ఆంధ్రప్రదేశ్లో అనధికార భవనాల క్రమబద్ధీకరణ పథకం కింద దరఖాస్తు చేసుకునే యజమానులకు రాష్ట్ర ప్రభుత్వం ఊరటనిచ్చే ప్రకటన చేసింది. గతంలో కేవలం లైసెన్స్డ్ టెక్నికల్ పర్సన్ల ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకునే అవకాశం ఉండగా, ఇప్పుడు సామాన్య ప్రజలు కూడా నేరుగా ఆన్లైన్ పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకునే వెసులుబాటు కల్పించింది. పారదర్శకతను పెంచడం , దరఖాస్తు ప్రక్రియను మరింత సులభతరం చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
తాజా ఉత్తర్వుల ప్రకారం, భవన యజమానులు అధికారిక వెబ్సైట్ bps.ap.gov.in సందర్శించి నేరుగా తమ వివరాలను నమోదు చేయవచ్చు. ఈ పోర్టల్ ద్వారా దరఖాస్తుదారులు తమ భవనానికి సంబంధించిన అపరాధ రుసుము ఎంత అవుతుందో స్వయంగా చూసుకోవడమే కాకుండా, ఆన్లైన్లోనే పేమెంట్ చేసే సౌకర్యం కూడా ఉంది. జనవరి 1, 1985 నుండి ఆగస్టు 31, 2025 మధ్య కాలంలో నిర్మించిన అనధికార భవనాలు లేదా మంజూరైన ప్లాన్ కంటే అదనంగా నిర్మించిన నిర్మాణాలకు ఈ పథకం వర్తిస్తుంది.
ఈ పథకం కింద దరఖాస్తు చేసుకోవడానికి ప్రభుత్వం మార్చి 11, 2026ని గడువు తేదీగా నిర్ణయించింది. దరఖాస్తుతో పాటు ప్రాథమికంగా రూ. 10,000 చెల్లించాల్సి ఉంటుంది. మున్సిపల్ కార్పొరేషన్లు, పురపాలక సంఘాలు , పట్టణాభివృద్ధి సంస్థల పరిధిలోని గ్రామ పంచాయతీల్లో ఉన్న నివాస, వాణిజ్య భవనాలకు ఈ బీపీఎస్ వర్తిస్తుంది. నిర్ణీత గడువులోగా క్రమబద్ధీకరణ చేసుకోని పక్షంలో, ఆయా భవనాలను అనధికారికంగానే పరిగణిస్తామని , భవిష్యత్తులో కఠిన చర్యలు ఉంటాయని అధికారులు హెచ్చరిస్తున్నారు.
