మార్చి 27న రావాల్సిన సినిమా పెద్ది. ఇప్పుడు ఏప్రిల్ 30కి వెళ్లిపోయింది. అంటే నిర్మాతల దగ్గర అటూ ఇటుగా నెల రోజుల సమయం దొరికింది. అయితే.. ఇప్పుడు కూడా ఈ సినిమా రిలీజ్ అనేది సందేహమే అన్నది ఇన్ సైడ్ వర్గాల టాక్. దాదాపు 45 రోజుల పాటు షూటింగ్ మిగిలి ఉందని, మార్చి నెలాఖరు వరకూ నాన్ స్టాప్ గా షూటింగ్ జరిపితే కానీ సినిమా పూర్తవదని తెలుస్తోంది. ఏప్రిల్ లో ప్రీ ప్రొడక్షన్ పనులు చూసుకోవాలి, ప్రమోషన్లు చేసుకోవాలి. ఇది పాన్ ఇండియా సినిమా. రెండు మూడు ప్రెస్ మీట్లు, ఈవెంట్లతో సర్దేద్దాం అనుకొంటే కుదరదు. నార్త్ లో వీలైనంత కవర్ చేయాలి. ఇదంతా చిత్రబృందానికి, ముఖ్యంగా రామ్ చరణ్‌కి పెద్ద టాస్కే.
పైగా హీరోగా రామ్ చరణ్‌కి ఈ సినిమా చాలా కీలకం. ‘ఆర్.ఆర్.ఆర్’ తరవాత ‘గేమ్ ఛేంజర్’తో పెద్ద దెబ్బ పడింది. ఆ సినిమా ఫ్లాప్ అయినప్పుడు చరణ్‌కి ఎవరూ పెద్దగా నిందించలేదు. అంతా శంకర్ నే అన్నారు. ‘ఆర్.ఆర్.ఆర్’ లాంటి సినిమా చేసిన హీరోని ఎలా చూపించాలో, ఎలా వాడుకోవాలో అర్థం కాలేదా? అంటూ కార్నర్ చేశారు. ‘పెద్ది’ అలా కాదు. తాను ఏరి కోరి బుచ్చిబాబుతో చేస్తున్నాడు. బుచ్చి కూడా ‘ఉప్పెన’తో హిట్ ఇచ్చిన దర్శకుడే. సో.. ఈసారి తప్పు జరిగితే చరణ్‌ని సైతం కార్నర్ చేస్తారు. సో.. తప్పు జరక్కూడదు. సినిమా కోసం ఎంత కష్టపడాలో.. ప్రమోషన్స్ కోసం కూడా అంతే కష్టపడాలి. నార్త్ లో ఈ సినిమాని జనంలోకి తీసుకెళ్లగల వాహనం.. చరణ్ మాత్రమే. చరణ్ ఎంత ప్రచారం చేస్తే అంతగా ఈ సినిమాకు మైలేజీ ఉంటుంది. సో.. అనుకొన్న సమయానికి సినిమా పూర్తి చేయడం ఒక ఎత్తయితే, ఈ సినిమాని జనంలోకి తీసుకెళ్లడం మరో ఎత్తు. తెలుగులో చరణ్ పెద్దగా ప్రమోట్ చేయకపోయినా పర్వాలేదు. తన ఫ్యాన్ ఫాలోయింగ్ తనకుంది. కానీ నార్త్ లో అలా కాదు. కాబట్టి.. ఫోకస్ అంతా అక్కడే ఉంటుంది. సో.. చరణ్ ఈసారి రెండు వైపుల నుంచి కష్టపడాల్సిందే.
