ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం జాతీయ స్థాయిలో మరోసారి మెరిసింది. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన దీన్ దయాళ్ ఉపాధ్యాయ పంచాయతీ సతత్ వికాస్ జాతీయ అవార్డుల్లో ఆంధ్రప్రదేశ్ పంచాయతీ రాజ్ శాఖ విశేష ప్రతిభ కనబరిచి, దేశవ్యాప్తంగా ఉన్న రాష్ట్రాల్లో అగ్రస్థానంలో నిలిచింది. గతంలో 24వ స్థానంలో ఉన్న ఏపీ, కేవలం రెండు ఏళ్ల కాలంలోనే రాష్ట్రీయ గ్రామ స్వరాజ్ అభియాన్ ర్యాంకింగ్స్లో నెంబర్ 1 స్థానానికి చేరుకుంది. పవన్ కళ్యాణ్ బాధ్యతలు చేపట్టిన తర్వాత తీసుకొచ్చిన విప్లవాత్మక మార్పులే ఈ విజయానికి పునాది అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఒకే రోజు గ్రామసభలతో ప్రపంచ రికార్డ్
గ్రామాభివృద్ధి, స్థానిక సంస్థల బలోపేతంపై పవన్ కళ్యాణ్ ప్రత్యేక దృష్టి సారించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 13,326 గ్రామ పంచాయతీల్లో ఒకే రోజు గ్రామ సభలు నిర్వహించి ప్రపంచ రికార్డు సృష్టించడమే కాకుండా, ప్రజా భాగస్వామ్యంతో సుమారు రూ.4,500 కోట్ల విలువైన ఉపాధి హామీ పనులకు రూపకల్పన చేశారు. ఈ పారదర్శక విధానం వల్ల నిధుల దుర్వినియోగం తగ్గి, గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పన వేగవంతమైంది. వేల కిలోమీటర్ల సీసీ రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థల ఆధునీకరణతో పల్లెల రూపురేఖలు మారుతున్నాయి.
అనేక సంస్కరణలు
ఈ ఏడాది అవార్డుల్లో ఏపీలోని పలు గ్రామాలు వివిధ విభాగాల్లో సత్తా చాటాయి. పేదరిక నిర్మూలన – జీవనోపాధి మెరుగుదల విభాగంలో వైఎస్ఆర్ కడప జిల్లాలోని చెమ్ముళ్లపల్లి గ్రామం దేశంలోనే రెండో స్థానాన్ని కైవసం చేసుకుంది. అలాగే, ఆరోగ్యవంతమైన పంచాయతీ , నీటి సమృద్ధి ఉన్న పంచాయతీ విభాగాల్లోనూ ఏపీ గ్రామాలు టాప్ ర్యాంకుల్లో నిలిచాయి. పవన్ కళ్యాణ్ నాయకత్వంలో సుమారు 10,000 మంది పంచాయతీ రాజ్ ఉద్యోగులకు పదోన్నతులు కల్పించి, వ్యవస్థలో జవాబుదారీతనాన్ని పెంచడం కూడా ఈ విజయానికి ప్రధాన కారణమైంది.
గ్రామమే దేశానికి వెన్నెముక
జాతీయ స్థాయిలో దక్కిన ఈ గుర్తింపుపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హర్షం వ్యక్తం చేశారు. ఈ అవార్డులు మన బాధ్యతను మరింత పెంచాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దార్శనికత, ప్రధాని మోదీ సహకారంతో పల్లెల్లో నిజమైన స్వరాజ్యం తీసుకురావడమే మా లక్ష్యం అని ఆయన పేర్కొన్నారు. కేవలం గణాంకాల్లోనే కాకుండా, క్షేత్రస్థాయిలో ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడటమే ఈ అవార్డుల వెనుక ఉన్న అసలు ఉద్దేశమని ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. మొత్తానికి, గ్రామమే దేశానికి వెన్నెముక అన్న గాంధీజీ కలను ఏపీ ప్రభుత్వం నిజం చేస్తోందనడానికి ఈ అవార్డులే నిదర్శనం.
