ప్రొ.నాగేశ్వర్ : సుప్రీంకోర్టు వివాహేతర బంధాల్ని సమర్థించిందా..?

వివాహేతర బంధాల్లో పురుషుడ్ని మాత్రమే నిందితుడిగ చూసే సెక్షన్ 497ను సుప్రీంకోర్టు కొట్టి వేసింది. అయితే ఈ తీర్పుపై అనేక రకాల విశ్లేషణలు వస్తున్నాయి. భిన్నమైన అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. సుప్రీంకోర్టు తీర్పు వల్ల వివాహ వ్యవస్థపై ప్రభావం పడుతుందని.. విశృంఖలత్వం పెరుగుతుందని కొంత మంది విమర్శలు ప్రారంభించేశారు. కానీ అసలు సెక్షన్ 497 గురించి పూర్తిగా తెలుసుకోకుండా.. సుప్రీంకోర్టు తీర్పులో పూర్తిగా ఏముందో అధ్యయనం చేయకుండా.. కేవలం హెడ్ లైన్ చూసి ఇష్టం వచ్చినట్లు విమర్శలు చేయడం సరికాదు. చట్టాలను విశ్లేషించినట్లుగా చెబుతున్నారు.

అందరూ తీర్పును అర్థం చేసుకోకుండా మాట్లాడుతున్నారా..?

సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం చూస్తే.. వివాహేతర సంబంధం నేరమా..? లేదా… వివాహేతర బంధం విడాకులకు ప్రాతిపదికయా..? అన్న అంశానికే పరిమితమయింది. ఇప్పుడున్న చట్టాల వరకు అయితే..ఇలాంటి కేసుల్లో ఐదేళ్ల వరకు జైలు శిక్ష విధించవచ్చు. ఇప్పుటి వరకు చట్టంలో ఏముందంటే… ఒక భర్త అనుమతితో ఓ స్త్రీ వివాహేతర సంబంధం పెట్టుకుంటే ఏ శిక్ష పడదు. భర్త అనుమతి లేకుండా… స్త్రీ వివాహేతర సంబంధం పెట్టుకుంటే శిక్ష పడుతుంది. ఇదీ సుప్రీంకోర్టు చెప్పింది. ఇదెక్కడి దుర్మార్గం. భర్త చేతుల్లో భార్య ఓ ఆస్తిలా ఉంటుందన్నమాట. అంటే.. భర్త .. తనకు ఇష్టం అయితే భార్యను ఆస్తిలా వేరే వారికి ఇవ్వవొచ్చన్నమాట. ఇప్పుడీ చట్టాన్ని రద్దు చేయడం వల్ల.. సుప్రీంకోర్టు వివాహేదర సంబంధాల్ని ప్రొత్సహించలేదు. వివాహేతర సంబంధాల్ని సమర్థించలేదు కూడా. ఈ చట్టం ప్రకారం.. ఓ స్త్రీని ఆస్తిగా చూసే పురుషుడి .. పురుషాధిక్య విలువల్ని మాత్రమే ప్రీంకోర్టు ప్రశ్నించింది.

పరస్పర విశ్వాసమే పెళ్లికి ప్రాతిపదిక..!

కూతురుకు తండ్రి రాజు కాదు. అలాగే భార్యకు భర్త రాజు కాదు.. మాత్రమే సుప్రీంకోర్టు చెప్పింది. భారత రాజ్యాంగం ప్రకారం..స్త్రీ, పురుషులు సమానమే. స్త్రీ స్వేచ్చను పురుషులు నియంత్రించలేదు.అది ఏ స్వేచ్చ అయినా కనీయండి..!. సుప్రీంకోర్టు వివాహేతర బంధాల్ని సమర్థించిందనేది.. వక్రీకరణ. సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే… స్త్రీ, పురుషుల వివాహం అనేది పరస్పర నమ్మకంతో.. విశ్వాసంతో .. అంగీకారంతో ఉండేది. ఈ నమ్మకం.. విశ్వాసం దెబ్బతింటే.. విడాకులకు వెళ్తారు. ఆ కోణంలోనే సుప్రీం కోర్టు విశ్లేషించింది. కానీ… కొంత మంది.. విశృంఖల శృంగారానికి .. వివాహేతర బంధాలకు అన్వయించేస్తున్నారు. సోషల్ మీడియాలో ఈ ప్రచారం ఎక్కువగా జరుగుతోంది. సుప్రీంకోర్టు… విశృంఖల శృంగారాన్ని ప్రొత్సహించలేదు. సుప్రీంకోర్టు వివాహేతర బంధాల్ని సమర్థించలేదు. వివాహేతర బంధం వల్ల పెళ్లి రద్దు కావడం కూడా తప్పేమీ లేదు. మ్యారేజ్ అనేది ఓ సోషల్ కాంట్రాక్ట్. ఇద్దరు పరస్పర నమ్మకంతో పెళ్లి చేసుకుంటారు. ఆ నమ్మకం దూరమైనప్పుడు విడిపోతారు. విడాకులు తీసుకుంటారు. అంతే తప్ప మరో అర్థం లేదు. సెక్షన్ 497లో ఉన్న లింగ వివక్షను మాత్రమే సుప్రీంకోర్టు ప్రశ్నించింది.

ప్రైవేటు లైఫ్‌ జరిగే వాటితో క్రిమినల్ చర్యలేమిటి…?

సుప్రీంకోర్టు తీర్పును… లోతుగా..అధ్యనయనం చేయకండా… విశ్లేషణలు చేస్తున్నారు. పత్రికలు కూడా అలాగే రాస్తున్నాయి. విశృంఖల శృంగారానికి సుప్రీంకోర్టు అంగీకరించిందని రాశారు. ఎక్కడ అంగీకరించింది..? సుప్రీంకోర్టు తీర్పు గురించి తెలుసుకోకుండా రాస్తారు. వివాహ బంధానికి ప్రాతిపదిక విశ్వాసం. ఆ విశ్వాసమే పోయిన తర్వాత .. అది మహిళ అయినా… మగ అయినా విడిపోవడం సహజమే. దీన్నే సుప్రీంకోర్టు చెప్పింది. అంతే కానీ… సుప్రీంకోర్టు పాశ్చాత్య నాగరికత ప్రభావానికి లోనైంది.. అంటూ.. విచిత్రమైన వ్యాఖ్యాలు చేయడం కరెక్ట్ కాదు. సుప్రీంకోర్టు వివాహేతర సంబంధం తప్పు కాదని చెప్పలేదు. వివాహేతల సంబంధాలు ఉన్నప్పుడు..అది విడాకులకు కారణం కావొచ్చని కూడా చెప్పింది. ప్రైవేటు లైఫ్ లో ఉండే సంబంధాన్ని మనం క్రిమినల్ యాక్ట్ గా చూడాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు చెప్పింది. వివాహేతర సంబంధాలు కూడా… పూర్తిగా ప్రైవేటు లైఫ్. వాటిని నిరూపించడం కూడా సాధ్యం కాదు. అందుకే సుప్రీంకోర్టు తీర్పును… విశృంఖలంగా అన్వయించుకోవడం దుర్మార్గం.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.