ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు భిన్నంగా మారుతున్నాయి. కారణం ఏదైనా రాజకీయ గొడవల బాధితులకు పరిహారాలు ఇవ్వడం అనే సంప్రదాయం ప్రారంభమయింది. ఎవరి పార్టీ వాళ్లు వాళ్లకు సాయం చేస్తే సమస్య ఉండేది కాదు కానీ ప్రభుత్వం నుంచి సాయం చేయాలనుకుంటున్నారు. చేస్తున్నారు కూడా . ఇదే ఇప్పుడు వివాదాస్పదం అవుతోంది. వైసీపీ హయాంలో హత్యకు గురైన తోట చంద్రయ్య కుమారుడికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వడం.. ఇప్పుడు కందుకూరు హత్య ఘటనలో బాధిత కుటుంబానికి ప్రజాధనం పరిహారం ఇవ్వడం ..రెండు సందర్భాల్లోనూ విమర్శలకు కారణం అవుతున్నాయి. పాలకులు మరింత జాగ్రత్తగా ప్రజాధనం, ఆస్తుల విషయంలో ఉండాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయాలు వినిపించడానికి కారణం అవుతోంది.
చంద్రయ్య కుమారుడికి ప్రభుత్వ ఉద్యోగం – ఈ ఆలోచన ఎలా ?
మాచర్లలో చంద్రయ్య అనే టీడీపీ కార్యకర్తను వైసీపీ కార్యకర్తలు పట్టపగలు పీక కోసి చంపారు. ఆయన కుమారుడికి అండగా ఉండాలని ప్రభుత్వం నిర్ణయించింది. జూనియర్ అసిస్టెంట్ గా ఉద్యోగం ఇవ్వాలని కేబినెట్ లో తీర్మానించారు. శాసనసభలో ఆమోదం పొందినా .. మండలిలో వైసీపీకి మెజార్టీ ఉండటంతో ఆగిపోయింది. ఇంకో సారి మండలికి పంపితే.. ఆమోదం లేకపోయినా ఉద్యోగం వస్తుంది. కానీ రేపు ప్రభుత్వం మారితే.. ఆ ఉద్యోగాన్ని రద్దు చేయవచ్చు. వేధింపులకూ పాల్పడవచ్చు. అదే ప్రభుత్వ సర్వీసులో ఉండి.. ప్రజల కోసం పని చేస్తూ చనిపోయిన వారి కుటుంబాలకే ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చే సంప్రదాయం ఈ నియామకంతో మారిపోతుంది. రేపు మరో పార్టీ అడ్వాంటేజ్ తీసుకుంటే .. మొత్తం వ్యవస్థ కలుషితం అయిపోతుంది.
కందకూరు బాధిత కుటుంబానికి సాయం ప్రజా ధనమా ?
కందకూరులో ఏం జరిగిందో .. ఎందుకు జరిగిందో పక్కన పెడితే.. అది ఓ క్రైమ్. ఇద్దరు వ్యక్తులో.. కుటుంబాలో పగతో చేసుకున్నాయి. బాధిత కుటుంబం అనాధగా మారింది. హంతకుడు జైలు పాలయ్యాడు. ఇక్కడ ప్రభుత్వం బాధిత కుటుంబానికి ఎకరాలకు ఎకరాలు.. లక్షలకు లక్షలు ఇవ్వాల్సిన పని లేదు. వారికి న్యాయం చేయడం అంటే.. నిందితులకు శిక్ష పడేలా చేస్తే సరిపోతుంది. ఇంకా కందుకూరు పోలీసులు హంతకుడి కుటుంబ ఆస్తిని జప్తు చేసి బాధితులకు ఇచ్చేందుకు కోర్టుకు వివరాలు సమర్పించారు కూడా. ఆ విషయం వరకూ ఓకే కానీ.. ప్రజాధనం ఎందుకివ్వాలన్న ప్రశ్న వస్తోంది. ఏడాదికి 9వేల హత్యలు జరుగుతాయని..అందరికీ పరిహారం ఇస్తారా అని మాజీ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావు అడిగిన ప్రశ్నకు సమాధానం ప్రభుత్వ పెద్దలు కూడా చెప్పలేరు.
ఇలా డబ్బులివ్వడం వల్ల… ప్రతి హత్యకూ రాజకీయ రంగు ఖాయం !
ఇప్పుడు హత్యల్ని హత్యల్లా చూడకుండా.. డబ్బులు ఇవ్వడం ప్రారంభిస్తే.. ప్రతి హత్యకూ కులం రంగు పులిమి.. రాజకీయ హత్యలుగా మార్చేస్తారు. ఏపీలో ఉన్న విపక్షం గురించి టీడీపీ నేతలు.. పాలకులకు బాగా తెలుసు. అయినా ఎందుకు ఇలా పాలసీల పరంగా తేలిపోతున్నారన్నది ఆశ్చర్యకరంగా మారింది. రాజకయాలు ఎంత ఘోరంగా మారుతున్నాయో.. కందుకూరు హత్య ఘటన నిరూపిస్తోంది. దీన్ని ఆర్థిక సాయంతో అదీ ప్రజాధనం ఇచ్చి ఎదుర్కోవాలనుకునే వ్యూహం మాత్రం.. చాలా ఆశ్చర్యకరంగా ఉంది. అందుకే విమర్శల పాలవుతోంది.