గుండు చ‌ర్చ‌కు ఫుల్ స్టాప్ పెట్టిన‌ట్టే..!

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ కు తెలుగుదేశం నాయ‌కుడు ప‌రిటాల ర‌వి అప్పట్లో గుండు కొట్టించారు..! కొన్నేళ్లుగా ఈ చ‌ర్చ ఎప్ప‌టిక‌ప్పుడు తెర మీదికి వ‌స్తూనే ఉంటుంది. అలాగ‌ని, ఈ టాపిక్ ఎవ‌రైనా ప్ర‌స్థావ‌న‌కు తెస్తే, ప‌వ‌న్ కూడా స్పందించ‌కుండా ఉండ‌రు. గుండు కొట్టిస్తే ఊరుకునే మ‌నిషినేనా అంటూ ఆ మ‌ధ్య ఆంధ్రా ప‌ర్య‌ట‌న‌లో ఆవేశంగా మాట్లాడారు. అది నిజ‌మో కాదో తెలీయ‌కుండానే వార్త‌ల్లో పెద్ద అంశంగా మారిపోయింద‌న్నారు. ఏకంగా మొద‌టిపేజీ స్థాయికి త‌న విష‌యం వ‌చ్చేయ‌డంతో తాను రోడ్డుమీద‌కు రావాల్సిన అవ‌స‌రం వ‌చ్చింద‌న్నారు. తాను ఎవ‌రి జోలికీ వెళ్ల‌న‌నీ, త‌న‌ ప‌ని తాను చేసుకుని ఇంట్లో కూర్చుంటాన‌ని అన్నారు. వాళ్ల‌కి తానేం ద్రోహం చేశాన‌నో తెలీద‌నీ, ‘అది కూడా టీడీపీ ఆఫీస్ నుంచి వ‌చ్చింద‌ట‌.. అంటే, నిజంగా ఒక‌రు న‌న్ను అలా చేస్తే చేత‌గాని వాజ‌మ్మ‌ను అనుకుంటున్నారా..? నాకూ చాలా పౌరుషం ఉంటుంది. త‌న‌కు సినిమాల మీద చిరాకు పుట్టి అప్ప‌ట్లో గుండు కొట్టించుకున్నాను’ అని క్లారిటీ ఇచ్చారు.

అయితే, తాజాగా ఏపీ మంత్రి ప‌రిటాల సునీత ఇంటికిన ప‌వ‌న్ వెళ్లిన సంగ‌తి తెలిసిందే. ఇక్క‌డ కూడా ఇదే అంశం చ‌ర్చ‌కు రావ‌డ విశేషం. ఇదే అంశ‌మై మంత్రి సునీత స్పందిస్తూ… ప‌వ‌న్ కు త‌న భ‌ర్త పరిటాల ర‌వి గుండు కొట్టించారంటూ జ‌రుగుతున్న ప్ర‌చారంలో ఏమాత్రం నిజం లేద‌న్నారు. వార్త‌ల్లో టీవీల్లో దీని గురించి విన్నామ‌నీ, త‌న భ‌ర్త ఎవ్వ‌రికీ గుండు కొట్టించే వ్య‌క్తి కాద‌నీ, ఆయ‌న స్వ‌భావం అలాంటిది కాద‌నీ, వీలైతే సాయం చేసే మ‌న‌స్త‌త్వం ఆయ‌న‌ది అని ఆమె స్ప‌ష్ట‌త ఇచ్చారు. ప‌రిటాల ర‌వితో గ‌తంలో త‌న‌కు ప‌రిచ‌యం లేద‌ని ప‌వ‌న్ అన్నారు. వారి ఇంటికి రావ‌డం కూడా ఇదే మొద‌టిసారి అన్నారు. ఇదే అంశంపై ప‌రిటాల శ్రీ‌రామ్ కూడా మాట్లాడారు. ప‌వ‌న్ క‌ల్యాణ్ తో ప్ర‌త్యేక‌మైన స్ప‌ర్థ‌లేవీ లేవ‌నీ, అలాంటి క‌థ‌నాల‌ను న‌మ్మాల్సిన అవ‌స‌రం త‌మ‌కు లేద‌న్నారు. త‌మ ఇంటికి ప‌వ‌న్ రావ‌డం సంతోషంగా ఉంద‌ని శ్రీ‌రామ్ చెప్పారు.

ప‌వ‌న్ క‌ల్యాణ్‌, ప‌రిటాల సునీత‌, శ్రీ‌రామ్‌… ఈ ముగ్గురూ గుండు చర్చకు దాదాపు ఫుల్ స్టాప్ పెట్టార‌ని చెప్పుకోవ‌చ్చు. ప‌వ‌న్ ను విమ‌ర్శించాల‌నుకునేవారికి ఈ గుండు అంశం ఒక అస్త్రంగా మారిన సంగ‌తి తెలిసిందే. దీనిపై ప‌వ‌న్ కూడా గ‌తంలో ఘాటుగా స్పందించ‌డం, ఇప్పుడు ప‌రిటాల కుటుంబం కూడా ఇప్పుడు ఇదే అంశంపై స్ప‌ష్టంగా మాట్లాడ‌టంతో ఈ చ‌ర్చ‌కు తెర దించార‌నే చెప్పుకోవ‌చ్చు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.