తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీల పనితీరుపై ప్రధాని మోదీ ఏ మాత్రం సంతృప్తిగా లేరు. ప్రత్యేకంగా విందు భేటీకి పిలిచి కడుపు నిండా భోజనం పెట్టి చెప్పాల్సింది గట్టిగానే చెప్పి పంపించారు. ఏపీ, తెలంగాణకు చెందిన ఎంపీలకు మోదీ ఇచ్చిన విందులో గట్టి హెచ్చరికలు అందినట్లుగా ఎంపీలు చెప్పుకుంటున్నారు.
ముఖ్యంగా తెలంగాణ ఎంపీలపై ప్రధాని మోదీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. మంచి టీమ్ ఉంటే ఎందుకు పార్టీని బలోపేతం చేయలేకపోతున్నారని ప్రశ్నించారు. పార్టీ గ్రాఫ్ పెంచలేకపోతున్నారని .. కలసికట్టుగా పని చేయకపోవడం పైనా మోదీ గట్టిగా ప్రశ్నించినట్లుగా చెబుతున్నారు. తెలంగాణకు చెందిన ఎంపీలు ఎవరూ సోషల్ మీడియాను యాక్టివ్ గా ఉపయోగించడం లేదని అన్నట్లుగా తెలుస్తోంది. మజ్లిస్ ఎంపీ ఒక్కరే సోషల్ మీడియాను గట్టిగా ఉపయోగించుకుంటున్నారని.. మీరంతా మెరుగుపడాల్సి ఉందని సూచించారు. వచ్చే ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి రావాలని దిశానిర్దేశం చేసినట్లుగా తెలుస్తోంది.
మరో వైపు ఏపీ బీజేపీ ఎంపీలకూ ఆ స్థాయిలో కాకపోయినా కొంత గట్టిగానే సూచనల రూపంలో ఆదేశాలు ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఏపీ మంచి వృద్ధిరేటుతో ముందుకు వెళ్తోందని .. పెట్టుబడులను ఆకర్షిస్తోందన్నారు. ప్రభుత్వంపై మంచి ఫీడ్ బ్యాక్ ఉందన్నారు. అయితే వైసీపీ సోషల్ మీడియాలో .. బయట చేస్తున్న విమర్శలపై ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించినట్లుగా చెబుతున్నారు. జగన్ బీజేపీని ఎప్పుడూ విమర్శించలేదు. కనీసం కూటమిని కూడా విమర్శించడం లేదు. కేవలం చంద్రబాబును మాత్రమే విమర్శిస్తున్నారు. ఈ విమర్శలకు బీజేపీ నేతలకు ఎలా కౌంటర్ ఇవ్వాలో అర్థం కావడం లేదు. ఇప్పుడు ఆయనను విమర్శించినా ప్రభుత్వాన్ని విమర్శించినట్లే అనుకుని.. బీజేపీ ఎంపీలు గట్టిగా కౌంటర్ ఇస్తారేమో చూడాల్సి ఉంది.
