కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తాను మంత్రిని అయిపోతున్నానని ఊహల్లో తేలిపోతున్నారు. గతంలో ఆయన మంత్రి పదవి రాలేదని సీఎం రేవంత్ రెడ్డిపై ఆరోపణలు చేస్తూ వచ్చారు. ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అయితే నోరు మూసుకుని ఉంటే తర్వాత పదవి అంశం పరిశీలిస్తామని సందేశాలు వచ్చాయామో కానీ తర్వాత సైలెంట్ అయ్యారు. ఇప్పుడు కొత్తగా తనకు పదవి వచ్చినట్లే మాట్లాడుతున్నారు. కానీ కాంగ్రెస్ రాజకీయాలను చూస్తే.. వచ్చే మూడేళ్ల పాటు తనకు పదవి వచ్చేస్తోందని ఊహాల్లో హాయిగా గడుపుతూ ఉంటారని అర్థం చేసుకోవచ్చు.
కేబినెట్ ప్రక్షాళనకు హైకమాండ్ విముఖం
అవసరం లేకుండాపార్టీ నేతల కోరికలను తీర్చడానికి మంత్రివర్గ విస్తరణ లేదా ప్రక్షాళనచేయాలని కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఎప్పుడూ అనుకోదు. పార్టీకి అవసరం అయితే మాత్రమే చేస్తారు. తెలంగాణలో పాలన పూర్తి అయి రెండేళ్లు అయింది. రెండు సార్లు మంత్రివర్గాన్ని విస్తరించారు. రెండు సార్లు పార్టీ అవసరాల కోసమే విస్తరించారు. కులగణన పేరుతో చేస్తున్న రాజకీయంతో ఆ వర్గానికి ప్రాధాన్యం పెంచడానికి ఓ సారి, జూబ్లిహిల్స్ ఉపెఎన్నికలో ముస్లిం ఓట్ల కోసం మరోసారి అజహర్‌కు మంత్రి పదవి కోసం విస్తరించారు. ఇప్పుడల్లా ఇక అవసరం రాదు. అందుకే ఇక పట్టించుకోరు.
లీకులు కేవలం ఆశావహులకు ఆశ పెట్టడానికే !
కేబినెట్ ప్రక్షాళన అంటూ వస్తున్న లీకులు కేవలం ఆశావహుల్ని ఆశ పెట్టడానికి, తోక జాడించడానికి ప్రయత్నిస్తున్న సీనియర్ మంత్రుల్ని దారిలో పెట్టడానికేనని అనుకోవచ్చు. నిజంగా మంత్రి వర్గాన్ని ప్రక్షాళన చేయాలనుకుంటే.. సుదర్శన్ రెడ్డికి, ప్రేమ్ సాగర్ రావులకు కేబినెట్ హోదాతో సలహాదారుల పదవులు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఏ విధంగా చూసినా వారికి విస్తరణలో పదవులు ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు వారిని సలహాదారుల పదవులు ఇచ్చారంటే.. సమీప భవిష్యత్ లో విస్తరణ ఉండదనే. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కొంత మంది సీనియర్లను తీసేస్తే జరిగే రచ్చ చాలా వైల్డ్ గా ఉంటుంది. ఆ విషయం తెలియకుండా కాంగ్రెస్ హైకమాండ్ ఉండదు. అయితే తమ దగ్గరకు వస్తున్న ఆశావహులకు సర్దిచెప్పడానికి త్వరలో అని చెబుతున్నారని అనుకోవచ్చు.
రెండు పదవులు ఖాళీ – అవసరం వచ్చినప్పుడు భర్తీ
కాంగ్రెస్ పార్టీలో అన్ని పదవులూ తమకే కావాలనుకునేవారు చాలా మంది ఉంటారు. అలాగే తామే పార్టీ కోసం కష్టపడ్డామని మంత్రి పదవి తన జన్మహక్కు అనుకునేవారూ ఉంటారు. చివరికి ఎమ్మెల్యేలుగా ఓడిపోయిన వారికీ కూడా. అలాంటి పార్టీలో రెండు పదవులు ఖాళీగా ఉంచి అందర్నీ ఆశపెట్టడం అనేది కామన్ పాయింట్. అందుకే కాంగ్రెస్ హైకమాండ్ రెండు పదవుల్ని ఖాళీ ఉంచి..ఎప్పుడు భర్తీ చేసిన అవి మీకే అని ఇరవై మంది ఆశావహుల్ని సైలెంటుగా ఉంచుతుంది. కానీ రాజగోపాల్ రెడ్డి లాంటి వారు ఆత్రం ఆపుకోలేక..త్వరలో మంత్రినవుతానని చెప్పుకుంటూ ఉంటారు.
