ఐపీఎల్ లో ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న జట్లలో రాయల్ ఛాలెంజర్స్ ఆఫ్ బెంగళూరు (ఆర్సీబీ) ఒకటి. కోహ్లీ ఆ జట్టుకు వెన్నుముక. ‘ఈసారి కప్పు మనదే’ అంటూ 18 ఏళ్లు ఊరించి, చివరికి కప్పు సాధించారు. ఈ ఐపీఎల్ లో కూడా ఆర్సీబీ జోరు చూపిస్తోంది. ప్రస్తుతానికి పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉంది. ఐపీఎల్ లో చాలా ఘనమైన రికార్డులు ఆర్సీబీ సొంతం. అయితే ఓ చెత్త రికార్డ్ కూడా ఆర్సీబీ పేరిటే ఉంది. టీమ్ లోయెస్ట్ టోటల్ ఘనత ఆర్సీబీదే. 49 పరుగులకే ఆలౌట్ అయి ఓ చెత్త రికార్డ్ తన ఖాతాలో వేసుకొంది. 19 సీజన్ల ఐపీఎల్ చరిత్ర లో అతే అత్యల్ప స్కోరు. 2017లో కొల్ కొత్తాతో ఆడుతూ కేవలం 49 పరుగులకే ఆలౌటై అప్రతిష్ట మూటగట్టుకొంది. అప్పటి నుంచీ ఆర్సీబీ అభిమానుల్ని ఆ రికార్డ్ గుర్తు చేస్తూ ఏడిపిస్తుంటారు యాంటీ ఫ్యాన్స్. కోహ్లి, గేల్, డివిలియర్స్ లాంటి సూపర్ స్టార్లు ఉండి కూడా 49 పరుగులకు ఆలౌట్ అవ్వడం ఇప్పటికీ ఆశ్చర్యమే.
నిన్నటి ఢిల్లీ మ్యాచ్లో ఆర్సీబీ ఈ రికార్డును చెరివేసే అవకాశం చేజిక్కించుకొంది. తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ ఓ దశలో 9 పరుగులకే 6 వికెట్లు కోల్పోయింది. ఆరు ఓవర్లలో ఢిల్లీ చేసింది 13 పరుగులే. ఈ దశలో ఆర్సీబీ రికార్డ్ మాయం అయిపోతుందన్న ఆశ కలిగింది. కానీ చివరికి ఢిల్లీ 75 పరుగుల స్కోరు చేయగలిగింది. ఆరు వికెట్లు సాధించినప్పుడు మరింత కట్టుదిట్టంగా బౌలింగ్ చేయగలిగితే.. కచ్చితంగా సరికొత్త అత్యల్ప స్కోరు నమోదు అయ్యేది. ఆర్సీబీ తనపై పడిన మచ్చని చెరిపివేసుకొనేది. కానీ అలా జరగలేదు. దాంతో ఆర్సీబీ ఘన విజయం సాధించినా.. ఫ్యాన్స్ లో ఏదో మూల చిన్న అసంతృప్తి మిగిలిపోయింది. ‘9 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయినా 75 పరుగులు చేశారు. మీరెలా 49 కి ఆలౌట్ అయిపోయారు’ అంటూ యాంటీ ఆర్సీబీ ఫ్యాన్స్ మళ్లీ సోషల్ మీడియా సాక్షిగా ట్రోలింగ్ మొదలెట్టారు. అలా గెలిచినా.. పూర్తి స్థాయి ఆనందం దక్కలేదు ఆర్సీబీకి.
బెంగళూరు తరవాత అత్యల్ప స్కోరు రికార్డు రాజస్థాన్ పేరిట ఉంది. ఓసారి 58 పరుగులకు, మరోసారి 59 పరుగులకు ఆలౌట్ అయ్యింది ఆ జట్టు. రెండుసార్లూ ప్రత్యర్థి జట్టు బెంగళూరు కావడం విశేషం.
