రాజాసాబ్ విడుదలైన తొలిరోజే ఫ్లాప్ టాక్ బయటకు వచ్చేసింది. తిట్టుకొన్నవాళ్లంతా అప్పుడే తిట్టుకొన్నారు. అయితే ఓటీటీలోకి వచ్చాక ఫ్రెష్ బ్యాచ్ దిగింది. ఫ్రేమ్ టూ ఫ్రేమ్ పోస్ట్ మార్టమ్ మొదలైంది. ప్రతీ షాట్నీ భూతద్దంలో చూస్తూ తప్పులు వెదుకుతున్నారు. ఇది వరకు కూడా చాలా ఫ్లాపులు వచ్చాయి. ఇలా ఓటీటీలో రిలీజ్ అయ్యాక… వాటిని మరింతగా చీల్చి చెండాడారు. కానీ ‘రాజాసాబ్’ లెవలే వేరు. ఈ సినిమాకి వచ్చినన్ని ట్రోల్స్.. ఏ సినిమాకీ రాలేదేమో? ఈ వైఫల్యానికి నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ దే పూర్తి బాధ్యత అనే కామెంట్లు బలంగా వినిపిస్తున్నాయి.
రాజాసాబ్ కథ, కథనాలు, వాటి వైఫల్యాలు పక్కన పెడితే – వీఎఫ్ఎక్స్ మాత్రం ఘోరంగా తయారయ్యాయి. సిల్వర్ స్క్రీన్ పై కనిపించని తప్పులు సైతం.. ఓటీటీ స్క్రీన్ పై కనిపిస్తున్నాయి. దాంతో ఈ సినిమాపై డామేజీ మరింత ఎక్కువైంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీకి వీఎఫ్ఎక్స్ స్టూడియోలు ఉన్నాయి. వీళ్లే ‘మిరాయ్’ సినిమాకీ పని చేశారు. ఆ సినిమాలోని వీఎఫ్ఎక్స్ కి మంచి మార్కులు పడ్డాయి. కానీ ‘రాజాసాబ్’ విషయంలో తేలిపోయాయి. రాజాసాబ్ వీఎఫ్ఎక్స్ని అసలేమాత్రం నైపుణ్యం లేని టీమ్ చేతిలో పెట్టారని అందుకే ఇంత ఘోరంగా తయారయ్యాయని ఇన్ సైడ్ వర్గాలు చెబుతున్నాయి. థియేట్రికల్ రిలీజ్ కీ, ఓటీటీ రిలీజ్ కి మధ్య చాలా టైమ్ ఉంది. ఈ గ్యాప్ లో కొన్ని షాట్స్ ని రీ ప్లేస్ చేయొచ్చు. రీ వర్క్ చేసి ఓటీటీకి రిలీజ్ చేయొచ్చు. కానీ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఇవేం పట్టించుకోలేదు. థియేట్రికల్ కాపీనే ఓటీటీకి పంపించేసింది. దాంతో మీమర్లకు అడ్డంగా దొరికిపోవాల్సివచ్చింది. అలా కాకుండా.. కాస్త టైమ్ తీసుకొని, కాస్త ఖర్చు పెట్టి, రీ వర్క్ చేసి, తేలిపోయిన వీఎఫ్ఎక్స్ షాట్స్ ని మళ్లీ రీ ప్లేస్ చేసి ఉంటే.. ఇంత డామేజీ జరిగేది కాదు. పీఎమ్ఎఫ్ గ్రాఫిక్స్ టీమ్ కి రాజాసాబ్ విజువల్స్ పై వర్క్ చేసేంత సమర్థత ఉందా, లేదా? అనేది కూడా చూసుకోలేదు. చేతిలో గ్రాఫిక్ స్టూడియో ఉంటే.. క్వాలిటీ బాగుండాలి. కానీ ఇక్కడ రివర్స్ అయ్యింది. కర్ణుడి చావుకి వంద కారణాలు అన్నట్టు.. రాజాసాబ్ డామేజీకి.. ఇదో పెద్ద కారణం. ఈ విషయంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ చాలా పెద్ద తప్పే చేసింది.
