ప్రీమియ‌ర్ షో రిపోర్ట్ : రెండు రెళ్లు ఆరు

ఏ పుట్ట‌లో ఏ పాముందో అన్న‌ట్టు.. ఏ చిన్న సినిమా ఎప్పుడు ఎలాంటి సంచ‌ల‌నం సృష్టిస్తుందో చెప్ప‌లేం! అందుకే సినిమా చిన్న‌దైనా స‌రే, పెద్ద మ‌న‌సుతో చూడాల్సిందే. ఎప్పుడు పెళ్లి చూపులు లాంటి సినిమా వ‌స్తుందో ఎవ‌రు చెప్ప‌గ‌లం?? అందుకే చిన్న సినిమాల‌పైనా ఓ క‌న్నేసి ఉంచుతున్నాయి ట్రేడ్ వ‌ర్గాలు. వాళ్లంద‌రి దృష్టినీ ఆక‌ర్షిస్తున్న సినిమా.. ‘రెండు రెళ్లు ఆరు’. ఇది వ‌ర‌కు ఈ సినిమాపై ఏమంత ఫోక‌స్ లేదు. ఎప్పుడైతే సాయి కొర్ర‌పాటి చేతికి ఈ సినిమా వెళ్లిందో అప్ప‌టి నుంచీ మాట్లాడుకోవ‌డం మొద‌లెట్టారు. ఆడియో ఫంక్ష‌న్‌కి రాజ‌మౌళి రావ‌డంతో.. ఈ సినిమాపై దృష్టి మ‌రింత పెరిగింది. ట్రైల‌ర్లు ఆక‌ట్టుకొంటున్నాయి. ఇటీవ‌ల హైద‌రాబాద్ రామానాయుడు స్టూడియోలో ప్రీమియ‌ర్లు కూడా ప‌డ్డాయి. కొంత‌మంది పాత్రికేయుల‌కు ఈ సినిమా ప్ర‌త్యేకంగా చూపించారు. కంటెంట్ విష‌యంలో రెండు రెళ్లు ఆరు ఆక‌ట్టుకొంద‌ని, కొత్త ద‌ర్శ‌కుడైనా సినిమాని బాగా న‌డిపించాడ‌ని, పాట‌లు, ఫొటోగ్ర‌ఫీ, డైలాగ్స్‌.. ఇలా అన్నీ బాగా కుదిరాయ‌ని ఇన్ సైడ్ వ‌ర్గాల టాక్‌.

ఈమ‌ధ్య వ‌చ్చిన చిన్న సినిమాల్లో క‌చ్చితంగా రెండు రెళ్లు ఆరు మంచి స్థానాన్ని సంపాదించుకొంటుంద‌న్న‌ది ఈ సినిమా చూసిన వాళ్లు చెబుతున్న మాట‌. స‌రికొత్త క‌థ‌, అందులో ల‌వ్ ట్రాక్‌.. మ‌రీ ముఖ్యంగా సీరియ‌ల్ హీరోల‌పై సాగిన కామెడీ.. ఇవ‌న్నీ ఆక‌ట్టుకొన్నాయ‌ని, న‌రేష్‌, ర‌వి కాలేల న‌ట‌న ఈచిత్రానికి ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌గా నిలుస్తుంద‌ని చెబుతున్నారు. అయితే… క‌థానాయ‌కుడు కాస్త వీక్‌గా ఉన్నాడ‌ని, అత‌ని స్థానంలో క‌నీసం నాగ‌శౌర్య‌లాంటి న‌టుడున్నా… ఈ సినిమా మ‌రో ‘పెళ్లి చూపులు’ అయ్యుండేద‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. ఈ వారం `నిన్ను కోరి` విడుద‌ల అవుతోంది. నాని సినిమా కాబ‌ట్టి ఓపెనింగ్స్‌కి ఢోకా ఉండ‌దు. మ‌రి `రెండు రెళ్లు ఆరు` నానికి ఎలాంటి పోటీ ఇస్తుందో చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com