ఇండియన్ సినీ ఇండస్ట్రీలో స్టార్ పవర్ మ్యాజిక్ చేస్తుంది. పోస్టర్లో స్టార్‌ని చూసి టికెట్ తెగుతాయి. కానీ ఆ పవర్‌ని సరిగ్గా వినియోగించకపోతే, ప్రేక్షకుల అంచనాలు కూలిపోతాయి. ప్రస్తుతం ఆ స్థితినే ఎదుర్కొంటున్నాడు డైరెక్టర్ లోకేష్ కనకరాజ్. మాస్ అండ్ క్లాస్‌కి కనెక్ట్ అయ్యే స్టోరీటెల్లింగ్‌లో తనకంటూ ఓ ప్రత్యేక బ్రాండ్ సృష్టించుకున్నా లోకి, స్టార్లను వాడుకునే విషయంలో మాత్రం విమర్శలు ఎదురుకుంటున్నాడు.
‘లియో’లో సంజయ్ దత్ ఎంట్రీ అభిమానుల్లో భారీ అంచనాలు రేపింది. బాలీవుడ్లో బలమైన స్క్రీన్ ప్రెజెన్స్ కలిగిన సంజయ్ పాత్రని మరీ తేలికగా తయారు చేశాడు లోకి. ఇటీవలి ఓ ఈవెంట్లో స్వయంగా సంజయ్ దత్ దీనిపై అసంతృప్తి వ్యక్తం చేశాడు. లోకేష్ నన్ను సరిగ్గా చూపించలేదని అసహనం వ్యక్తం చేశాడు.
లేటెస్ట్ కూలీలో నాగార్జున, ఉపేంద్ర, అమీర్ ఖాన్.. రోల్స్ కూడా తేలిపోయాయి. నాగార్జున పాత్రకి ఇంపాక్ట్ లేకుండా పోయింది. ఉపేంద్రని అస్సలు వాడుకోలేదు. ఇక అమీర్ ఖాన్ గురించి చెప్పడానికి ఏమీ లేదు. నాగార్జున, ఉపేంద్ర, అమీర్ ఖాన్ ఇంత బరువైన పేర్లు ఉన్నా సినిమాకి ఎలాంటి మాస్ వాల్యూ రాలేదు. దీనికి పూర్తి బాధ్యత లోకేష్ దే.
లోకేష్ తన కథలను తన యూనివర్స్‌కి తగినట్లుగా మలుస్తున్నాడు. కానీ ఆ యూనివర్స్‌ని బలపరచడానికి తీసుకొస్తున్న స్టార్స్‌కి పూర్తి స్థాయి ఆర్క్ ఇవ్వడంలో విఫలమవుతున్నాడు. “కేవలం స్టార్ ఫేస్ చూపించడం” మాత్రమే జరుగుతుండడంతో టాలెంట్, స్టార్ పవర్ వృథా అవుతున్నాయి.
ఇప్పటికే సోషల్ మీడియాలో “ట్రైలర్ హైప్ కోసం స్టార్స్‌ని తీసుకుంటున్నాడా” అనే ప్రశ్నలు వస్తున్నాయి. ఫ్యాన్స్ అంచనాలు పెరిగి, తర్వాత నిరాశ చెందడం ఎక్కువ అవుతోంది. కూలీతో లోకేష్ కనకరాజ్ టాలెంట్‌పై కూడా కొన్ని అనుమానాలు వచ్చాయి. చాలా లోపభూయిష్టంగా కథని తయారు చేశాడు. స్టార్లను వాడుకోవడంలో పూర్తిగా విఫలమయ్యాడు.
కేవలం కార్తిని పెట్టుకొని సింగిల్ నైట్‌లో ఓ మాస్ బ్లాస్ట్ లాంటి ఖైదీ సినిమాని తీసిన లోకేష్.. ఇప్పుడు తనకున్న క్రేజ్ అనుగుణంగా బిగ్గెస్ట్ స్టార్స్‌తో సినిమాలు చేసే అవకాశం వస్తున్నా దాన్ని సరిగ్గా వాడుకోలేకపోవడం విమర్శలు దారితీస్తోంది.