా మారే అవకాశం ఉంది. ఆ తీర్పును చూపించి పది మంది ఎమ్మెల్యేలపై అనర్హతా వేటు కోసం గట్టిగా పోరాడే అవకాశం ఉంది.

