సుబ్రహ్మణ్యం విఎస్ కూచిమంచి
తుందూరు.. ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ వ్యాప్తంగా దీనిపేరు మార్మోగిపోతోంది. ఎందుకు? అని ప్రశ్నించుకుంటే.. మెగా ఆక్వా ఫుడ్స్ తలపెట్టిన రొయ్యల ప్లాంట్ గుర్తుకొస్తుంది. తద్వారా తమకు ఎదురయ్యే కష్టాలు తలచుకుని వారు పడుతున్న ఆవేదన కనిపిస్తుంది. వీరి ఆవేదన సమంజసమైనదేనా. ఓ పరిశ్రమొస్తే ఉపాధి అవకాశాలు పెరుగుతాయి కదా.. ఆ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది కదా.. అని వాదించేవాళ్ళూ ఉన్నారు. ఈ నేపథ్యాన్ని రాజకీయం చేసే బేహారులు అక్కడ ప్రస్తుతం వాలిపోతున్నారు. ఇక్కడ ప్రముఖంగా ప్రస్తావించదగిన పేర్లు రెండు. ఒకటి జనసేన అధినేత పవన్ కల్యాణ్.. రెండోది ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్రెడ్డి. వీరిద్దరి కంటే ముందే సీపీఎం గ్రామస్థుల తరఫున పోరాటానికి సమకట్టింది. పోలీసులు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శిని గ్రామంలోకి రాకుండా అడ్డుకున్నారు కూడా.
అధికార తెలుగుదేశం పార్టీకి ఆలంబనగా నిలిచిన ఉభయగోదావరి జిల్లాల్లోని కాపు సామాజిక వర్గం పవన్ కల్యాణ్ మాట వింది. కొత్తరాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో టీడీపీకి పట్టం కట్టింది. పారిశ్రామికాభివృద్ధి నిజమే అయితే, ఆ ప్రాంతానికి చేటు చేయనిదైతే.. ఆ విషయాన్ని ముఖ్యమంత్రివర్యులే నేరుగా ఆ గ్రామానికొచ్చి నచ్చచెప్పచ్చు కదా. అదేమీ లేకుండానే నేననుకున్నది చేస్తాననే రీతిలో సాగుతున్నారాయన. వత్తాసు పలికిన పవన్ కల్యాణ్ తీరులో గడిచిన ఆగస్టు నుంచి కొద్దిగా మారినట్టు కనిపించినప్పటికీ, తుందూరు వ్యవహారంలో మళ్ళీ మొదటికొచ్చినట్లనిపిస్తోంది. గ్రామానికి వెళ్ళకుండా గ్రామస్థులను తన వద్దకే రప్పించుకోవడం మాట్లాడడం దేనికి సంకేతం. ప్రశ్నించేందుకే వస్తున్నానన్న పి.కె.లో ఫైర్ తగ్గిందా. తన జిల్లాలోనే ఇదంతా సాగుతోంది కాబట్టి..మాట్లాడకపోతే బాగోదనుకున్నారా. ఎక్కడైనా చేసే పని ఇదే కదా అనుకున్నారా. నేను నిద్రపోను.. మిమ్మల్ని నిద్రపోనివ్వనని తొమ్మిదేళ్ళు అధికారులకు కంటిమీద కునుకు లేకుండా చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఈసారి నేననుకున్నదే ఎలాగైనా చేసుకెడతాననే వైఖరిని కనబరుస్తున్నారు. అలాగే వ్యవహరిస్తున్నారు కూడా. పట్టిసీమ ఎత్తిపోతల దగ్గర్నుంచి.. ప్రత్యేక హోదా ఆపై పోలవరం… తాత్కాలిక సచివాలయం.. అన్నీ తానకున్నట్లే సాగేలా సూటిగా దూసుకెడుతున్నారు.
ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి తీరు కొంచెం భిన్నంగా ఉంది. ఆపదెక్కడుందో అక్కడ వాలిపోతున్నారు. ప్రజల ఆర్తనాదాలు ఎక్కడ వినిపిస్తాయో అక్కడికి దూసుకెడుతున్నారు. ప్రతిపక్ష నేతగా అది ఆయన బాధ్యత. ఇందులో ఎంతవరకూ కృతకృత్యులు కాగలిగారన్నది శేష ప్రశ్న. ఎంతసేపూ ప్రజల్లో ఉన్నామా లేదా అన్నది చూసుకుంటున్నారు తప్ప.. దాని ఫలితాన్ని పట్టించుకోవడం లేదు. భగవద్గీతలో కృష్ణుడు చెప్పినట్లు నీ పనిచెయ్యి ఫలితాన్ని ఆశించకన్న రీతిలో ఆయన వ్యవహార శైలుంది. ఆయన చేపట్టిన దీక్షలు, విద్యార్థులతో నిర్వహిస్తున్న యువభేరులు వీటికి సజీవ సాక్ష్యాలు. తాజాగా బుధవారం తుందూరులో జగన్ పర్యటన ఆసక్తిని రేకెత్తించింది. ప్రజాభిప్రాయాన్ని సేకరించకుండా పరిశ్రమను ఏర్పాటుచేయడాన్ని ఆయన గర్హించారు. గ్రామస్థులకు అండగా ఉంటానన్నారు.
ఎవరెన్ని ప్రయత్నాలు చేసినప్పటికి ముక్కుసూటిగా పోయేవాడినే విజయం వరిస్తుంది. ఇక్కడ ఆ ముక్కుసూటి పేరు అధికారం.. ఈ ముగ్గురిలో విజయం ఎవరిదనేది పాత అంశాలు చాలా స్పష్టంగానే చెబుతున్నాయి. కానీ ఇందులో ఎవరి రాజకీయ ప్రయోజనాలను వారు చూసుకుంటున్నారు తప్ప.. ప్రజా ప్రయోజనాన్ని కాదనేది వివరంగా చెప్పాల్సిన అవసరం లేదు కదా.
సుబ్రహ్మణ్యం విఎస్ కూచిమంచి