భారతీయ రియల్ ఎస్టేట్ రంగంలో ప్రవాస భారతీయుల పెట్టుబడులు సరికొత్త రికార్డుల దిశగా దూసుకుపోతున్నాయి. 2026 నాటికి మొత్తం మార్కెట్ వాటాలో ఎన్నారైల పెట్టుబడులు 18-20 శాతానికి చేరుకుంటాయని తాజా ఆర్థిక విశ్లేషణలు వెల్లడిస్తున్నాయి. అంతర్జాతీయంగా నెలకొన్న ఆర్థిక అనిశ్చితి దృష్ట్యా, సురక్షితమైన , దీర్ఘకాలిక లాభాలనిచ్చే పెట్టుబడిగా ప్రవాసులు తమ మాతృభూమిలోని స్థిరాస్తి రంగాన్ని ఎంచుకుంటున్నారు. ముఖ్యంగా అమెరికా, బ్రిటన్, కెనడా , గల్ఫ్ దేశాల్లో స్థిరపడిన భారతీయులు భారీ ఎత్తున నిధులను భారత్‌కు మళ్లిస్తున్నారు.
హైదరాబాద్ నగరం ఎన్నారైల పెట్టుబడులకు ప్రధాన కేంద్రంగా మారింది. నగరంలోని పశ్చిమ భాగంలో ఉన్న కోకాపేట్, మోకిలా, శంకర్ పల్లి ,తెల్లాపూర్ వంటి ప్రాంతాల్లో వెలుస్తున్న ప్రీమియం విల్లా ప్రాజెక్టులపై ప్రవాసులు విపరీతమైన ఆసక్తి చూపుతున్నారు. అంతర్జాతీయ స్థాయి వసతులు, విశాలమైన గ్రీన్ స్పేస్, గెటెడ్ కమ్యూనిటీ కల్చర్ ఉన్న ప్రాజెక్టులకు డిమాండ్ పెరిగింది. ఒక్కో విల్లా ధర 5 కోట్ల నుంచి 20 కోట్ల వరకు ఉన్నప్పటికీ, భవిష్యత్తులో వచ్చే భారీ లాభాలను దృష్టిలో ఉంచుకుని ఎన్నారైలు వీటిని కొనుగోలు చేస్తున్నారు.
కేవలం నివాసం కోసమే కాకుండా, సెకండరీ ఇన్కమ్, రిటైర్మెంట్ ప్లానింగ్‌లో భాగంగా కూడా ఈ పెట్టుబడులు సాగుతున్నాయి. రూపాయి విలువలో హెచ్చుతగ్గులు ,భారత ప్రభుత్వ డిజిటలైజ్డ్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ వల్ల పారదర్శకత పెరగడం ఎన్నారైలలో నమ్మకాన్ని కలిగించింది. గతంలో కేవలం అపార్ట్మెంట్లకే పరిమితమైన వీరు, ఇప్పుడు విలాసవంతమైన విల్లాలు, ఇంటిగ్రేటెడ్ టౌన్‌షిప్‌ల వైపు మొగ్గు చూపుతున్నారు. దీనివల్ల హైదరాబాద్ రియల్ ఎస్టేట్ గ్రాఫ్ దేశంలోని ఇతర మెట్రో నగరాల కంటే వేగంగా వృద్ధి చెందుతోంది.
రాబోయే రెండేళ్లలో ఈ పెట్టుబడుల ప్రవాహం మరింత పెరిగే అవకాశం ఉందని రియల్ ఎస్టేట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. గ్లోబల్ ఐటీ హబ్‌గా హైదరాబాద్ ఎదుగుతుండటం, ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ ,రీజినల్ రింగ్ రోడ్ వంటి మౌలిక సదుపాయాల అభివృద్ధి ఎన్నారైలను మరింతగా ఆకర్షిస్తోంది. విదేశీ గడ్డపై సంపాదించిన సొమ్మును స్వదేశంలో ఆస్తిగా మార్చుకోవాలనే ఆకాంక్ష, రియల్ ఎస్టేట్ రంగానికి కొత్త ఊపిరి పోస్తోంది. ఈ ధోరణి ఇలాగే కొనసాగితే, 2026 చివరి నాటికి భారత రియల్ ఎస్టేట్ రంగం ఎన్నడూ లేని విధంగా అత్యున్నత స్థాయికి చేరుకోవడం ఖాయం.
