మహిళలు, సెటిలర్లకు దక్కింది మొండిచెయ్యే!

హైదరాబాదు నగర మేయర్‌, డిప్యూటీ మేయర్‌ స్థానాల విషయంలో తెరాస ఎలాంటి వ్యూహాన్ని అనుసరించబోతున్నది అనే విషయంలో ఫలితాలు వచ్చిన నాటినుంచి రకరకాల ఊహాగానాలు సాగాయి. భిన్న వర్గాల నుంచి ఈ స్థానాలను ఆశించిన వారు పార్టీలో తమకు చేతనైన స్థాయిలో పైరవీలు చేసుకున్నారు. అయితే మేయర్‌ స్థానాన్ని మహిళలకు కేటాయిస్తారని, డిప్యూటీ మేయర్‌ స్థానాన్ని ఆంధ్రా సెటిలర్లుగా ఉంటూ కార్పొరేటర్‌గా ఎన్నికైన వారిలో ఒకరికి కట్టబెడతారని ప్రధానంగా ప్రచారం జరిగింది.

కానీ బుధవారం సాయంత్రానికి ఫైనల్‌గా మేయర్‌, డిప్యూటీల పేర్లను పార్టీ ప్రకటించే సమయానికి పూర్తి క్లారిటీ వచ్చింది. ఇన్నాళ్లు సాగినవన్నీ కేవలం ఊహాగానాలు మాత్రమే. పార్టీ తన పాత స్టయిల్లోనే పార్టీకి విధేయులు అయిన వారికి మాత్రమే పదవులు కట్టబెట్టింది తప్ప.. ఇతరత్రా కారణాలు వేటినీ పరిగణనలోకి తీసుకోలేదని అర్థమైపోయింది.

తాజాగా మేయర్‌గా బొంతురామ్మోహన్‌, డిప్యూటీ మేయర్‌గా బాబా ఫసియుద్దీన్‌ ల పేర్లను పార్టీ ఖరారు చేసిన సంగతి తెలిసిందే. అయితే మేయర్‌ స్థానాన్ని మ హిళలకు ఇవ్వడం ద్వారా.. కేసీఆర్‌ మహిళా వ్యతిరేకి అని ఉన్న అపకీర్తిని తొలగించుకునే ప్రయత్నం చేస్తారనే ప్రచారం బాగా జరిగింది. ఆమేరకు మహిళా కార్పొరేటర్లు చాలా మంది ఈ పదవి మీద ఆశ పెంచుకున్నారు కూడా! అసలే కేబినెట్‌లో ఒక్క మహిళకు కూడా చోటు ఇవ్వకుండా విమర్శలు ఎదుర్కొన్న కేసీఆర్‌, మేయర్‌ స్థానం మహిళకు ఇచ్చేసి ఆ వర్గాన్ని ఆకర్షిస్తారని అనుకున్నారు. దానికి తగ్గట్లుగా సీనియర్‌ నేత ఎంపీ కేకేశవరావు కుమార్తె లాంటి వాళ్లు కార్పొరేటర్లుగా గెలవడం కూడా ఈ ఊహాగానాలకు కాస్త బలమిచ్చింది. కానీ ఆ ఊహలన్నీ డొల్లేనని తేలిపోయింది.

అలాగే సెటిటర్ల విషయం కూడా.. సెటిలర్లను పోలింగ్‌కు ముందు కీర్తించడం, తర్వాత వదిలేయడం.. ఏరుదాటేదాకా ఓడ మల్లన్న, ఏరు దాటిన తర్వాత బోడి మల్లన్న సిద్ధాంతం అన్నట్లుగా కాకుండా వారికి డిప్యూటీ పదవి ఇస్తారని, తద్వారా సెటిలర్లలో మరింతగా తెరాస పట్ల అభిమానం పెరగడానికి బాటలు వేసుకుంటారని అంతా అనుకున్నారు. ఆ ఆలోచనలు కూడా నిజం కాదని పార్టీ నిరూపించింది. పార్టీ యువజన నాయకుడు బాబా ఫసియుద్దీన్‌ను డిప్యూటీగా ఎంపిక చేశారు.
మహిళలకు, సెటిలర్లకు తెరాస పార్టీ ఇప్పటిదాకా రాజకీయంగా చిన్నచూపే తప్ప పచేసిందేమీ లేదు.. అయినా ప్రజలు బ్రహ్మరథం పడుతూనే ఉన్నారు. మరి అలాంటి నేపథ్యంలో కొత్తగా వారికి కిరీటాలు పెట్టాల్సిన అవసరం ఏమిటి? అనే వ్యూహంతో పార్టీ ఉన్నట్లు అర్థమవుతోంది. ఎటూ జనం నీరాజనాలు పడుతున్నప్పుడు.. ఇప్పుడు అనుసరిస్తున్న పద్ధతే కరెక్టనే భావన వారిలో కలిగితే తప్పు కాదు. ముందు ముందు కూడా మహిళలు, సెటిలర్లను చిన్నచూపు చూడడం కొనసాగించినా ఆశ్చర్యం లేదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com