వెంకటేష్, రానా కలిసి ఓ వెబ్ సిరీస్ చేశారంటే కచ్చితంగా ఆసక్తి నెలకొంటుంది. అలా… అందరి ఎట్రాక్షన్ తెచ్చుకొన్న వెబ్ సిరీస్ ‘రానా నాయుడు’. నెట్ ఫ్లిక్స్ వేదికగా విడుదలైన ఈ సిరీస్‌లోని తొలి సీజన్ సూపర్ హిట్. కానీ.. బూతులు మాత్రం భరించలేకపోయారు జనాలు. వెంకీకి ఉన్న ఫ్యామిలీ ఈమేజ్ ఈ సిరీస్‌తో మొత్తం పోయింది. మళ్లీ ఆయన ‘సంక్రాంతికి వస్తున్నాం’తో తన ఇమేజ్‌ని మళ్లీ కాపాడుకోవాల్సివచ్చింది. సీజన్ 2 కూడా రెడీ అయ్యింది. ఈనెలలోనే స్ట్రీమింగ్ కానుంది. ఈసారి మాత్రం బూతులకు కత్తెర పడింది. సీజన్ 2 ట్రైలర్ అంతా యాక్షన్ పై ఫోకస్ పెట్టారు. ఒక్క బూతు, అసభ్యకరమైన షాట్ కనిపించలేదు. ఫ్యామిలీ ఆడియన్స్‌కు ఇది శుభవార్త అనుకోవాలి.
ఈసారి ‘ఫ్యామిలీ’ అనే ఎమోషన్ పై దృష్టి పెట్టారు. రానా పాత్రకు వచ్చే కొత్త కష్టాలు, అందులోంచి తాను బయటపడిన విధానంపై ఫోకస్ చేసినట్టు అనిపించింది. యాక్షన్ కంటెంట్ చాలా వుంది. అయితే ట్రైలర్ కోసం ‘బూతుల్ని’ దాచి పెట్టారా, సిరీస్‌లో వాటిని ఒకొక్కటిగా బయటకు తీసుకొస్తారా? అనేది సస్పెన్స్. అభయ్ చోప్రా దర్శకత్వంలో రూపొందిన ఈ సిరీస్‌లో అర్జున్ రాంపాల్, కృతి కర్బందా, సుశాంక్ సింగ్ కీలక పాత్రలు పోషించారు. ఈనెల 13 నుంచి నెట్ ఫ్లిక్స్ లో చూడొచ్చు.