ఫీజు రీఎంబర్స్ మెంట్ బకాయిులు చెల్లించలేదని సమ్మె చేస్తున్న కాలేజీలకు గట్టి హెచ్చరికలు జారీ చేయడం ద్వారా రేవంత్ రెడ్డి దారికి తెచ్చుకున్నారు. ఆ దెబ్బకు చిన్న కాంట్రాక్టర్లు, ఆస్పత్రులు కూడా దారికి వస్తాయి. జూబ్లిహిల్స్ ఎన్నికలకు ముందు రాజకీయ కుట్రలతో తమపై దాడి చేస్తే తాము అంతకు మించి చేయగలమని రేవంత్ గట్టి సంకేతాలు పంపడంతో అంతా సైలెంట్ అయిపోయారు. కానీ ఇది పరిష్కారం కాదు. సీఎం రేవంత్ దీనికి పరిష్కారం చూపాల్సిందే.
గత ప్రభుత్వ బకాయిలు గుదిబండలు
ఏ ప్రభుత్వానికైనా గత ప్రభుత్వం నుంచి వారసత్వంగా అప్పులు వస్తాయి. వాటిని కట్టను అంటే కుదరదు. కట్టి తీరాల్సిందే. అలా కేసీఆర్ ప్రభుత్వం బిల్లులు మాత్రమే కాకుండా ఆస్పత్రులకు, కాలేజీలకు,కాంట్రాక్టర్లకు బిల్లులు పెండింగ్ పెట్టిపోయింది. వాటిని చెల్లించాల్సిందే. పోయి కేసీఆర్ ను అడగండి అని రేవంత్ అంటున్నారు. కానీ సాధ్యం కాదు. ఆ బకాయిలు పెట్టింది కేసీఆర్ కావొచ్చు కానీ.. వ్యక్తిగతంగా కాదు. ప్రభుత్వం తరపునే. ప్రభుత్వం చెల్లించాల్సిందే.
ఈ సమస్యలు పెరుగుతాయి కానీ తగ్గవు!
చిన్న కాంట్రాక్టర్లు చేసే పనులు ప్రజల మౌలిక సదుపాయాలకు సంబంధించినవి, పేదల విద్యకు సంబంధించినది ఫీజు రీఎంబర్స్ మెంట్, వైద్యం కూడా అలాంటి దే.ఇలాంటి విషయంలో అనర్హులు ఉండవచ్చు. ఆయా ఇనిస్టిట్యూషన్స్ అవినీతికి పాల్పడవచ్చు. అయితే ఆ సమస్యను పరిష్కరించాలి కానీ అలా జరుగుతోందని నిధులు ఆపేస్తామంటే ఇబ్బందికరం అవుతుంది. ప్రజల్ని ఇబ్బంది పెట్టినట్లుగా అవుతుంది. వారు తమ సేవల్ని ఆపేయడం ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చినట్లవుతుంది. వాటిని అలా బెదిరింపుల ద్వారా దుప్పటి కప్పి ఉంచితే.. పెరుగుతాయి కానీ తగ్గవు.
ఏదో ఓ సామరస్య పరిష్కారం అవసరం
ఇవాల్టికి వారు వెనక్కి తగ్గి ఉండవచ్చు కానీ..రేపు మరోసారి తమ సమస్యను గట్టిగా వినిపించడానికి వస్తారు. సమయం చూసి ఇబ్బంది పెడతారు. రాజకీయాల్లో ఉన్నప్పుడు అన్ని పనులు బెదిరింపుతో సాధ్యం కాకపోవచ్చు. అందుకే ఏదో ఓ సామరస్య పరిష్కారం చూపించాల్సి ఉంటుంది. అందుకే రేవంత్ ఈ అంశంపై సీరియస్ గా దృష్టి పెట్టాల్సి ఉందన్న అభిప్రాయం వినిపిస్తోంది.


