హైదరాబాద్ ఐటీ కారిడార్‌లోని కొండాపూర్‌లో గల 42.03 ఎకరాల అత్యంత విలువైన భూమి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్,తెలంగాణ రాష్ట్రాల మధ్య కొత్త వివాదానికి కారణం అయింది. కర్నూలుకు చెందిన భగవాన్ శ్రీ బాలాసాయిబాబా సెంట్రల్ ట్రస్ట్‌కు కేటాయించిన భూములకు సంబంధించింది. 2005లో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, అర్బన్ ల్యాండ్ సీలింగ్ చట్టం కింద కొండాపూర్‌లోని సర్వే నంబర్లు 105 నుంచి 108 వరకు ఉన్న 42 ఎకరాల మిగులు భూమిని ఈ ట్రస్ట్‌కు క్రమబద్ధీకరించింది. 2018లో బాలాసాయిబాబా మరణించిన తర్వాత, సదరు ట్రస్ట్ కార్యకలాపాలు, ఆస్తులను ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ తన ఆధీనంలోకి తీసుకుంది. అప్పటి నుండి ఈ భూమి ఏపీ దేవాదాయ శాఖ పర్యవేక్షణలోనే ఉంది.
అసలు సమస్య 2023లో మొదలైంది. ఏపీ ప్రభుత్వానికి ఎటువంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా, తెలంగాణ ప్రభుత్వం రెవెన్యూ రికార్డుల్లో మార్పులు చేసి, ఆ భూమిని భూపతి ఎస్టేట్స్ అనే ప్రైవేట్ సంస్థకు కేటాయించింది. దీనిని సవాలు చేస్తూ 2024లో పలువురు ప్రైవేట్ వ్యక్తులు తెలంగాణ హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. తాజాగా, 2026 జనవరి 20న ఈ కేసులో ఏపీ ప్రభుత్వం కూడా కౌంటర్ దాఖలు చేయడంతో వివాదం ముదిరింది. హైకోర్టు అనుమతి లేకుండా దేవాదాయ భూములను ప్రైవేట్ వ్యక్తులకు లేదా సంస్థలకు బదిలీ చేసే హక్కు తెలంగాణ ప్రభుత్వానికి లేదని ఏపీ తన కౌంటర్లో స్పష్టం చేసింది.
ఈ ట్రస్ట్ ఆంధ్రప్రదేశ్ దేవాదాయ చట్టం కింద నమోదైందని, అందువల్ల ఆస్తుల నిర్వహణ హక్కు తమకే ఉంటుందని ఏపీ పేర్కొంటోంది. ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ కూడా ఈ భూమి ఏపీ ఎండోమెంట్ పరిధిలోకి వస్తుందని లేఖ ఇచ్చారు. తెలంగాణ ప్రభుత్వం ఏకపక్షంగా ప్రైవేట్ వ్యక్తులకు భూమిని కట్టబెట్టడం చట్టవిరుద్ధమని ఏపీ వాదిస్తోంది. భూపతి ఎస్టేట్స్ వాదన ప్రకారం.. ఈ భూమిని తాము 2000వ సంవత్సరంలోనే ట్రస్ట్ నుండి కొనుగోలు చేశామని, ఇది కేంద్ర చట్టమైన యూఎల్సీ కిందకు వస్తుంది కాబట్టి దేవాదాయ చట్టం వర్తించదని అంటున్నారు. తాము ఇప్పటికే ప్రభుత్వానికి కోట్ల క్రమబద్ధీకరణ రుసుము చెల్లించామని, తెలంగాణ ప్రభుత్వం జీఓ 45 ద్వారా తమ పేరిట హక్కులు కల్పించిందని చెబుతున్నారు.
తెలంగాణ హైకోర్టు ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణిస్తోంది. గతంలో కౌంటర్ దాఖలు చేయడంలో ఆలస్యం చేసినందుకు తెలంగాణ ప్రభుత్వానికి కోర్టు జరిమానా కూడా విధించింది. ప్రస్తుతం రూ.4,000 కోట్ల విలువైన ఈ భూమి ఎవరికి చెందుతుందనేది కోర్టు తీర్పుపై ఆధారపడి ఉంది. ఒకవేళ ఏపీ వాదన నెగ్గితే, హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న ఈ భూమిపై ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖకు దక్కుతుంది. లేనిపక్షంలో అది ప్రైవేట్ వ్యక్తుల పరమవుతుంది.
