ప్రొ.నాగేశ్వర్ :చంద్రబాబు వల్ల నష్టం జరగకుండా కాంగ్రెస్ తీసుకున్న జాగ్రత్తలేంటి..?

చంద్రబాబు వల్ల కాంగ్రెస్ పార్టీకి లాభమా..? నష్టమా..? అన్నది మిలియన్ డాలర్ క్వశ్చన్. తెలుగుదేశం పార్టీతో కాంగ్రెస్ పొత్తు పెట్టుకోవడాన్ని టీఆర్ఎస్ అడ్వాంటేజ్ గా తీసుకుని దూకుడుగా ప్రచార వ్యూహాన్ని మార్చుకుంది. చంద్రబాబు తెలంగాణపై పెత్తనానికి వస్తున్నారంటూ ప్రచారం చేస్తున్నారు. దీంతో.. టీడీపీ వల్ల కాంగ్రెస్‌కు నష్టం అంటూ ప్రచారం చేస్తున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ.. టీడీపీతో పొత్తుల వల్ల జరిగే నష్టం కన్నా.. కలిగే లాభమే ఎక్కువ ఉంటుందని అంచనా వేసుకోవడం వల్ల.. పొత్తు కుదుర్చుకుంది.

ప్రభుత్వాన్ని ప్రభావితం చేయలేరని కాంగ్రెస్ చెబుతోందా..?

తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి ఉన్న సంప్రదాయ ఓటర్లు ఇతర బలంతో పోల్చినప్పుడు… చంద్రబాబు వల్ల కాంగ్రెస్‌ పార్టీకి ఓటేయాలనుకునేవారు… పొత్తు వల్ల దూరం అవుతారని.. భావించేవాళ్లు చాలా తక్కువ మందే ఉన్నారని కాంగ్రెస్ పార్టీ నేతల భావన. ఈ మేరకు వారు సర్వేలు చేసుకుని అవగాహనకు వచ్చి ఉంటారు. ఇంకా ముఖ్యమైన విషయం ఏమిటంటే… ప్రజాకూటమిలో.. టీడీపీ పాత్ర ప్రముఖమైనదేమీ కాదని చెప్పడానికి కాంగ్రెస్ పార్టీ వీలైనంతగా ప్రయత్నిస్తోంది. టీడీపీ కేవలం పదమూడు స్థానాల్లోనే పోటీ చేస్తోంది. కూటమిలో అదో మైనర్ పార్టీ మాత్రమే. ఏ రకంగా చూసినా.. టీడీపీ… ఓ సిగ్నిఫిషియంట్ పార్ట్ కాదు. అందుకే… ప్రజాకూటమి గెలిచినా… రాబోయే ప్రభుత్వంలో టీడీపీ నిర్ణయాత్మక పాత్ర పోషించలేదు అన్న.. అభిప్రాయం ఏర్పర్చడానికి కాంగ్రెస్ ప్రయత్నం చేస్తోంది. ఇచ్చిన పదమూడు సీట్లలో ఆరు లేదా.. ఏడు స్థానాల్లో టీడీపీ గెలిస్తే.. ఆ సీట్లతో.. ప్రభుత్వాన్ని ప్రభావితం చేయలేరు. కాంగ్రెస్ ఇదే అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తోంది.

ఇది కూటమి … కాంగ్రెస్ – టీడీపీ పొత్తు కాదని చెబుతున్నారా..?

ఇది కాంగ్రెస్ – టీడీపీల కలయిక కాదు. టీఆర్ఎస్ వ్యతిరేక శక్తులన్నీ ఏకమయ్యాయి. తెలంగాణ జన సమితి, సీపీఐని కూడా.. చివరి వరకూ చర్చలు జరిపి జరిపి… కూటమిలో చేర్చుకున్నారు. దీనిని కారణం ఆయా పార్టీలు బలంగా ఉన్నాయని కాదు.. ఒక్క తెలుగుదేశం పార్టీతోనే పొత్తు పెట్టుకుంటే అది ప్రమాదకరంగా ఉంటుంది…. టీఆర్ఎస్ విమర్శలకు ఎక్కువ అవకాశం ఇచ్చినట్లవుతుంది. అలా కాకుండా… అన్ని పార్టీలను కలుపోకవడం వల్ల.. ఇది కేవలం టీఆర్ఎస్ ను వ్యతిరేకించడానికి ఏర్పాటు చేసిన ప్రయత్నం అని చెప్పదల్చుకున్నారు. టీఆర్ఎస్‌ను ఓడించడానికి తామందరం జట్టుకట్టామని ఓ .. కూటమిగా వస్తున్నామని చెబుతున్నారు. తాము కేవలం.. టీడీపీతో మాత్రమే పొత్తు పెట్టుకున్నామనే అభిప్రాయం ప్రజల్లో రాకుండా చూసుకుంటున్నారు.

కోదండరాంను కూటమి కన్వీనర్‌గా పెట్టడంలో వ్యూహం ఏమిటి..?

ఇక తెలంగాణ ఉద్యమకారుల్లో ఇమేజ్ ఉన్న కోదండరాంను.. ప్రజాకూటమికి కన్వినర్ గా పెట్టారు. నిజానికి తెలంగాణ వాదుల్లో… టీడీపీతో కోదండరాం పొత్తేమిటి అన్న అభిప్రాయం ఉంది. కానీ.. తెలుగుదేశం పార్టీతో పొత్తును సమర్థించుకునేందుకు కోదండరాం కూడా సహకరించారు. ఆయన కూడా.. కూటమిలో కలవడం వల్ల… చంద్రబాబు పెత్తనం సాగదని చెప్పదల్చుకున్నారు. అందుకే… ఆయనను ప్రజాకూటమి కన్వీనర్‌గా పెట్టారు. అలాగే.. చంద్రబాబును… మిగతా తెలంగాణ జిల్లాలకు వెళ్లకుండా.. కాంగ్రెస్ పార్టీ.. చేయగలిగింది. ఒక్కసారి ఖమ్మంలో… మిగతా అంతా హైదరబాద్‌కే చంద్రబాబు పరిమితం అయ్యారు. సహజంగా టీడీపీ బలం కూడా అక్కడే ఉంది. టీడీపీకి సామాజికంగా, భౌగోళికంగా, రాజకీయంగా మద్దతు పలికే ఓటు బ్యాంక్ హైదరాబాద్ లోనే ఉంది. అందుకే చంద్రబాబును అక్కడి వరకు పరిమితం చేశారు. దీని వల్ల ఇతర జిల్లాల్లో వ్యతిరేకత రాకుండా జాగ్రత్త పడ్డారు.

జాతీయ స్థాయి కూటమికి అంకరార్పణ జరిగిందని చెబుతున్నారా..?

అలాగే చంద్రబాబు కూడా ప్రచారంలో వివాదాస్పద అంశాల జోలికి పోవడం లేదు. ఆయన చాలా జాగ్రత్తగా… మాట్లాడారు. ప్రాజెక్టులను తాను ఎందుకు అడ్డుకుంటామని చెబుతున్నారు. జల వివాదాలు ఏమైనా ఉంటే కూర్చుని పరిష్కరించుకుందామని పిలుపునిస్తున్నారు. ఇక కేసీఆర్ తనపై ఎందుకు విమర్శలు చేస్తున్నారో అర్థం కావడం లేదంటూ.. తను చేసిన అభివృద్ధి కార్యక్రమలను ఏకరవు పెడుతున్నారు. అంతే.. కానీ ఎక్కడా వివాదాస్పద ప్రకటనలు చేయడం లేదు. పైగా.. ఈ ప్రజాకూటమి.. ఒక్క తెలంగాణకే పరిమితం కాదని.. దేశ వ్యాప్తంగా ఏర్పడుతున్న కూటమి ఇదని చెప్పేందుకు చంద్రబాబు ప్రయత్నించారు. బీజేపీకి వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో ఏర్పడుతున్న కూటమికి తెలంగాణలో అంకురార్పణ జరిగిందన్న భావన తెచ్చారు. అందుకే తెలంగాణ ఎన్నికల హడావుడి ప్రారంభం కాగానే.. చంద్రబాబు ఢిల్లీ వెళ్లి పలువురు నేతల్ని కలిశారు. అందువల్ల.. ఇదే కాంగ్రెస్ – టీడీపీ పొత్తు మాత్రమే అని కాకుండా… జాతీయ స్థాయిలో విపక్షాలన్నీ కలసి పోరాడే కూటమిగా ఓ భావన తెచ్చే ప్రయత్నం చేశారు. వీటన్నింటి కారణంగా… చంద్రబాబు వల్లే ఏమైనా నష్టం జరుగుతుందని అనుకుంటే.. దాన్ని వీలైనంతగా తగ్గించుకునే ప్రయత్నాన్ని చేశారని చెప్పుకోవాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com