భారత్ ఆపరేషన్ సింధూర్ చేపట్టనంత వరకు భీకర ప్రకటనలు చేసిన పాక్.. ఇప్పుడు నాలుక మడతేసింది. భారత్ ను అదే పనిగా గోకితే ఏం జరుగుతుందో ఆపరేషన్ సింధూర్ తో దాయాది దేశానికి ఓ పిక్చర్ కనిపించినట్టు ఉంది. అందుకే తాజాగా శాంతి ప్రవచనాలు వల్లించడం స్టార్ట్ చేసింది.
ఇటీవల పాకిస్తాన్ రక్షణ శాఖ మంత్రి ఖవాజా ఆసిఫ్ భారత్ ను అదేపనిగా రెచ్చగొట్టారు. భారత్ గనుక తమ దేశంపై దాడి చేస్తే తమ ప్రతీకారం మామూలుగా ఉండదు అంటూ భీకర ప్రకటనలు చేశారు. ప్రపంచం ఊహించని విధంగా దాడులు ఉంటాయని వార్నింగ్ ఇచ్చారు. ఇంతలోనే భారత్ ఆపరేషన్ సింధూర్ చేపట్టడంతో ఆయన స్వరం మార్చారు.
ఆపరేషన్ సింధూర్ తో ఒక్కసారిగా పాక్ ఉలిక్కిపడింది. ఊహించని విధంగా ఇండియా లక్షిత దాడులు చేయడంతో పాక్ వెన్నులో వణుకుపుట్టినట్లు ఉంది. పాక్, పీవోకేలోని 9 ఉగ్ర శిభిరాలపై దాడులు నిర్వహించగా.. ఈ ఆపరేషన్ లో జైషే మహ్మద్, లష్కరే తోయిబా ప్రధాన కార్యాలయాలు ధ్వంసమయ్యాయి. సుమారు 80 మంది ఉగ్రవాదులు మృతి చెందినట్లు తెలుస్తోంది.
దీంతో పాక్ రక్షణ శాఖ మంత్రి తాజాగా స్పందిస్తూ.. భారత్ ను వేడుకుంటే ప్రపంచం ముందు పరువు పోతుందని అనుకున్నట్టు ఉన్నారు. అందుకే భారత్ ఆపరేషన్లు ఆపితే తాము అపుతామని అంతర్జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. భారత్ దాడులు ఆపితే తాము సంయమనం పాటిస్తామని, పాక్ యుద్ధం కోరుకోవడం లేదన్నారు.
ఆసిఫ్ ఖవాజా వ్యాఖ్యలను చూస్తుంటే.. భారత్ మరిన్ని దాడులు చేస్తుందని భయంతో ఉన్నట్టు కనిపిస్తోంది. అందుకే ఆయన భారత్ దాడులు ఆపాలని, యుద్ధం వద్దు అంటూ శాంతి ప్రవచనాలు వల్లించినట్లుగా కనిపిస్తోంది.