తెలంగాణ సీఎంగా బాధ్యతలు చేపట్టి నేటికి రెండేళ్లు అవుతుంది. కాంగ్రెస్ పార్టీకి చారిత్రాత్మక విజయాన్ని అందించిన తర్వాత హైకమాండ్ ఆయనను సీఎం అభ్యర్థిగా ఖరారు చేయడంతో 2023 డిసెంబర్ ఏడో తేదీన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఎన్నో ఆశలు..మరెన్నో అంచనాల మధ్య రేవంత పాలన ప్రారంభమయింది.తన పాలకు ప్రజా పాలన అని పేరు పెట్టారు. ప్రగతి భవన్ పేరుతో కట్టుకున్న గడీలు బద్దలు కొట్టారు. ప్రజాభవన్ పేరు మార్చారు. అక్కడ్నుంచి ఇప్పటి వరకూ ఆయన పాలనలో మార్పు రాలేదు. ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటూ.. ఆర్థికపరమైన క్లిష్టతలను అధిగమిస్తూ.. ముందుకు సాగుతున్నారు. రెండేళ్లలో కొంచెం ఇష్టం..కొంచెం కష్టం అన్నట్లుగా ఆయన పాలన సాగింది.
కేసీఆర్ పాలనకు మించిన సంక్షేమం
తెలంగాణ ప్రభుత్వం హామీ ఇచ్చిన సంక్షేమ పథకాల్లో కొన్ని తప్ప మిగతావన్నీ అమలు చేసే ప్రయత్నం చేశారు. అధికారంలోకి వచ్చిన తొలి రోజే ఉచిత బస్సును తీసుకు వచ్చారు. తర్వాత సిలిండర్ల హామీ నెరవేర్చారు. తర్వాత రెండువందల యూనిట్ల ఉచిత విద్యుత్ పథకం అమల్లోకి వచ్చింది. అనూహ్యంగా తెల్ల కార్డుపై సన్నబియ్యం ఇవ్వడం ప్రారంభించారు. రెండు లక్షల రుణమాఫీ చేశారు. ఇందిరమ్మ క్యాంటీన్లను అధునీకరించారు. ఇందిరమ్మ ఇల్లనూ ఇస్తున్నారు. కేసీఆర్ హయాంలో ఇలాంటి సంక్షేమం లేదు.కానీ రేవంత్ మాత్రం.. అర్హులైన వారందరికీ పథకాలు అందించే ప్రయత్నం చేశారు. కీలకమైన పెన్షన్ల పెంపు, మహిళలకు నెలకు పదిహేను వందల చొప్పున ఇవ్వడం, తులం బంగారం వంటి హామీలు ఇప్పటి వరకూ అమలు కాలేదు. ఆర్థిక పరిమితులు రేవంత్ కు గుదిబండగా మారాయి.
అభివృద్ధిలో ఇప్పటికీ ప్రణాళికలే – కార్యాచరణ నిల్
అభివృద్ధి విషయంలో కేసీఆర్ పాలనతో పోలిస్తే రేవంత్ వెనుకబడిపోయారు. దానికి కారణం ఆర్థిక వెసులుబాటు లేకపోవడం, గత పాలనలో తప్పులు వెంటాడుతూండటం. కేసీఆర్ ఎనిమిది లక్షల కోట్లు అప్పు చేసి పెట్టిపోయారని రేవంత్ పదే పదే చెబుతూ ఉంటారు. కానీ ఆయన తెలంగాణ అభివృద్ధి విషయంలో చాలా పెద్ద ప్రణాళికలు వేసుకున్నారు. ఫ్యూచర్ సిటీ , మెట్రో, మూసీ సుందరీకరణ, ట్రిపుల్ ఆర్ ప్రాజెక్టు ఇలా ఎన్నో పనులు అనుకున్నారు. ఈ రెండేళ్లలో ఈ పనులకు కనీసం ప్రణాళికలు రెడీ చేసుకోలేదు. ఫైనాన్షియల్ మోడల్ రెడీ కాలేదు. అంతా ఆగమ్య గోచరం.కానీ రేవంత్ రెడ్డి మాత్రం రోజు రోజుకు నమ్మకం పెంచుకుని ముందడుగు వేస్తూనే ఉన్నారు.
రాజకీయంగా భారీ విజయాలు
రాజకీయంగా ఈ రెండేళ్ల కాలంలో భారీ విజయాలను రేవంత్ తన ఖాతాలో వేసుకున్నారు. ఫిరాయింపులు కాకుండా అదనంగా రెండు అసెంబ్లీ సీట్లను గెల్చుకున్నారు. రెండు బీఆర్ఎస్ సిట్టింగ్ సీట్లను ఎన్నికల్లో భారీ తేడాతో గెల్చుకున్నారు.కంటోన్మెంట్ లో బీఆర్ఎస్ డిపాజిట్ కోల్పోయింది. అదే సమయంలో హైకమాండ్ వద్ద పలుకుబడి పెంచుకున్నారు. ఉపరాష్ట్రపతి అభ్యర్థిని తానే అందించారు. కొన్ని పాలసీల విషయంలో బీజేపీకి వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి కల్పించారు. అదే సమయంలో ప్రభుత్వాధినేతగా..కేంద్రంతో వీలైనంత సఖ్యతగా ఉండి.. నిధులు రాబట్టుకునే ప్రయత్నం చేశారు.
వచ్చే మూడేళ్లు చాలా కీలకం
వచ్చే మూడేళ్లు రేవంత్ రెడ్డి మరో టర్మ్ తనకు గ్యారంటీ అనే నమ్మకంతో ఉన్నారు. అయితే దాన్ని సాకారం చేసుకోవాలంటే వచ్చే మూడేళ్లు చాలా కీలకం. గొప్పగా మేలు చేయకపోయినా.. కీడు చేయలేదని.. అహంకారంతో పాలన చేయలేదని ప్రజలు అనుకునేలా చేసుకోగలిగితే.. ఆయన లక్ష్యం ముందుకు వస్తుంది. ఆ దిశగా సాగాలంటే.. గడిచిపోయిన రెండేళ్లకు మించి పాలన చేయాల్సి ఉంటుంది.
