చిరంజీవి సినిమాల్లో ఆల్ టైమ్ క్లాసిక్.. ‘జగదేకవీరుడు – అతిలోక సుందరి’. ఈ సినిమా విడుదలై 35 ఏళ్లయ్యింది. మే 9న (శుక్రవారం) రీ రిలీజ్ చేస్తున్నారు కూడా. ఈవారం చిరంజీవి ఫ్యాన్స్‌కి ఇదో పెద్ద పండగ. ఈ సందర్భంగా చిరు, రాఘవేంద్రరావు, అశ్వనీదత్.. ఈ ముగ్గురూ ఓ కామన్ ఇంటర్వ్యూ చేసి వదిలారు. అది బాగా వైరల్ అవుతోంది. థియేటర్ల దగ్గర కూడా హోర్డింగులు పెట్టి, కాస్త హడావుడి చేస్తున్నారు.
రీ రిలీజ్లు ఈమధ్య బాగా ఆడుతున్నాయి. పైగా ఇది చిరంజీవి సినిమా. 3డీ ఎఫెక్టులతో చూసే అవకాశం ఉంది కాబట్టి, ఇంకాస్త క్రేజ్ పెరిగింది. నిజానికి ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ సీక్వెల్ చేయాలని అశ్వనీదత్ ఎప్పటి నుంచో అనుకొంటున్నారు. సీక్వెల్ కి సరైన మెటీరియల్ ఉన్న కథ ఇది. క్లైమాక్స్ లో కూడా అందుకు ఓ లీడ్ ఇచ్చారు. శ్రీదేవి ఉంగరం సముద్రంలో పడేయడం, ఓ చేప పిల్ల ఆ ఉంగరాన్ని మింగేయడం.. ఇలా సీక్వెల్ కి కావల్సిన పునాది క్లైమాక్స్ లో వేసుకొన్నారు రాఘవేంద్రరావు. రామ్ చరణ్ – జాన్వీ కపూర్‌తో ఈ సినిమా చేయాలన్నది ప్లాన్. ఇది వరకు ఓసారి అశ్వనీదత్ గట్టిగా ప్రయత్నాలు కూడా చేశారు. కానీ కుదర్లేదు. ఇక మీదట కూడా కుదిరే అవకాశాలు లేవు.
చిరంజీవి పాత్రలో చరణ్ కనిపిస్తే అభిమానులు ఒప్పుకొంటారు. కానీ.. శ్రీదేవిలోని గ్లామర్, ఆ సొగసు, దేవ కన్య రూపు జాన్వీలో తీసుకురావడం చాలా కష్టం. ఈ విషయాన్ని రాఘవేంద్రరావు ఒప్పుకొన్నారు కూడా. శ్రీదేవిని రీప్లేస్ చేయడం అసాధ్యమని, ఇళయరాజా పాటలకు కూడా పునః సృష్టి లేదని తేల్చి చెప్పారు దర్శకేంద్రుడు. రీమేక్, సీక్వెల్.. ఇవి రెండూ దాదాపు కుదరని విషయాలు. నాగ అశ్విన్ ఏమైనా ఈ బ్యాక్ డ్రాప్లో కొత్త కథ రాసుకొంటే అప్పుడు ప్రాజెక్ట్‌కి కాస్త క్రేజ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. నాగ అశ్విన్ టెక్నికల్‌గా స్ట్రాంగ్. తన ఆలోచనలు కూడా కొత్తగా ఉంటాయి. ఆయన పూనుకొంటే చరణ్, జాన్వీ కలవడం అసాధ్యమేం కాదు. అశ్వనీదత్ ఈ దశగా ప్రయత్నాలేమైనా చేస్తే బాగుంటుందేమో? లేదంటే ఇలా రీ రిలీజ్‌లతోనే సరిపెట్టుకోవాలి.