భారతీయ కార్పొరేట్ రంగంలో అకౌంటింగ్ మోసాలు కొత్త కాదు గానీ, తాజాగా వెలుగులోకి వచ్చిన రాజేష్ ఎక్స్‌పోర్ట్స్ ఉదంతం మాత్రం దేశ ఆర్థిక వ్యవస్థ పునాదులనే కుదిపేస్తోంది. మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ జారీ చేసిన తాజా తాత్కాలిక ఆదేశాల ప్రకారం.. ఈ బంగారం, ఆభరణాల తయారీ సంస్థ గడిచిన ఐదేళ్ల కాలంలో ఏకంగా 15.15 లక్షల కోట్ల రూపాయల ఆదాయాన్ని తప్పుగా చూపించి మార్కెట్‌ను గుడ్డిగా నమ్మించింది. కేవలం ప్రాసెసింగ్ ఛార్జీలను మాత్రమే ఆదాయంగా చూపించాల్సిన చోట, థర్డ్-పార్టీకి చెందిన బంగారం మొత్తం విలువను తమ సొంత టర్నోవర్‌గా చూపించి ఈ భారీ డొల్లతనాన్ని సృష్టించినట్లు సెబీ బట్టబయలు చేసింది.
కళ్ళు మూసుకున్న కాపలాదారులు
రూపాయల్లోనో, వందల కోట్లలోనో కాదు.. ఏకంగా 15 లక్షల కోట్ల రూపాయల టర్నోవర్‌ను కాగితాల మీద సృష్టించి మార్కెట్‌ను బురిడీ కొట్టించడం అనేది ఒక రోజులోనో, ఒక వ్యక్తి వల్లనో సాధ్యమయ్యే పని కాదు. ఇన్నేళ్లుగా ఈ డొల్ల వ్యాపారం నిరాటంకంగా సాగుతుంటే కంపెనీ ఇంటర్నల్ ఆడిటర్లు, స్టాట్యుటరీ ఆడిటర్లు, , రేటింగ్ ఏజెన్సీలు ఏం చేస్తున్నాయనే ప్రాథమిక ప్రశ్న తలెత్తుతోంది. సెబీ దర్యాప్తుకు సదరు ఆడిటర్లు కనీసం వర్కింగ్ పేపర్స్ కూడా సబ్మిట్ చేయకుండా సహాయ నిరాకరణ చేయడం చూస్తుంటే.. కార్పొరేట్ మేనేజ్మెంట్తో గేట్ కీపర్లు ఏ స్థాయిలో లాలూచీ పడ్డారో అర్థమవుతోంది. స్విస్ డేటా ప్రొటెక్షన్ చట్టాలు, ప్రైవేట్ కాన్ఫిడెన్షియల్ అగ్రిమెంట్ల సాకు చూపిస్తూ ఇంతకాలం భారతీయ నియంత్రణ సంస్థల కళ్ళు కప్పడం.. వ్యవస్థల నిస్తేజత్వానికి పరాకాష్ట.
సామాన్యుడి సొమ్ముతో జూదం
ఈ మొత్తం కుంభకోణంలో అత్యంత బాధాకరమైన, ఆందోళనకరమైన అంశం ఏమిటంటే.. సామాన్య భారతీయ పౌరుడి నమ్మకానికి నిలువెత్తు రూపమైన ‘లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్’ ఈ సంస్థలో ఏకంగా 10.8 శాతం భారీ వాటాను కలిగి ఉండటం. దేశంలోనే అతిపెద్ద ఇన్వెస్ట్మెంట్ పబ్లిక్ ఇన్స్టిట్యూషన్ అయిన ఎల్ఐసీ, ఇంత పెద్ద డొల్ల కంపెనీలో వేల కోట్లు పెట్టుబడిగా పెట్టే ముందు కనీస డ్యూ డిలిజెన్స్ ఎందుకు చేయలేకపోయింది? కేవలం ఎల్ఐసీ మాత్రమే కాదు, కెనరా బ్యాంక్ వంటి ప్రభుత్వ రంగ బ్యాంకులు కూడా ఈ సంస్థకు వందల కోట్ల అప్పులు ఇచ్చి, ఇప్పుడు వాటిని వసూలు చేయలేక సదరు ఆస్తులను వేలానికి పెట్టాల్సిన దుస్థితి తెచ్చుకున్నాయి. ఎల్ఐసీ పాలసీదారులు, సామాన్య ఇన్వెస్టర్లు దాచుకున్న రక్తాన్ని కూడబెట్టిన సొమ్ము ఇప్పుడు ఈ షేర్ల పతనంతో ఆవిరైపోతుంటే, ఈ నష్టానికి ఎవరు బాధ్యత వహిస్తారు?
భారతీయ మార్కెట్ విశ్వసనీయతకు గండం
భారతదేశం ప్రస్తుతం ప్రపంచంలోనే వేగంగా ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్థగా, గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ హబ్‌గా ప్రగతి పథంలో దూసుకుపోతోంది. ఇలాంటి తరుణంలో రాజేష్ ఎక్స్‌పోర్ట్స్ వంటి లిస్టెడ్ కంపెనీలలో ఇటువంటి అతిపెద్ద ఫైనాన్షియల్ మిస్రిప్రజెంటేషన్ బయటపడటం అంతర్జాతీయ ఇన్వెస్టర్లలో మన మార్కెట్ డిస్క్లోజర్ ఫ్రేమ్‌వర్క్ పై తీవ్ర అపనమ్మకాన్ని కలిగిస్తుంది. ఒకే ఒక్క షేర్‌హోల్డర్ ఇచ్చిన ఫిర్యాదుతోనే ఇంతటి భారీ అక్రమం బయటపడిందంటే, వ్యవస్థాగతంగా మన వద్ద ఉన్న పర్యవేక్షణ రాడార్లు ఎంత బలహీనంగా ఉన్నాయో స్పష్టమవుతోంది. ఇలాంటి డొల్ల కంపెనీలు మన స్టాక్ మార్కెట్ ఇండెక్స్‌లలో ఇంకెన్ని ఉన్నాయో అనే భయం ఇన్వెస్టర్లను వెంటాడుతోంది.
తక్షణ దిద్దుబాటు చర్యలు అవసరం
ఇప్పటికైనా కాలయాపన చేయకుండా కేవలం ప్రమోటర్లపై ట్రేడింగ్ నిషేధం విధించడంతో సరిపెట్టకుండా, ఈ లూప్‌హోల్స్‌కు కారణమైన ఆడిటింగ్ సంస్థలపై, నిఘా పెట్టడంలో విఫలమైన రేటింగ్ ఏజెన్సీలపై కఠినమైన క్రిమినల్ చర్యలు తీసుకోవాలి. కార్పొరేట్ గవర్నెన్స్ సూత్రాలు కేవలం కాగితాలకే పరిమితం కాకుండా, విదేశీ అనుబంధ సంస్థల అకౌంట్లను కూడా థర్డ్-పార్టీ వెరిఫికేషన్ చేసేలా నిబంధనలను కఠినతరం చేయాలి. లేనిపక్షంలో, ఇలాంటి అక్రమ సంస్థల వల్ల భారత ఆర్థిక వ్యవస్థ బాహ్య సౌందర్యం ఎంత మెరుస్తున్నా, లోపల ఉన్న డొల్లతనం ఒకేసారి బద్దలైతే.. మొదటికే మోసం వచ్చే ప్రమాదం పొంచి ఉంది.
