అభిమానులు ఎంతకాలం నుంచో ఎదురుచూస్తున్న కాంబినేషన్ వెంకటేష్ – త్రివిక్రమ్. వీరిద్దరూ కలిసి మరో సినిమా కు పని చేయాలని ఎన్నాళ్ల నుంచో వెయిటింగ్. ఇప్పుడు ‘ఆదర్శ కుటుంబం’తో ఆ కోరిక తీరబోతోంది. ఇటీవలే ఈ సినిమా పట్టాలెక్కింది. ఆఘ మేఘాల మీద ఈ సినిమాని పూర్తి చేసి, ఈ వేసవికి విడుదల చేయాలని దర్శక నిర్మాతలు ప్లాన్ చేశారు. ఓ ఫ్యామిలీ డ్రామాకు, క్రైమ్ మిక్స్ చేసి.. ఈ కథ రాశారు త్రివిక్రమ్. ఈ వేసవికి పర్ఫెక్ట్ సినిమా అవుతుంది.
కాకపోతే.. ఈ టీమ్ లో కీలకమైన మార్పులు చేర్పులు జరుగుతున్నాయని సమాచారం. ఈ సినిమా కోసం ‘లక్కీ భాస్కర్’ చిత్రానికి పని చేసిన బన్గ్లాన్ అనే ఆర్ట్ డైరెక్టర్ ని తీసుకొన్నారు. ఆయన ఆధ్వర్యంలో ఓ ఇంటి సెట్ కూడా వేశారు. అయితే ఆ సెట్ త్రివిక్రమ్ కి నచ్చలేదట. దాంతో షూటింగ్ ఆపేసి, మరో ఆర్ట్ డైరెక్టర్ ప్రకాష్ ని తీసుకొని, కొత్తగా సెట్ వేసి షూటింగ్ మొదలెట్టారు. అంతకు ముందు కెమెరా మెన్ విషయంలో ఇలాంటి మార్పు జరిగింది. ఓ కెమెరా మెన్ ని తీసుకొని, కొన్ని రోజులు షూట్ చేసి, ఆ తరవాత కెమెరామెన్ ని మార్చారు. ఇలాంటి మార్పులు, చేర్పుల వల్ల షూటింగ్ కాస్త ఆలస్యం అవుతోంది. అయితే అనుకొన్న సమయానికే సినిమా పూర్తి చేయాలన్న ధ్యేయంతో ఉన్నారు త్రివిక్రమ్. ఈ సినిమాకు సంబంధించిన ఓ ఇంట్రస్టింగ్ అప్ డేట్ త్వరలోనే బయటకు వచ్చే అవకాశం ఉంది.
