పూరి పేరు చెప్పినా.. టికెట్టు తెగ‌లేదేటి??

ఇప్ప‌ట్లో సినిమా అంటే… హీరో బొమ్మ‌యినా చూసి వెళ్లాలి, లేదంటే ద‌ర్శ‌కుడి పేరైనా చూసి వెళ్లాలి. ఇద్ద‌రిలో ఎవ‌రికి క్రేజ్ ఉన్నా ప‌నైపోతుంది. `రోగ్` సినిమాని ఎందుకుచూడాలి? అని స‌గ‌టు ప్రేక్ష‌కుడు త‌న‌ని తాను ప్ర‌శ్నించుకొంటే…. పూరి కోస‌మే – అనే స‌మాధానం మాత్ర‌మే వ‌స్తుంది. నిజం… పూరి కోసం వంద రూపాయ‌ల టికెట్టు తెగ‌డంలో త‌ప్పేం లేదు. ఆ వంద‌కి వంద శాతం గ్యారెంటీ. ఆ స్థాయిలో వినోద ప‌ర‌చి.. థియేట‌ర్ల నుంచి బ‌య‌ట‌కు పంపుతాడు. సినిమా హిట్ట‌యినా, ఫ్లాప్ అయినా పూరి మార్కు వినోదం, హీరోయిజం… అక్క‌డ‌క్క‌డా పాస్ ఆన్ అవుతూ ఉంటుంది. ఈ న‌మ్మ‌కంతోనే మ‌నోహ‌ర్ లాంటి అన్న‌య్య‌లు ఇషాన్‌లాంటి త‌మ్ముళ్ల‌ని తీసుకొచ్చి… ప‌నిలో ప‌నిగా పూరి చేతిలో కోట్ల‌కు కోట్లు ధార‌బోస్తుంటారు.

రోగ్ సినిమాని ఓ పెద్ద హీరో సినిమా స్థాయిలోనే తీశారు. కేవ‌లం… మేకింగ్ విష‌యంలో. ఈ సినిమా చూడ్డానికి ఆక‌ర్షించే ఒకే ఒక్క పాయింట్ పూరి జ‌గన్నాథ్‌. ఆ ఎలిమెంట్ కూడా ఈ సినిమాకి వ‌సూళ్లు తీసుకురావ‌డంలో ఫెయిల్ అయ్యింది. బీ, సీల్లో పూరికి వీర లెవిల్లో ఫ్యాన్స్ ఉన్నారు. వాళ్ల నాడీని అంత‌లా ప‌ట్టేశాడు పూరి. కానీ.. అక్క‌డ కూడా ఈ సినిమా దారుణంగా డింకీ కొట్టింది. ఓవ‌ర్సీస్‌లో అయితే చెప్పుకోవాల్సిన ప‌నే లేదు. ఈ సినిమాని ప‌ట్టించుకొనే నాథుడే క‌ర‌వ‌య్యాడు. ఈమ‌ధ్య కాలంలో ఓవ‌ర్సీస్‌లో పూర్ ఓపెనింగ్స్ సంపాదించుకొన్న సినిమా ఇదే. టోట‌ల్‌గా చూస్తే.. పూరి ఖాతాలో మ‌రో పెద్ద డిజాస్ట‌ర్‌. పూరి పేరు చెబితే టికెట్లు తెగే రోజులు పోయాయ‌ని చెప్ప‌డానికి `రోగ్‌` అతి పెద్ద నిద‌ర్శ‌నం. రేపు బాల‌కృష్ణ – పూరి సినిమా వ‌చ్చినా… బాల‌య్య కోస‌మే థియేట‌ర్‌కి వెళ్తారు. పూరి ఇప్పుడు జీరో. త‌న పాత హిట్ల‌ని చూపించుకొంటూ.. అవ‌కాశాలు సంపాదించుకోవ‌డం కుద‌ర‌ని ప‌ని. త‌న క‌థ‌తో, త‌న‌దైన మాట‌ల‌తో మ్యాజిక్ చేయాలి. లేదంటే పూరి కూడా త‌న గురువు రాంగోపాల్ వ‌ర్మ‌లానే త‌యార‌య్యే ప్ర‌మాదం ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com