పిఠాపురంలో జనసేన పార్టీని పవన్ కల్యాణ్ ప్రక్షాళన చేస్తున్నారు. చాలా కాలం పాటు ఇంచార్జ్ గా పని చేసిన మర్రెడ్డి శ్రీనివాసరెడ్డిని పూర్తిగా తొలగించారు. కొన్నాళ్ల క్రితం ఆయనను తొలగించి ఫైన్ మెన్ కమిటీని నియమించారు. ఆ కమిటీలోనూ మర్రెడ్డి ఉన్నారు కానీ ఇప్పుడు పూర్తిగా తొలగించి.. కిషోర్ అనే నేతను ఆయన స్థానంలో నియమించారు. కిషోర్ పార్టీ నేతలకు వసతి కల్పించడంతో పాటు ఆర్థికంగా ఖర్చుపెట్టుకుని పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
మర్రెడ్డి శ్రీనివాస్ పిఠాపురం టీడీపీ, జనసేన మధ్య పొసగని పరిస్థితులు తీసుకు వచ్చి.. టీడీపీ నేత వర్మతో విబేధాలు పెంచుతున్నారన్న ఆరోపణలు వచ్చాయి. అదే సమయంలో ఆయన నియోజకవర్గంలో పలు దందాలు చేస్తున్నారని సొంత పార్టీ నేతల నుంచి పెద్ద ఎత్తున ఫిర్యాదులు వచ్చాయి. వాటిపై విచారణ జరిపి ఆయనను పక్కన పెట్టాలని నిర్ణయించారు. మర్రెడ్డి ఎన్నికలకు ముందు నుంచి జనసేన కోసం పని చేస్తున్నారు.
పవన్ కల్యాణ్ పిఠాపురం నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. డిప్యూటీ సీఎంగా ఆయన కీలకంగా ఉంటున్నారు. తీరిక లేకుండా ఉంటున్నారు. ఈ క్రమంలో పార్టీ వ్యవహారాల్లో కీలకంగా ఉండేందుకు ఐదుగురు సభ్యుల కమిటీని నియమించారు. పవన్ కల్యాణ్ కూడా పిఠాపురంలో ఇల్లు కట్టుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఇప్పటికే అక్కడ విశాలమైన భూముల్ని కొనుగోలు చేశారు. మరికొన్ని భూముల్ని కొంటున్నారు. త్వరలో ఇల్లు కట్టుకుని రెగ్యులర్ గా పిఠాపురం వెళ్లే యోచనలో ఉన్నారు.


