తెలంగాణ పోలీసు శాఖలో అత్యంత సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ప్రణీత్ రావును డీఎస్పీ హోదా నుండి సీఐ స్థాయికి డిమోట్ చేస్తూ ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ పోలీసు చరిత్రలోనే ఒక డీఎస్పీ హోదాలో ఉన్న అధికారిని తిరిగి సీఐగా తగ్గించడం ఇదే మొదటిసారి.
ప్రస్తుతం సస్పెన్షన్‌లో ఉన్న దుగ్యాల ప్రణీత్ రావు డీఎస్పీ హోదాను ప్రభుత్వం రద్దు చేసింది. డీఎస్పీగా పదోన్నతి పొందిన అనంతరం ప్రొబేషన్ కాలంలోనే ఆయన తీవ్రమైన విధులను దుర్వినియోగానికి పాల్పడినట్లు నిర్ధారణ కావడంతో హోంశాఖ ఈ కఠిన నిర్ణయం తీసుకుంది. హోంశాఖ ప్రధాన కార్యదర్శి సీవీ ఆనంద్ ఈ మేరకు జీవో జారీ చేశారు. దీంతో ప్రణీత్ రావు ఇకపై ఇన్‌స్పెక్టర్‌గానే కొనసాగనున్నారు. నిజానికి ఆయనను డిమోట్ చేయడానికి కారణం తీవ్రమైన విధుల దుర్వినియోగం అయితే..డిస్మిస్ చేసేయొచ్చు. కానీ డిమోషన్‌తో సరి పెట్టారు.
నిజానికి ప్రణీత్ రావుకు గతంలోనే డీఎస్రపీ అయ్యే అర్హత లేకపోయినా అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం క యాక్సిలరేటెడ్ ప్రమోషన్ కల్పించింది. ఉగ్రవాద వ్యతిరేక పోరాటాల్లో లేదా మావోయిస్టు అణిచివేతలో అసాధారణ ప్రతిభ కనబరిచిన అధికారులకు మాత్రమే ఇలాంటి పదోన్నతులు ఇస్తారు. 2007 బ్యాచ్‌కు చెందిన దాదాపు 300 మంది అధికారులు ఉండగా, కేవలం ప్రణీత్ రావుకు మాత్రమే ఇలా డీఎస్పీగా పదోన్నతి కల్పించడం అప్పట్లోనే వివాదాస్పదమైంది. ఈ కారణంతోనే ఆయనను డిమోట్ చేయవచ్చు. విధుల దుర్వినియోగానికి పాల్పడినందుకు డిస్మిస్ చేయవచ్చు. కానీ ప్రభుత్వం ప్రణీత్ రావుపై కనికరం చూపిస్తోంది.


