పేర్ని నాని పోలీస్ స్టేషన్ కు వెళ్లి సీఐపై చేసిన రుబాబు రాష్ట్రమంతా చూసింది. ఓడిపోయిన వీళ్లకు ఇంకా అతి తగ్గలేదని .. వీళ్లను ఎందుకు ఇలా వదిలేస్తున్నారన్న ప్రశ్నలు ప్రభుత్వానికి వస్తున్నాయి. పోలీసులు కూడా ఇలాంటి అలుసు ఇవ్వకూడదని నిర్ణయించుకున్నారు. సీరియస్ గా తీసుకుని పోలీసులు కేసులు నమోదు చేయడంతో పేర్ని నాని షాక్కు గురయ్యారు. ఎస్పీకి అడగకపోయినా వివరణ ఇచ్చారు.
సుబన్న అనే నేతను పోలీసులు గంటల తరబడి విచారణ పేరుతో కూర్చోబెడుతున్నారని అడిగేందుకు తాను పోలీస్ స్టేషన్ కు వచ్చానన్నారు. కానీ సీఐ రెచ్చగొట్టాడని చెప్పుకొచ్చారు. ఈ రెచ్చగొట్టడం ఏమిటో పేర్ని నాని ఎస్పీకి చెప్పారో లేదో కానీ.. రెచ్చగొట్టారని తన పనుల్ని సమర్థించుకుంటే చట్టప్రకారం చెల్లదని పేర్ని నానికి తెలియనట్లుగా ఉంది. రెచ్చిపోయి చట్ట విరుద్ధంగా ప్రవర్తిస్తే.. రెచ్చగొట్టారని తప్పించుకోలేరు.
సుబ్బన్న అనే పార్టీ నేతను విచారణకు పిలిచారని పేర్ని నాని ఈ దుందుడుకుతనం చూపించారు. ఆ సుబ్బన్నను రాత్రికి రాత్రే అరెస్టు చేశారు. ఇప్పుడు పేర్ని నాని సహా 29 మందిపై కేసులు నమోదయ్యాయి. పోలీసులు చట్ట ప్రకారం వెళ్తున్నారన్న ఉద్దేశంతో మచిలీపట్నంలో అలజడి రేపేందుకు పేర్ని నాని ప్రయత్నిస్తున్నారు. శాంతిభద్రతల సమస్యలు సృష్టించేందుకు ఏ మాత్రం వెనుకాడటం లేదు. పోలీసులతో దురుసుగా ప్రవర్తిస్తే.. వారే సర్దుకుపోతారని అనుకుంటున్నారు. కానీ సహనానికీ ఓ హద్దు ఉంటుందని ఆయన గుర్తించలేకపోతున్నారన్న విమర్శలు వస్తున్నాయి.