ఇక తమిళనాడులో రేవంత్ మార్క్ ప్రచారం జరగనుంది. ఆయనను స్టార్ క్యాంపెయినర్‌గా తెలంగాణ ప్రభుత్వం నియమించింది. తమిళనాడు రాజకీయ ముఖచిత్రం కేరళ కంటే భిన్నమైనది. అక్కడ డీఎంకే అధినేత ఎం.కె. స్టాలిన్ కాంగ్రెస్ పార్టీకి మిత్రుడు. కూటమిలో కాంగ్రెస్ భాగం. కాబట్టి, కేరళలో ఎల్‌డిఎఫ్‌పై చేసినట్లుగా ఇక్కడ అధికార పక్షంపై విమర్శలు చేసే అవకాశం లేదు.
తమిళనాడు వెర్షన్ బి-టీమ్ విమర్శలు
రేవంత్ రెడ్డి రాజకీయ శైలిలో ప్రత్యర్థులను బీజేపీకి బి-టీమ్‌గా చిత్రీకరించడం ఒక ప్రధాన అస్త్రం. తమిళనాడులో స్టాలిన్ పై అలాంటి విమర్శలుచేయలేరు. అన్నాడీఎంకే నేరుగా బీజేపీతో పొత్తులో ఉంది. గతంలో తెలంగాణలో బీఆర్ఎస్ను, కేరళలో ఎల్‌డిఎఫ్‌ను ఎలాగైతే బీజేపీ మిత్రపక్షాలుగా అభివర్ణించారో ఇక్కడ అలా విమర్శించడానికి అవకాశం లేదు.
విజయ్‌పై విమర్శలు చేస్తారా?
నటుడు విజయ్ రాజకీయ అరంగేట్రం చేసి తమిళగ వెట్రి కళగం పార్టీని స్థాపించడం ఈ ఎన్నికల్లో ఒక కీలక మలుపు. విజయ్ గతంలో కేసీఆర్‌తో సమావేశమై రాజకీయ సలహాలు తీసుకున్నారనే అంశాన్ని రేవంత్ తన ప్రచారంలో ప్రస్తావించే అవకాశం ఉంది. కేసీఆర్ అపజయాలను, ఆయన పాలనలోని లోపాలను ఉదాహరణగా చూపుతూ.. కేసీఆర్ శిష్యరికం చేస్తున్న విజయ్ తమిళనాడుకు ఏం చేయగలరనే ప్రశ్నలను ఆయన సంధించవచ్చు. విజయ్‌కు ఉన్న అపారమైన ఫ్యాన్ ఫాలోయింగ్‌ను దృష్టిలో ఉంచుకుని, కేరళలో చేసినంత ఘాటుగా కాకుండా, కొంత దౌత్యపరమైన విమర్శలకే పరిమితమయ్యే అవకాశం ఉంది.
స్టార్ క్యాంపెయినర్ల పంజా
తెలంగాణ నుంచి ముగ్గురు ఉద్దండులను కాంగ్రెస్ హైకమాండ్ తమిళనాడుకు పంపుతోంది. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిలు అక్కడ ప్రచారం నిర్వహించనున్నారు. ముఖ్యంగా 12 నియోజకవర్గాల ఇన్‌ఛార్జ్‌గా ఉత్తమ్ కుమార్ రెడ్డి నియామకం, క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ పట్టు పెంచుకోవడానికేనని స్పష్టమవుతోంది. రేవంత్ రెడ్డి తన దూకుడుతో ప్రజలను ఆకర్షిస్తే, భట్టి విక్రమార్క తన సంయమనంతో సామాజిక వర్గాలను సమన్వయం చేస్తారు. తమిళనాడులోని విద్యావంతులు, యువతను ఆకట్టుకోవడానికి తెలంగాణలో తాము అమలు చేస్తున్న గ్యారెంటీలను రేవంత్ ఒక రోల్ మోడల్‌గా చూపే అవకాశం ఉంది.
