ఇరాన్ , ఇజ్రాయెల్ మధ్య కొనసాగుతున్న యుద్ధం ఇప్పుడు అత్యంత ప్రమాదకరమైన చమురు యుద్ధంగా మారుతోంది. ఇరు దేశాలతో పాటు గల్ఫ్ దేశాల ఇంధన వనరులపై మరొకరు దాడులు చేసుకుంటుండటంతో ప్రపంచవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతోంది.
శనివారం రాత్రి అమెరికా మద్దతుతో ఇజ్రాయెల్ దళాలు ఇరాన్ రాజధాని టెహ్రాన్ సమీపంలోని కీలకమైన ఐదు చమురు కేంద్రాలపై విరుచుకుపడ్డాయి. ఈ దాడుల్లో షహ్రాన్ చమురు డిపోతో పాటు పలు ఇంధన నిల్వ కేంద్రాలు భారీగా దెబ్బతిన్నాయి. తెల్లవారుజామున టెహ్రాన్ ఆకాశం నారింజ రంగులోకి మారేలా అక్కడ మంటలు ఎగిసిపడ్డాయి. ఈ దాడిలో నలుగురు చమురు సిబ్బంది మరణించినట్లు ఇరాన్ అధికారికంగా ధృవీకరించింది.
ఇజ్రాయెల్ దాడులకు ఇరాన్ కూడా అదే స్థాయిలో బదులిస్తోంది. ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ ఇజ్రాయెల్‌లోని హైఫా చమురు శుద్ధి కర్మాగారాన్ని లక్ష్యంగా చేసుకుని క్షిపణులను ప్రయోగించింది. దీనికి ముందు, మార్చి 2న సౌదీ అరేబియాలోని అతిపెద్ద రాస్ తనురా రిఫైనరీపై కూడా ఇరాన్ డ్రోన్ దాడులు జరిగాయి. పశ్చిమాసియాలోని ఇంధన సరఫరా వ్యవస్థను అస్తవ్యస్తం చేయడం ద్వారా అటు ఇజ్రాయెల్‌ను, ఇటు పాశ్చాత్య దేశాలను ఆర్థికంగా దెబ్బతీయడమే ఇరాన్ లక్ష్యంగా కనిపిస్తోంది.
ఈ ఆయిల్ వార్ కారణంగా అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ముఖ్యంగా చైనాకు ఇరాన్ నుంచి అందే చమురు సరఫరాకు ఆటంకం కలగడం, అటు హార్ముజ్ జలసంధి మూతపడటం ప్రపంచ వాణిజ్యంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈ దాడులు ఇలాగే కొనసాగితే గ్లోబల్ ఎనర్జీ సంక్షోభం తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. చమురు నిల్వలే లక్ష్యంగా దాడులు జరగడం వల్ల ఇంధన ధరల పెరుగుదల ద్వారా సామాన్యులపై భారం పడే అవకాశం ఉంది.


