ఒకప్పుడు కన్నడ సినిమా అంటే పెద్దగా వైబ్స్ ఉండేవి కావు. తక్కువ బడ్జెట్ తో చుట్టేస్తారు అనే నింద మోసేశారు. కానీ కేజీఎఫ్, కాంతార లాంటి సినిమాలు వచ్చాక ఆ ముద్ర పూర్తిగా చెరిగిపోయింది. అక్కడా భారీ బడ్జెట్ సినిమాలు వస్తున్నాయి. అక్కడా హీరోల పారితోషికాలు చుక్కల్ని తాకుతున్నాయి. యశ్, రిషబ్ లాంటి వాళ్లు నయా సూపర్ స్టార్లుగా వెలుగొందుతున్నారు. వాళ్ల పారితోషికాలు కూడా ఊహకు అందనంత పెరుగుతున్నాయి. ‘కేజీఎఫ్’ తరవాత యశ్ కెరీర్ పూర్తిగా మారిపోయింది. ‘కేజీఎఫ్ 2’ కోసం దాదాపు రూ.50 కోట్లు ఇచ్చారని సమాచారం. ‘టాక్సిక్’ కోసం అటూ ఇటుగా రూ.75 కోట్లు అందుకొన్నాడని తెలుస్తోంది. ఇప్పుడు రిషబ్ శెట్టి కూడా ఈ మార్క్ చేరుకొన్నాడు. ‘జై హనుమాన్’ కోసం రిషబ్ రూ.80 కోట్లు డిమాండ్ చేశాడని తెలుస్తోంది. యశ్ తో సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ ఓ చిత్రాన్ని రూపొందిస్తోంది. అశ్విన్ గంగరాజు దర్శకుడు. ఈ సినిమాకూ అటూ ఇటుగా రూ.80 కోట్లు అడిగాడని తెలుస్తోంది. ‘కాంతార’ తో రిషబ్ కి పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు దక్కింది. ‘కాంతార 2’ దాదాపు రూ.300 కోట్లు సాధించింది. అందుకే ఇప్పుడు రిషబ్ శెట్టి పారితోషికం కూడా రెట్టింపు అయ్యింది.
‘కాంతార’ తరవాత రిషబ్ శెట్టి కి తెలుగులోనూ అభిమానులు ఏర్పడ్డారు. తన సినిమాలకు భారీ ఓపెనింగ్స్ వస్తున్నాయి. కాబట్టి మన నిర్మాతలు కూడా రిషబ్ అడిగినంత ఇవ్వడానికి రెడీ అవుతున్నారని అనుకోవొచ్చు. ‘జై హనుమాన్’ బడ్జెట్ రూ.200 కోట్లపైమాటే. సితార లో తెరకెక్కుతున్న సినిమా కూడా హై బడ్జెట్ సినిమానే. ఈ రెండింటిలో ‘జై హనుమాన్’ ముందుగా సెట్స్‌పైకి వెళ్లే అవకాశం ఉంది. వీటిలో ఒక్క హిట్ పడినా రిషబ్ రూ.100 కోట్ల హీరో అయిపోతాడు. అదే జరిగితే.. రూ.100 కోట్ల పారితోషికం అందుకొన్న తొలి కన్నడ స్టార్ గా తన పేరు నిలిచిపోతుంది.
