తెలంగాణ కాంగ్రెస్లో వర్గ పోరు కొత్త మలుపు తిరిగింది. ఇప్పటి వరకు నాయకుల మధ్య ఉన్న వ్యక్తిగత విభేదాలు, ఇప్పుడు ఏకంగా సామాజిక వర్గాల మధ్య చిచ్చుకు దారితీశాయి. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన ఒక చిన్న వ్యాఖ్య, పార్టీలో అగ్రవర్ణ వర్సెస్ బీసీ వివాదాన్ని రాజేసింది. జగ్గారెడ్డిని ఉద్దేశించి ఆయనకు పీసీసీ ఇస్తే వచ్చే ఎన్నికల్లో 100 సీట్లు గెలుస్తాం అని కోమటిరెడ్డి అనడం.. ప్రస్తుత పీసీసీ చీఫ్ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ సామర్థ్యాన్ని ప్రశ్నించడమేనని బీసీ నేతలు మండిపడుతున్నారు.
మహేష్ గౌడ్ నాయకత్వంపై నమ్మకం లేదా?
బీసీ సామాజిక వర్గానికి చెందిన మహేష్ కుమార్ గౌడ్ పీసీసీ పగ్గాలు చేపట్టిన తర్వాత పార్టీ వరుస విజయాలను అందుకుంటోంది. ముఖ్యంగా ఇటీవలి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ భారీ మెజారిటీతో గెలవడం, అలాగే రాష్ట్రవ్యాప్తంగా జరిగిన పంచాయతీ ఎన్నికల్లో దాదాపు 2,600 పైగా సర్పంచ్ స్థానాలను కాంగ్రెస్ మద్దతుదారులు కైవసం చేసుకోవడం ఆయన నాయకత్వానికే దక్కుతుందని బీసీ కార్పొరేషన్ల ఛైర్మన్లు గుర్తు చేస్తున్నారు. ఇంతటి సానుకూల ఫలితాలు వస్తున్న తరుణంలో, పీసీసీ మార్పు ప్రస్తావన తేవడం వెనుక బీసీ నాయకత్వాన్ని అణగదొక్కే కుట్ర ఉందని ఈరవత్రి అనిల్ వంటి నేతలు బహిరంగంగానే విమర్శిస్తున్నారు.
ఢిల్లీ దాకా వెళ్ళిన సెగ.. కోమటిరెడ్డి యూ-టర్న్
ఈ వివాదం కాస్తా చినికి చినికి గాలివానలా మారి ఏఐసీసీ పెద్దల వరకు చేరింది. రాష్ట్ర కేబినెట్ మంత్రులు, సీనియర్లు బహిరంగంగా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించడమేనని అధిష్ఠానం సీరియస్ అయినట్లు సమాచారం. దీంతో మంత్రి కోమటిరెడ్డి వెంటనే స్పందిస్తూ వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. తాను జగ్గారెడ్డిని కేవలం రంజాన్ ఏర్పాట్ల విషయంలోనే అభినందించానని, మహేష్ గౌడ్ తన మిత్రుడని, ఆయన నాయకత్వాన్ని తక్కువ చేయడం తన ఉద్దేశం కాదని చెప్పుకొచ్చారు. అయితే, అప్పటికే జరగాల్సిన రాజకీయ నష్టం జరిగిపోయింది.
రేవంత్ రెడ్డి హెచ్చరికలు.. సద్దుమణిగేనా?
అసెంబ్లీ సమావేశాల వేళ ప్రతిపక్షాలను ధీటుగా ఎదుర్కోవాల్సిన సమయంలో, సొంత పార్టీలోనే ఈ రచ్చ జరగడం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తలనొప్పిగా మారింది. సీఎల్పీ సమావేశంలోనే ఆయన మంత్రులకు, ఎమ్మెల్యేలకు స్పష్టమైన హెచ్చరికలు జారీ చేశారు. అనవసర వివాదాలకు దూరంగా ఉండండి, పార్టీ లైన్ దాటవద్దు అని క్లాస్ పీకారు. అయినప్పటికీ, ఈ సామాజిక సమీకరణాల రచ్చ ఇప్పుడప్పుడే సద్దుమణిగేలా కనిపించడం లేదు. బీసీ నేతలు తమ నాయకత్వాన్ని కాపాడుకునేందుకు ఏకమవుతుండగా, అగ్రవర్ణ నేతలు తమ పట్టు కోసం ప్రయత్నిస్తుండటం కాంగ్రెస్ లో ఆసక్తికరంగా మారింది.
