మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డికి కంటి మీద కునుకు ఉండటం లేదు. ఆయన మంత్రి పదవినే కలవరిస్తున్నారు. మంత్రి పదవి ఇవ్వకపోతే ముఖ్యమంత్రి అయిపోవాలని ప్లాన్ చేసుకుంటున్నారు. ఇందు కోసం బెదిరింపులకు దిగుతున్నారు. తాజాగా మున్సిపల్ ఎన్నికల్లో విజయాల తర్వాత తన నియోజకవర్గంలో ఓ ర్యాలీ తీసి.. అవే వ్యాఖ్యలుచేశారు. రాబోయే రోజుల్లో తనకు మంత్రి పదవి వస్తుందన్నారు. మంత్రి కాకపోతే….ముఖ్యమంత్రిని అవుతానని ప్రకటించారు. మునుగోడు మీరు చూసుకోండి…తెలంగాణ నేను చూసుకుంటానని కూడా ప్రకటించారు. నాకు అడుక్కోవడం రాదు…మర్యాదగా ఇచ్చిన మాటకు కట్టుబడి మంత్రి పదవి ఇవ్వండి….లేదంటే లాక్కునే దాకా చూసుకోకండి అని పరోక్షంగా రేవంత్ రెడ్డికి హెచ్చరికలు పంపారు.
మంత్రి పదవికి రేవంతే అడ్డమని రాజగోపాల్ రెడ్డి నమ్మకం
రేవంత్ రెడ్డి మంత్రి పదవి కోసం విజ్ఞప్తులు..హెచ్చరికల స్టేజ్‌ను దాటి బెదిరింపుల దాకా వచ్చారు. తన పదవికి రేవంత్ రెడ్డే అడ్డం అని గట్టిగా నమ్ముతున్నారు. అందుకే ఆయననే టార్గెట్ చేస్తున్నారు. ఢిల్లీ పర్యటనలో రేవంత్ రెడ్డి మీడియా ప్రతినిధులతో తెలంగాణ కాంగ్రెస్ లో నేనే రాజు..నేనే మంత్రినని..తనకు ఎవరూ పోటీ లేరని స్పష్టం చేశారు. మున్సిపల్ ఎన్నికల ఫలితాలతో హైకమాండ్ వద్ద ఆయన పలుకుబడి మరింత పెరిగి ఉంటుంది. ఇప్పుడు ఆయన చెప్పేమాటే వేదమవుతుంది. అందుకే ఇక తనకు మంత్రి పదవిరాదని.. రాజగోపాల్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతానని బెదిరింపులకు దిగుతున్నారు.
ఆత్రమే తప్ప ఆలోచన లేని రాజకీయం
రాజగోపాల్ రెడ్డి రాజకీయం చూస్తే ఆయనకు ఆత్రమే తప్ప రాజకీయ ఆలోచన లేదని ఎవరికైనా అర్థం అవుతుంది. 2019లో కాంగ్రెస్ ఓడిపోతే ఆ పార్టీ కోసం పని చేసిన పాపాన పోలేదు. ఆ పార్టీ పీక నొక్కడానికి ఏడాది ముందు ఉపఎన్నికలు కూడా తెచ్చారు. కానీ మళ్లీ కాంగ్రెస్ గెలుస్తుందని అంచనాలు వచ్చాక ..కాంగ్రెస్ లో చేరారు. ఆయన సోదరుడు కూడా తక్కువచేయలేదు. అయితే ఆయన తర్వాత సర్దుకున్నారు. ఇప్పుడు ఆయన మంత్రిగా ఉన్నారు. కాంగ్రెస్ తో సంపాదించుకుని ..కాంగ్రెస్ పైనే కుట్రలు చేసి.. ఇప్పుడు కాంగ్రెస్ నే బెదిరిస్తున్నారు రాజగోపాల్ రెడ్డి.
ఇచ్చే ఆలోచన ఉన్నా ఇక ఇవ్వరు!
నిజానికి ఇప్పుడు ఇలాంటి బెదిరింపుల వల్ల .. ఒక వేళ మంత్రి పదవి ఇవ్వాలనుకున్నా ఇవ్వరు. ఎందుకంటే బెదిరించడం వల్ల ఇచ్చారన్న సంకేతాలు పార్టీ నేతల్లోకి వెళ్తాయి. దాని వల్ల మరికొందరు ఇలా తయారవుతారు. ఆయనకు మంత్రి పదవి ఇవ్వాలంటే సోదరుడ్ని పక్కన పెట్టాలి. రాజగోపాల్ రెడ్డిని టీములోకి తీసుకోవడం అంటే.. సమస్యల్ని నెత్తిన పెట్టుకోవడమేనని రేవంత్ రెడ్డికి తెలియకుండా ఉంటుందా..ఆయన కన్నా సోదరుడు వెంకటరెడ్డే బెటరని ఆయననే కొనసాగిస్తారు.కానీ రాజగోపాల్ రెడ్డి మాత్రం.. తన పిట్ట బెదిరింపులతో పదవులు పొందాలనే ప్రయత్నాలు మాత్రం మరో మూడేళ్లు కొనసాగే అవకాశం ఉంది.
