దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ మద్యం విధానం కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా, బీఆర్ఎస్ నేత కల్వకుంట్ల కవిత సహా 23 మంది నిందితులను నిర్దోషులుగా ప్రకటిస్తూ రౌస్ అవెన్యూ కోర్టు సంచలన తీర్పునిచ్చింది. సీబీఐ దాఖలు చేసిన ఛార్జిషీట్లో ఎటువంటి ప్రాథమిక సాక్ష్యాలు లేవని, కేవలం ఊహాగానాలతోనే కుట్ర సిద్ధాంతాన్ని అల్లారని కోర్టు తీవ్రంగా వ్యాఖ్యానించింది. అయితే, ఈ న్యాయపోరాటంలో విజయం సాధించినా.. గత నాలుగేళ్లుగా ఈ నేతలు కోల్పోయిన రాజకీయ మూల్యం అంత సులభంగా తిరిగి వస్తుందా? అన్నది ఇప్పుడు అసలైన ప్రశ్న.
రాజకీయ మరకలు చెరగని ముద్రలు
రాజకీయాల్లో ఒక సామెత ఉంది. న్యాయస్థానంలో నిర్దోషిగా తేలడం సులభం కానీ, ప్రజల మనస్సులో పడ్డ అనుమానాన్ని తుడిచేయడం కష్టం. కేజ్రీవాల్ వంటి అవినీతి రహిత ముద్ర ఉన్న నాయకుడు జైలుకు వెళ్లడం, నెలల తరబడి కటకటాల వెనుక ఉండటం వల్ల ఆయన ఇమేజ్ ఇప్పటికే కొంత దెబ్బతింది. కోర్టు క్లీన్ చిట్ ఇచ్చినా, ప్రత్యర్థులు అప్పటికే చేసిన దుష్ప్రచారం సామాన్య ఓటర్ల మెదళ్లలో నాటుకుపోయింది. ఇప్పుడు కేసు కొట్టేసినా, ఏదో జరిగి ఉంటుంది అనే సందేహాన్ని ప్రత్యర్థులు రాజకీయం చేయడానికి వాడుకుంటూనే ఉంటారు.
ఆప్ కోలుకోవడం కష్టమే
ఈ కేసు కారణంగా మనీష్ సిసోడియా వంటి నాయకుడు దాదాపు 17 నెలలు, కేజ్రీవాల్ ఐదు నెలల పాటు జైలులోనే గడపాల్సి వచ్చింది. ఈ కాలంలో ఢిల్లీ , పంజాబ్ రాజకీయాల్లో ఆప్ ఎన్నో సవాళ్లను ఎదుర్కొంది. కవిత విషయంలో కూడా తెలంగాణ రాజకీయాల్లో ఈ కేసు పెద్ద ప్రభావాన్నే చూపింది. ఎన్నికల సమయంలో ఈ కేసులను అస్త్రంగా మార్చుకుని ప్రత్యర్థులు లబ్ధి పొందారు. ఇప్పుడు కోర్టు తీర్పు వచ్చినా.. ఆనాడు జరిగిన ఎన్నికల నష్టాన్ని గానీ, వ్యక్తిగతంగా వారు అనుభవించిన మానసిక క్షోభను గానీ ఎవరూ పూడ్చలేరు. కోర్టు తన తీర్పులో ఒక కీలక అంశాన్ని ప్రస్తావించింది. అప్రూవర్ల వాంగ్మూలాలను ఉపయోగించి దర్యాప్తు సంస్థలు ఖాళీలను పూడ్చడానికి ప్రయత్నించాయని, ఇది రాజ్యాంగ విరుద్ధమని స్పష్టం చేసింది. ఇది రాజకీయంగా ఆప్, బీఆర్ఎస్ పార్టీలకు పెద్ద ఊరట. తమపై అక్రమ కేసులు పెట్టారు అని ప్రజల్లోకి వెళ్లి చెప్పుకోవడానికి ఇప్పుడు వారికి ఒక సర్టిఫికేట్ లభించినట్లయింది. కానీ, తక్షణమే దీనివల్ల పెద్దగా పొలిటికల్ మూమెంటమ్ వస్తుందని భావించలేం. ప్రజలు ఇప్పటికే ఒక అభిప్రాయానికి వచ్చేసిన వేళ, ఈ తీర్పు కేవలం వారి నైతిక విజయం స్థాయిలోనే మిగిలిపోవచ్చు.
సవాల్ అలాగే ఉందా?
ట్రయల్ కోర్టు తీర్పుతో ఈ కథ ముగిసినట్లు కాదు. సీబీఐ ఇప్పటికే ఈ తీర్పును హైకోర్టులో సవాలు చేసింది. అంటే, ఈ న్యాయపరమైన ఉచ్చు వీరిని ఇంకా వెంటాడుతూనే ఉంటుంది. రాజకీయంగా చూస్తే, కేజ్రీవాల్ లేదా కవిత ఇప్పుడు బాధితులుగా తమను తాము ప్రొజెక్ట్ చేసుకోవచ్చు. కానీ ఓటర్లు దీన్ని ఎలా స్వీకరిస్తారనేది రాబోయే అసెంబ్లీ ఎన్నికల ఫలితాలే తేలుస్తాయి. లిక్కర్ స్కామ్ కేసులో క్లీన్ చిట్ అనేది ఒక పెద్ద మైలురాయి. అయితే ఇది వారి కోల్పోయిన వైభవాన్ని తిరిగి తెచ్చిపెడుతుందా? అంటే ఖచ్చితంగా చెప్పలేం. రాజకీయాల్లో ఒకసారి పడ్డ మచ్చ ను చెరిపేసుకోవడానికి కోర్టు తీర్పుల కంటే, ప్రజల విశ్వాసాన్ని మళ్లీ చూరగొనడమే అసలైన పరిష్కారం.


