రాజకీయాల్లో ఆత్మవిశ్వాసం ఉండాలి కానీ, అది అతివిశ్వాసంగా మారి ఎదుటివారిని వెక్కిరించేలా ఉంటేనే అసలు చిక్కు. ప్రస్తుతం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీరు చూస్తుంటే సరిగ్గా అలాగే అనిపిస్తోంది. రాబోయేది మన ప్రభుత్వమే అని కార్యకర్తల్లో ధైర్యం నింపడం ఏ నాయకుడికైనా సహజం. కానీ, దానికి కేటీఆర్ ఇస్తున్న సోర్స్ వింటుంటేనే రాజకీయ విశ్లేషకులకు కూడా కాస్త ఎబ్బెట్టుగా అనిపిస్తోంది.
గూఢచారి 007.. కాంగ్రెస్ నాయకులే!
కేటీఆర్ తన ప్రతి ప్రసంగంలోనూ బీఆర్ఎస్ మళ్ళీ పవర్ లోకి వస్తుంది అని చాలా ధీమాగా చెబుతున్నారు. సరే, అది ఆయన నమ్మకం అనుకుందాం. కానీ, మీకు ఆ విషయం ఎలా తెలుసు? అని ఎవరైనా అడుగుతారేమో అని ఆయనే ముందే ఊహించేసి.. ఇది నేను చెప్పడం లేదు, కాంగ్రెస్ వాళ్లే నాకు చెబుతున్నారు” అనడమే ఇక్కడ అసలు ట్విస్ట్. అంటే, అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మంత్రులు తమ పీఠం ఎప్పుడు కదులుతుందా అని వెయిట్ చేస్తూ, తెల్లారి లేవగానే కేటీఆర్‌కు ఫోన్ చేసి అన్నా.. వచ్చేది మీరే, మా వల్ల కావడం లేదు అని రిపోర్ట్ ఇస్తున్నారన్నమాట! ఇది వినడానికి బాగున్నా, ప్రాక్టికల్‌గా ఎంతవరకు నమ్మశక్యంగా ఉందో కేటీఆర్ గారికే తెలియాలి.
శత్రువు మాట వేదవాక్కా?
సాధారణంగా రాజకీయాల్లో ప్రత్యర్థులు చెప్పే మాటలను ఎవరూ సీరియస్‌గా తీసుకోరు. పైగా కాంగ్రెస్ నాయకులు ఏదైనా అన్నారంటే అందులో వెటకారం ఉండొచ్చు లేదా వ్యూహం ఉండొచ్చు. కానీ కేటీఆర్ మాత్రం.. వాళ్లే ఒప్పుకుంటున్నారు కదా, ఇక మా పీఠం ఖాయం అని ఫిక్స్ అయిపోవడం చూస్తుంటే ముందస్తు సంబరాలు కాస్త అతిగా అనిపిస్తున్నాయి. కాంగ్రెస్ వాళ్లు ఏదో అన్నారని, తన పార్టీ భవిష్యత్తును వారి సర్టిఫికెట్‌పై ఆధారపడేలా చేసుకోవడం ఒక రకంగా సెల్ఫ్ గోల్ లాంటిదే. మన సత్తా ఏంటో మనం చెప్పాలి కానీ, పక్కింటోడు బాగున్నావు అంటేనే బాగున్నట్లు ఫీలవ్వడం ఏంటో అర్థం కావడం లేదు.
ఎబ్బెట్టుగా ఉన్న ఎగ్జిట్ పోల్స్
కేటీఆర్ ఈ మధ్య తన స్పీచ్‌లలో ఈ కాంగ్రెస్ లీకుల గురించి ఊదరగొడుతుంటే.. అది కార్యకర్తలకు బూస్ట్ ఇస్తుందో లేదో కానీ, వినే జనానికి మాత్రం కాస్త ఎబ్బెట్టుగా ఉంది. ఓ పక్క రేవంత్ రెడ్డి అసెంబ్లీలో బీఆర్ఎస్ నాయకులపై మైనింగ్, భూ కబ్జా ఆరోపణలతో విరుచుకుపడుతుంటే.. మరోపక్క కేటీఆర్ మాత్రం అంతేలే.. వాళ్లకు భయం పట్టుకుంది, అందుకే నాకలా చెప్పారు అని సర్దిచెప్పుకోవాల్సి వస్తోంది. కాంగ్రెస్ వాళ్ల మాటలను నమ్మి పీఠం ఫిక్స్ అయిపోవడం కంటే, గ్రౌండ్ లెవల్లో ప్రజలు ఏమనుకుంటున్నారో పట్టించుకుంటే బెటర్ అనే కామెంట్లు వినిపిస్తున్నాయి.
కలలు కనడం తప్పు కాదు కానీ..
ఎవరో ఏదో అన్నారని మురిసిపోవడం రాజకీయాల్లో చాలా రిస్క్. కేటీఆర్ గారు కాంగ్రెస్ నాయకుల మాటలను బ్రహ్మవాక్కుగా భావించి రేపు పొద్దున్నే సెక్రటేరియట్ మెట్లు ఎక్కేస్తామని అనుకోవడం చూస్తుంటే.. అది ఆత్మవిశ్వాసమా లేక భ్రమలో బతకడమా అనేది కాలమే నిర్ణయించాలి. ఏదేమైనా, కాంగ్రెస్ వాళ్లు చెప్పారు కాబట్టి మేం వచ్చేస్తున్నాం అనే స్టేట్మెంట్లు మాత్రం వినడానికి చాలా ఫన్నీగా, ఎబ్బెట్టుగా ఉన్నాయి. ఈ విషయాన్ని కేటీఆర్ గుర్తించలేకపోతున్నారు.
